'సికందర్ కా ముఖద్దర్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

Movie Name: Sikandar Ka Muqaddar

Release Date: 2024-11-29
Cast: Jimmy Sheirgil, Avinash Tiwary, Tamannaah Bhatia, Rajeev Mehta,
Director: Neeraj Pandey
Producer: Shital Bhatia
Music: Payal Dev
Banner: Friday Storytellers
Rating: 2.50 out of 5
  • హిందీలో రూపొందిన 'సికందర్ కా ముఖద్దర్'
  • నవంబర్ 29 నుంచి ఓటీటీలో అందుబాటులోకి 
  • పాతకథను పట్టుగా చెప్పలేకపోయిన డైరెక్టర్
  • ఆసక్తికరంగా సాగని స్క్రీన్ ప్లే  
  • ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయిన కంటెంట్

తమన్నా బాలీవుడ్ లోకి ఎట్రీ ఇచ్చి చాలాకాలమే అయింది. అక్కడే తాను అనుకున్న స్థాయికి చేరుకోవడానికి ఆమె గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆమె చేసిన మరో సినిమానే 'సికందర్ కా ముఖద్దర్'. ఆమెతో పాటు జిమ్మీ షెర్గిల్ - అవినాశ్ తివారి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, నవంబర్ 29 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: 2009 - 2024 మధ్య కాలంలో .. ముంబై నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. 2009లో ముంబైలోని ఓ రద్దీ ప్రాంతంలో డైమండ్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ దొంగతనం చేయడానికి నలుగురు వ్యక్తులు ప్రయత్నించగా, పోలీసులు వారిని షూట్ చేస్తారు. ఈ హడావిడిలోనే 50 - 60 కోట్ల రూపాయల ఖరీదు చేసే డైమండ్స్ మాయమవుతాయి. ఆ డైమండ్స్ షాపుకు సంబంధించిన వ్యక్తి, హోమ్ మినిస్టర్ భార్య తరపు బంధువు కావడంతో స్పెషల్ ఆఫీసర్ జస్విందర్ సింగ్ (జిమ్మి షెర్గిల్) రంగంలోకి దిగుతాడు. 

 ఆ డైమండ్స్ షాప్ తరఫున ఆ సమయంలో స్పాట్ లో ఉన్నది కామినీ సింగ్ (తమన్నా) .. మంగేశ్ ( రాజీవ్ మెహతా). ఇక కంప్యూటర్ టెక్నీషియన్ సికందర్ (అవినాశ్ తివారి) కూడా అక్కడే ఉంటాడు. సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్న జస్విందర్ సింగ్, అక్కడున్నవారిలో ఈ ముగ్గురినీ అనుమానిస్తాడు. ముగ్గురినీ అదుపులోకి తీసుకుంటారు. అక్కడ జరిగిన దొంగతనంతో తనకి సంబంధం లేదనీ, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని తాను దగ్గరుండి చూసుకోవాలని సికందర్ కోరతాడు. 

డైమండ్స్ కి సంబంధించిన సంస్థలో తాను చాలా కాలంగా పనిచేస్తున్నాననీ, తన నిజాయితీని గురించిన విచారణ చేసుకోమని మంగేశ్ అంటాడు. తాను కొత్తగా చేరాననీ .. తనకేమీ తెలియదని కామినీ సింగ్ బ్రతిమాలుతుంది. మరి ఆ డైమండ్స్ ను కాజేసినదెవరు? వాళ్లను పట్టుకోవడానికి జస్విందర్ సింగ్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు? ఆ సమయంలో ఆయనకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి?  అనేది కథ.     

విశ్లేషణ: ఇది దర్శకుడు నీరజ్ పాండే తయారు చేసుకున్న కథనే. విపుల్ రావల్ తో కలిసి ఆయన స్క్రీన్ ప్లే చేశాడు. డైమండ్స్ దొంగిలించబడటం అనే నేసథ్యంలో గతంలో బాలీవుడ్ లో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ విషయంలో ఈ కథలో కాస్త కొత్తదనాన్ని చూపించడానికి దర్శకుడు ట్రై చేశాడు. తన అంచన .. పరిశోధనపై గల నమ్మకంతో, ఓ ముగ్గురు వ్యక్తులను ఆ పోలీస్ ఆఫీసర్ అనుమానిస్తాడు. ఆయన అంచనా సరైనదేనా .. కాదా? అనే విషయంలో ఆసక్తిని రేకెత్తిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. 

సాధారణంగా ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే ప్రాణంగా నిలుస్తూ ఉంటుంది. మరి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలిచిందా అంటే లేదనే చెప్పాలి. వజ్రాలను ఎవరు కాజేశారు? అందువలన వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారు? అనేదే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే అంశం. అయితే అందుకు సంబంధించిన సన్నివేశాలు ఫ్లాష్ బ్యాక్ లో రావడమే మైనస్ అయింది. హీరో - విలన్ ఇద్దరూ కూర్చుని తాపీగా ఒకరికి ఒకరు ఫ్లాష్ బ్యాక్ చెబుతూ ఉంటారు. 

ఆల్రెడీ ప్రేక్షకుల కళ్లముందు హీరో - పోలీస్ ఆఫీసర్ ఇద్దరూ కూడా కూల్ గా .. కులాసాగా కనిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు గతంలో వాళ్లు పడిన కష్టాలు .. ఇబ్బందులకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ కావు. ఎందుకంటే ఇప్పుడు వాళ్లు బాగానే ఉన్నారు కదా అనే అనుకుంటారు. ఇక దొంగ - పోలీస్ ఆటలో హీరో పోలీస్ అయినా అయ్యుండాలి .. దొంగ అయినా అయ్యుండాలనే సూత్రం బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఫాలో అవుతున్నదే. అందువలన తెరపై కనిపించే పాత్రలను బట్టి ఆడియన్స్ వెంటనే ఒక అంచనాకి వచ్చేస్తారు.     
    
పనితీరు: 'డైమండ్స్ దొంగతనం - ఇన్వెస్టిగేషన్' అనే అంశం చుట్టూ దర్శకుడు అల్లుకున్న ఈ కథ, చాలా హడావిడిగా మొదలవుతుంది. ఆ వెంటనే చప్పబడిపోయి నిదానంగా నడవడం మొదలుపెడుతుంది. హీరోతో తమన్నా లవ్ లో పడటం .. పోలీస్ ఆఫీసర్ నుంచి ఆయన భార్య విడిపోవడం వంటి సన్నివేశాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి.

తన అనుమానం నిజమేనని నిరూపించడం కోసం, ఓ పోలీస్ ఆఫీసర్ 15 ఏళ్లపాటు ఆ కేసుకి సంబంధించిన వ్యక్తులను ఫాలో చేయడం వాస్తవానికి చాలా దూరంగా అనిపిస్తుంది. మొదటి నుంచి చివరివరకూ కథను నిదానంగా నడిపించిన దర్శకుడు, చివర్లో ట్విస్టులపై ట్విస్టులు ఇవ్వడానికి ప్రయత్నించాడు. ముంబై .. ఆగ్రా .. అబుదాబీ అంటూ కథను పరిగెత్తించాడు.  కానీ  ఆశించిన ప్రయోజనం నెరవేరలేదనే చెప్పాలి. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. 

అరవింద్ సింగ్ ఫొటోగ్రఫీ .. పాయల్ దేవ్ నేపథ్య సంగీతం .. ప్రవీణ్ ఎడిటింగ్ కథకి తగినట్టుగానే సాగాయి. హీరో - పోలీస్ ఆఫీసర్ ఇద్దరూ కూర్చుని ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవడమే ఆడియన్స్ లో అసహనాన్ని కలిగిస్తుంది. అలా కాకుండా పరుగు - వేట ఒకేసారి .. నేరుగా చూపిస్తే ఆ ఎఫెక్ట్ వేరేగా ఉండేదేమో అనిపిస్తుంది. అభ్యంతరకరమైన సన్నివేశాలు .. సంభాషణలు లేవు గనక, కుదిరితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.  

Trailer

More Movie Reviews