ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. రాహుల్ గాంధీకి పీయూష్ గోయల్ కౌంటర్

  • అమెరికా సుంకాలపై కేంద్రం, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన మాటల యుద్ధం
  • ప్రధాని మోదీ మౌనంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు
  • కాంగ్రెస్ హయాంలో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఒప్పందాలు జరిగాయన్న గోయల్
  • జాతీయ ప్రయోజనాలకే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టీకరణ
  • దేశానికి లాభం ఉంటేనే వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని వెల్లడి
  • జులై 9తో ముగియనున్న అమెరికా సుంకాల సస్పెన్షన్ గడువు
అమెరికా విధించనున్న సుంకాల గడువు సమీపిస్తున్న వేళ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయ వేడి రాజుకుంది. ప్రధాని మోదీ ఈ విషయంపై మౌనంగా ఉన్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు.

శనివారం పీయూష్ గోయల్ మాట్లాడుతూ "ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యం. బలహీనంగా ఉన్న దేశాన్ని బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాని కృషి చేస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంతోనైనా పోటీ పడగల సత్తా భారత్‌కు ఉందని మేము విశ్వసిస్తున్నాం" అని అన్నారు. దేశానికి ఏది మంచిదో ఆలోచించే ప్రధాని సుంకాల విషయంలో నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.

గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా, కేవలం ప్రజలకు ప్రయోజనం చేకూరితేనే ఏ దేశంతోనైనా వాణిజ్య ఒప్పందాలు ఉంటాయని, లేదంటే ఎంతమాత్రం తలొగ్గే ప్రసక్తే లేదని గోయల్ తేల్చిచెప్పారు. మోదీ ప్రభుత్వం యూఏఈ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని, ప్రస్తుతం యూరోపియన్ యూనియన్, అమెరికా, ఒమన్ వంటి దేశాలతో చర్చలు జరుపుతోందని ఆయన వివరించారు.

అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. పరస్పర సుంకాల సస్పెన్షన్‌కు జులై 9తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని, చివరికి ట్రంప్ సుంకాలకు తలొగ్గడం ఖాయమని రాహుల్ గాంధీ విమర్శించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలకే గోయల్ స్పందించారు.


More Telugu News