ఏ పాలసీ మంచిదో ఆన్ లైన్ లో చూసుకుంటున్నారా...?

టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు ఏ బీమా పాలసీ తీసుకోవాలన్నా... వయసు, ఇతర వివరాల ఆధారంగా ప్రీమియం ఎంతో సులభంగా ఇంట్లో నుంచే తెలుసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కంపారిజన్ పోర్టల్స్ ఇందుకు అవకాశం కల్పిస్తున్నాయి. కానీ, వీటితో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి...

టర్మ్, ఎండోమెంట్, మనీబ్యాక్, యులిప్, వెహికల్ ఇన్సూరెన్స్... బీమా ఏదైనా వాటిని అణువణువూ పోల్చి చూపించే ఇన్సూరెన్స్ కంపారిజన్ పోర్టల్స్ చాలానే ఉన్నాయి. వీటినే వెబ్ అగ్రిగేటర్స్ అని కూడా అంటారు. సాధారణంగా ఆన్ లైన్ లో ఏం కావాలన్నా...? ముందుగా గూగుల్ కు వెళ్లడమే అందరూ చేసే పని. ఏది కావాలో టైప్ చేయడం ఆలస్యం... సంబంధిత వెబ్ సైట్ల యూఆర్ఎల్స్ వరుసగా దర్శనమిస్తాయి. వాటిని క్లిక్ చేసి ఆ సైట్లలోకి వెళ్లడం చేస్తుంటారు. ఇన్సూరెన్స్ కంపారిజన్ సైట్లలోకి కూడా అలానే వెళుతుంటారు.

ఉదాహరణకు విచ్ ఈజ్ ద చీపెస్ట్ టర్మ్ పాలసీ అని టైప్ చేయగా... అసలు పాలసీ సమాచారం గూగుల్ లో కనిపించదు. బదులుగా ఈ కంపారిజన్ సైట్లే దర్శనమిస్తాయి. వాటిలోకి వెళ్లిన తర్వాత అయినా సమాచారం తెలియజేస్తాయా? అంటే ముందు పేరు, వయసు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ వివరాలు అడుగుతాయి. ఆ తర్వాత కానీ, అసలు సమాచారం దగ్గరకు తీసుకెళ్లవు. 

వివరాలు ఎందుకు...?

చాలా మంది అడిగిన వివరాలు వెంటనే ఇచ్చేస్తారు. మరి ఈ వివరాలు ఎందుకు అడుగుతున్నాయో...? ఆలోచించారా..? ఆ వివరాల ఆధారంగా ప్రయోజనం పొందేందుకు. మీరు కోరిన సమాచారం ఆధారంగా మీ ఆసక్తి ఏంటో, కాంటాక్ట్ సమాచారాన్ని బీమా కంపెనీలన్నింటికీ చేరవేస్తాయి కంపారిజన్ సైట్లు. ఒక విధంగా ఇవి బీమా ఏజెంట్ల వలే వ్యవహరిస్తాయి.

బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏ) నిబంధనల మేరకు ఇవి చేయాల్సిన పని ఏంటంటే యూజర్ ఇచ్చిన ఇన్ పుట్స్ (వివరాలు) ఆధారంగా సరిపోలే ఉత్పత్తులు, వాటి ప్రయోజనాల మధ్య తేడాల గురించి తెలియజేయాలి. ఒకవేళ యూజర్ ను ఇన్సూరెన్స్ పోర్టల్స్ కు తీసుకెళితే వీటికి ఎలాంటి కమిషన్ రాదు. ఒకవేళ కస్టమర్ అక్కడ పాలసీ కొనుగోలు చేస్తే మాత్రం వాటిపై వెబ్ అగ్రిగేటర్స్ కు కమిషన్ ముడుతుంది. 

ఆన్ లైన్ పాలసీలపై కూడా కమిషన్ 

ఎండోమెంట్, యులిప్, టర్మ్ ప్లాన్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీలపై వెబ్ అగ్రిగేటర్లకు కమిషన్ అందుతుంది. ఆన్ లైన్ లో ఇతరుల ప్రమేయం లేకుండా కొనుగోలు చేసే టర్మ్ ప్లాన్ ల ప్రీమియం తక్కువగా ఉంటుందన్న విషయం తెలుసు. ఎందుకంటే ఏజెంట్లు, బ్రోకర్ల కమిషన్లు ఎలాంటివి ఉండవు కనుక ప్రీమియం తక్కువగా ఉంటుంది. కానీ, ఈ వెబ్ అగ్రిగేటర్ల ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీల పోర్టల్స్ కు వెళ్లి ఆన్ లైన్ టర్మ్ ప్లాన్ కొంటే వాటిపైనా కమిషన్ వెళుతుంది. ఆ భారం ప్రీమియంలో కలుస్తుంది. ఏజెంట్ కు ఎంత కమిషన్ అయితే వెళుతుందో... వెబ్ అగ్రిగేటర్లకు కూడా అంతే మొత్తం వెళుతుంది. 

నీకది- నాకిది...

సరే ఇంత చేసీ ఇన్సూరెన్స్ కంపారిజన్ సైట్లు నిజాయతీగా అన్ని కంపెనీల పాలసీల సమాచారాన్ని కంపేర్ చేసి చూపిస్తాయని భ్రమ పడకండి. అన్ని రకాల ఉత్పత్తులను పోల్చుకుని తక్కువ వ్యయమయ్యే దాన్ని ఎంచుకోవచ్చన్న ఆశతో యూజర్లు కంపారిజన్ సైట్లను ఆశ్రయిస్తుంటారు. కానీ ఈ సైట్లు ఓ ఇన్సూరెన్స్ కంపెనీ ఉత్పత్తుల సమాచారాన్ని తమ సైట్లలో ప్రదర్శించేందుకు ఇంత మొత్తం అని బీమా కంపెనీల నుంచి తీసుకుంటాయి. తమ సైట్ లో ప్రదర్శించినందుకు ఏటా రూ.50వేల రూపాయలను ఓ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వసూలు చేస్తుంటాయి. డబ్బులిచ్చిన కంపెనీ ఉత్పత్తుల వివరాలను మాత్రమే అందుబాటులో ఉంచుతాయి. ఈ ఫీజు చెల్లించకపోతే మంచి కంపెనీలకు చెందిన చక్కని పాలసీల వివరాలకు కూడా చోటు ఉండదు. మరి ఇలాంటి సైట్ల ద్వారా ఉత్తమ పాలసీ ఎంపిక ఎలా సాధ్యమవుతుందో ఆలోచించండి. కంపారిజన్ సమయంలో ఇచ్చిన వివరాలను అగ్రిగేటర్లు బీమా కంపెనీలకు చేరవేస్తారు. ఆయా కంపెనీల నుంచి మార్కెటింగ్ సిబ్బంది కాల్ చేసి మంచి ప్లాన్ ఉందంటూ ఊదరగొడతారు. ఆ విధంగా పాలసీ తీసుకున్నా వెబ్ అగ్రిగేటర్లకు ఎంతో కొంత ముడుతుంది.

సర్వం వ్యాపారమయమే... 

ఉచిత సమాచారం పేరుతో ఇక్కడ జరుగుతున్నది వ్యాపారం అని అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఈ సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వీటిని ఆశ్రయించడం కంటే... విడిగా ఒక్కో బీమా కంపెనీ సైట్ కు వెళ్లండి. అక్కడ కూడా ప్రీమియం ఎంత ఉంటుందో కొటేషన్ పొందవచ్చు. వాటి ఆధారంగా ఏ పాలసీ ప్రయోజనాలు ఏమిటి, ప్రీమియం ఎంతన్నది తెలుసుకుని అనువైన పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. అయితే బీమా కంపెనీ సైట్లలోనూ కొటేషన్ పొందే ముందు కాంటాక్ట్ సమాచారం అడుగుతారు. ఆ తర్వాత బీమా కంపనీల నుంచి కాల్స్ సైతం వస్తాయి. నచ్చితే తీసుకోవడం లేదంటే ఇంటరెస్ట్ లేదని చెప్పి పెట్టేస్తే మరోసారి కాల్ రాదు.


More Articles