స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
నన్ను తాగితే పోతారు.. తాగకండి అని సిగరెట్ పెట్టెల మీద రాసి ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది ప్రజలు సిగరెట్లను తాగుతున్నారు. దీంతో చాలా మంది ఊపిరితిత్తుల కేన్సర్, ఇతర వ్యాధుల`` బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరితిత్తుల సమస్యలతో మరణించే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. పొగ తాగడం వల్లే ఊపిరితిత్తుల కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని అమెరికన్ లంగ్ అసోసియేషన్ కూడా వెల్లడించింది. సిగరెట్ తాగేవారికే కాకుండా సెకండ్ హ్యండ్ స్మోకర్స్ (సిగరెట్ తాగేవారి సమీపంలో ఉండి ఆ సిగరెట్ పొగ పీల్చుకునేవారు)కు కూడా కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. మరి ఊపిరితిత్తుల పనితీరు ఏమిటి, వాటికి వచ్చే సమస్యలేమిటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, ఏయే అలవాట్లకు దూరంగా ఉండాలి.. తదితర అంశాలను విపులంగా తెలుసుకుందాం..
అత్యంత కీలకం ఇవే..
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి. స్పాంజిల్లా ఉండే ఈ ఊపిరితిత్తులు గాలిలోంచి ఆక్సిజన్ ను సేకరించి.. శరీరానికి అందిస్తాయి. అదే సమయంలో శరీరంలో ఉత్పత్తయ్యే కార్బన్ డయాక్సైడ్, ఇతర ఉత్పన్నాలను గాలిలోకి విడుదల చేస్తాయి. మనిషి జీవింత ఉన్నంతకాలం ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది. రెండు నిమిషాల పాటు ఊపిరితిత్తులు పనిచేయకపోతే మరణం సంభవిస్తుంది. అంతటి కీలకమైన ఊపిరితిత్తులకు పలు రకాల ఇన్ఫెక్షన్లు, పొగతాగడం వంటి అలవాట్లు, గాలికాలుష్యం వంటివాటి కారణంగా వ్యాధులు వస్తాయి. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.చాలా క్లిష్టమైన పనితీరు..
అమెరికన్ లంగ్ అసోసియేషన్ ప్రకారం, పెద్దవారు నిమిషానికి 15 నుంచి 20 సార్లు, రోజులో 20,000 సార్లు ఊపిరి తీసుకుంటారు. పెద్దవారిలో కంటే పిల్లల్లో ఊపిరి తీసుకునే వేగం ఎక్కువగా ఉంటుంది. వారు నిమిషానికి 40 సార్లు గాలి పీల్చుకుని, వదిలేస్తారు. పెద్దవారిలో సగటు శ్వాస రేటు నిమిషానికి 12 నుంచి 16 సార్లుగా ఉంటుంది. శరీరం అస్వస్థతకు గురైనా, ఇతర వ్యాధులేమైనా ఉన్నా.. ఈ శ్వాస తీసుకునే వేగంలో మార్పులు ఏర్పడుతుంటాయి.- వాస్తవానికి శ్వాసక్రియ చెప్పుకోవడానికి చాలా సులువుగానే అనిపిస్తున్నప్పటికీ అది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ.
- కుడి ఊపిరితిత్తి మూడు భాగాలుగా, ఎడమ ఊపిరితిత్తి రెండు భాగాలుగా విభజించబడి ఉంటాయి. వాటిని తమ్మెలుగా అంటారు. మనం గాలి పీల్చుకున్నప్పుడు అవి ఉబ్బి.. గాలి వదిలినప్పుడు తిరిగి యథాస్థితికి వస్తాయి.
- శ్వాస తీసుకున్నప్పుడు ముక్కు నుంచి శ్వాస నాళం ద్వారా గాలి ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది.ఊపిరితిత్తుల్లో శ్వాస నాళికలు ఉంటాయి. వాటిని బ్రోంకియొల్స్ లేదా వాయు గదులుగా పిలుస్తారు. మొత్తంగా మన ఊపిరితిత్తుల్లో సుమారు 4.80 కోట్ల (480 మిలియన్స్) వాయు గదులు ఉంటాయి. ఈ వాయు గదులకు కేశనాళికల (అత్యంత సన్నని రక్త నాళాల) ద్వారా రక్తం సరఫరా అవుతుంది.
- మనం గాలిని లోపలికి పీల్చుకున్నప్పుడు అది ఈ వాయుగదుల్లోకి చేరుతుంది. అక్కడ రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి.. గాలిలోని ఆక్సిజన్ రక్తంలోకి మార్పిడి అవుతుంది. అనంతరం ఊపిరితిత్తుల్లోని గాలి నిశ్వాస ద్వారా బయటకు వెళ్లిపోతుంది. వాయుగదుల్లో ఆక్సిజన్ నిండిన రక్తం గుండెకు చేరుతుంది. అక్కడి నుంచి శరీరంలోని వివిధ అవయవాలకు పంప్ అవుతుంది. నిరంతరంగా జరుగుతూనే ఉండే ఈ ప్రక్రియనే శ్వాసక్రియగా పేర్కొంటాం.
జాగ్రత్తలు చేపట్టకపోతే ఎన్నో సమస్యలు
మానవ శరీరంలో ప్రతి అవయవానికి సంబంధించి వ్యాధులు, ఇతర సమస్యలు తలెత్తిన తరహాలోనే ఊపిరితిత్తులకు సంబంధించి కూడా పలు రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి జన్యు సంబంధితమైనవి, శరీర నిర్మాణ లోపాలతో సమస్యలు కావొచ్చు, పొగతాగడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు, బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధుల కారణంగా ఏర్పడే ఇబ్బందులు వంటివి కూడా కావొచ్చు. ఇటీవలి కాలంలో ఆస్తమా, ఊపిరితిత్తుల కేన్సర్లు, ఇన్ఫెక్షన్లు, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అలాంటి సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చు.విజృంభిస్తున్న ఆస్తమా..
ఇటీవలి కాలంలో ఆస్తమా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. దీని బారిన పడడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ఆస్తమా బారినపడిన వారి ఊపిరితిత్తుల్లోని వాయు మార్గాలు ఎర్రబడి కుచించుకుపోతాయి. దాంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. విపరీతమైన దగ్గు, ఛాతీలో నొప్పి వంటివి తలెత్తుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమాతో కోట్ల మంది బాధపడుతున్నారని.. ఒక్క అమెరికాలోనే సుమారు 25 లక్షల మంది ఆస్తమా బాధితులు ఉన్నారని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది పిల్లలు ఆస్తమాతో బాధపడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక భారతదేశంలోనూ చిన్న పిల్లల్లో పది శాతం మంది వరకు ఏదో ఒక స్థాయిలో ఆస్తమా బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.- శరీరంలో విటమిన్-డీ తక్కువగా ఉంటే ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన కారణాలు తెలియకపోయినప్పటికి ఉబ్బసం వల్ల ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ. శిశువుల్లో జన్యు లోపం వల్ల కూడా ఇది సంభవించవచ్చు.
- వేర్వేరు వ్యక్తులకు ఆస్తమా రావడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. అందువల్ల ఆస్తమాతో బాధపడుతున్నవారు తమ సమస్య ఏమిటన్నది కచ్చితంగా తెలుసుకుని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
- తరచూ జలుబు, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతుంటే అది ఆస్తమా అయి ఉండవచ్చని ప్రాథమికంగా భావించవచ్చు. దీనిని వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
- ఊబకాయం, శరీరంలో అధిక కొవ్వుతో బాధపడుతున్న వారు తొందరగా ఆస్తమా బారిన పడే అవకాశాలు ఎక్కువ.
- ఆస్తమా సమస్యను పూర్తిగా నివారించగలిగే మందులు, చికిత్సా పద్ధతులేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. జాగ్రత్తలు మాత్రమే నివారణకు తోడ్పడతాయి. ఆస్తమా వస్తే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
- అయితే చిన్న పిల్లల్లో వచ్చే కొన్నిరకాల స్వల్పస్థాయి ఆస్తమాలకు మాత్రం తగిన చికిత్స తీసుకుంటే.. వారు పెద్దయ్యే కొద్దీ ఆస్తమా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే వారు విపరీతమైన చలికి గురికావడం, దుమ్ము, కాలుష్యం వంటివాటికి దూరంగా ఉండడం అవసరం.
ఊపిరితిత్తుల కేన్సర్..
ఇటీవలి కాలంలో ఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగిపోతున్నాయి. పొగతాగే అలవాటుకు తోడు విపరీతంగా దుమ్మూ, ధూళితో కూడిన పరిసరాల్లో ఉండేవారు ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నారు. స్త్రీలలో కంటే పురుషుల్లో కేన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు అమెరికాలోని మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలో ఊపిరితిత్తుల కేన్సర్ విజృంభణపై వారు పరిశోధన చేశారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల కేన్సర్లు, రావడానికి కారణమైన అధ్యయనాలను పరిశీలించి క్రోడీకరించారు. పొగతాగే అలవాటు, ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు వంటి పొగ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారు ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నట్లు తేల్చారు.ఈ కేన్సర్ బారిన పడితే దగ్గుతున్నప్పుడు నోట్లో నుంచి రక్తం రావడం, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం, తల నొప్పి, ఎముకల నొప్పి, గొంతు నొప్పి వంటివి కనిపిస్తాయి. వీటితోపాటు దీర్ఘకాలంగా దగ్గు ఉండడం, శ్వాస తీసుకోవడం, వదలడంలో ఇబ్బందిగా ఉండడం, ఆకలి మందగించడం, గొంతు బొంగురు పోవడం, అలసట, బలహీనంగా తయారవడం, ఏదైనా తినేటప్పుడు మింగడానికి కష్టమవడం వంటి లక్షణాలు ఉంటాయి.ఈ కేన్సర్లు మూడు రకాలు.. ఎన్నో కారణాలు
ఊపిరితిత్తుల కేన్సర్ ను పల్మనరీ కార్సినోమా అని కూడా అంటారు. ముఖ్యంగా మూడు రకాల ఊపిరితిత్తుల కేన్సర్లు ఉన్నాయి. ఒకటి స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ (ఎస్ సీఎల్ సీ), రెండోది నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ (ఎన్ఎస్ సీఎల్ సీ), మూడోది మాలిగ్నెంట్ మేసోథెలియోమో కేన్సర్. ఇందులో స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ ఎక్కువగా వస్తుంది. మాలిగ్నెంట్ మేసోథెలియోమో కేన్సర్ చాలా అరుదుగా వస్తుంది. ఊపిరితిత్తుల కేన్సర్ కు ప్రధాన కారణం పొగతాగే అలవాటే. ముఖ్యంగా చైన్ స్మోకర్లు, బీడీలు వంటివి తాగేవారికి ప్రమాదం ఎక్కువ.- ఇంట్లో పొగతాగే వారి నుంచి పొగతాగని వారికి (సెకండ్ హ్యాండ్ స్మోకింగ్) దాని ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ. అలాంటిచోట పొగతాగని వారికి కూడా కేన్సర్ రావడానికి 20 నుంచి 30 శాతం అవకాశాలు ఉంటాయి.
- గాలి కాలుష్యం కారణంగా కూడా కేన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ. ముఖ్యంగా దుమ్ము, ధూళి, విష రసాయనాలు ఎక్కువగా ఉండే చోట నివసించేవారికి, అలాంటి చోట పనిచేసేవారికి కేన్సర్ వస్తుంది.
- అమెరికా నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ (ఎన్ సీఐ) అధ్యయనం ప్రకారం.. కుటుంబంలో ఎవరికైనా కేన్సర్ ఉంటే తర్వాత జనరేషన్ కు కూడా వచ్చే అవకాశం ఉంది.
నివారణ, చికిత్స మార్గం
వ్యాధి తీవ్రతను బట్టి కేన్సర్ కు వివిధ దశల్లో చికిత్సను అందిస్తారు.- శస్త్రచికిత్స సమయంలో కేన్సర్ సోకిన కణజాలాన్ని తొలగిస్తారు. ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉంటే కేన్సర్ సోకిన ఊపిరితిత్తి భాగాన్ని పూర్తిగా తొలగిస్తారు.- కీమోథెరపీ చికిత్స కూడా ఉంటుంది. కొన్ని రకాల ఔషధాలను ఉపయోగించి కేన్సర్ కణాలను చంపుతారు. దీన్ని ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. దీనికారణంగా శరీరం మొత్తం రసాయన ఔషధాల ప్రభావానికి గురవుతుంది.
- రేడియేషన్ అనేది కేన్సర్ కణాలను చంపడానికి ఉపయోగించే పవర్ ఫుల్ పక్రియ. కేన్సర్ సోకిన భాగాలకు నేరుగా రేడియేషన్ కిరణాలను పంపించి.. కేన్సర్ కణాలు నాశనమయ్యేలా చేస్తారు. ఇది కాస్త క్లిష్టమైన ప్రక్రియ.
- టార్గెటెడ్ డ్రగ్ థెరపీ అని కొత్త రకం కేన్సర్ చికిత్సను ఇటీవల శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు. దీనిలో నేరుగా కేన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేసే ఔషధాలను శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ తరహా చికిత్స కేన్సర్ కణాలను నాశనం చేయడంతోపాటు కొత్తగా కేన్సర్ కణాలు ఏర్పడకుండా నియంత్రిస్తుంది.
సీవోపీడీ..
ఊపిరితిత్తుల్లో వచ్చే దీర్ఘకాలిక వ్యాధిని క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్ (సీవోపీడీ) అంటారు. ఊపిరితిత్తుల క్షీణత కారణంగా ఇది సంభవిస్తుంది. వాయు నాళాలు, వాయు గోళాల (గదులు) వాపు వ్యాధులను సీవోపీడీలుగా గుర్తిస్తారు. సీవోపీడీ మరణాల్లో దాదాపు 80 శాతం నుంచి 90 శాతం మంది పొగతాగడం కారణంగానే సంభవిస్తున్నట్లు అమెరికన్ కేన్సర్ సొసైటీ పేర్కొంది. తొలిదశలోనే ఈ సమస్యను గుర్తిస్తే.. ఔషధాలు, తగిన జాగ్రత్తల ద్వారా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ వ్యాధి ముదిరితే ఒక్కోసారి ఊపిరితిత్తుల మార్పిడి చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదని వైద్యులు తెలిపారు. అమెరికాలో సీవోపీడీ వ్యాధితో దాదాపు కోటి మంది బాధపడుతున్నట్లు అంచనా.ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్లు
ఊపిరితిత్తులకు సంబంధించిన న్యుమోనియా వంటి అంటు వ్యాధులు సాధారణంగా వైరస్ వల్ల సంభవిస్తాయి. అంతేకాకుండా శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వల్ల కూడా ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ రావచ్చు అని ఒహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. దీని లక్షణాలు లింఫ్ గ్రంథుల వాపు, దగ్గులో రక్తం రావడం, నిరంతర జ్వరం వంటి ఇతర లక్షణాలు ఉంటాయి. అధిక బరువు కూడా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. బరువు అధికంగా ఉండటం వల్ల శ్వాస తీసుకోవడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుందన్నారు.ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా సిగరెట్లు, బీడీల వంటివి తాగడం మానేయాలి. సిగరెట్ లో ఉండే 7 వేల రసాయనాలు ఊపిరితిత్తుల్లోని 70 శాతం కణాలను నాశనం చేస్తుంది. మాములు వ్యక్తుల కంటే పొగ తాగే వారిలో కేన్సర్ వచ్చే అవకాశాలు 15 నుంచి 30 శాతం అధికంగా ఉంటుంది. సిగరెట్ లు తాగడం మానేస్తే చాలా వరకు కేన్సర్ రాకుండా నియంత్రించవచ్చని అమెరికన్ లంగ్ అసోసియేషన్ సీనియర్ వైజ్ఞానిక సలహాదారు, పల్మనరీ నిపుణుడు డాక్టర్ నార్మన్ ఎడెల్మాన్ చెప్పారు.- మన జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేస్తే కేన్సర్ రాకుండా నియంత్రించవచ్చు.
- సిగరెట్లు మాత్రమేగాకుండా పొగాకుకు సంబంధించిన ఇతర ఉత్పత్తుల నుంచి కూడా దూరంగా ఉండాలి.
- దుమ్ము, ధూళికి లోనుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలుష్య భరిత ప్రాంతాల్లో పనిచేయాల్సి వస్తే.. తగిన మాస్కులు వినియోగించాలి.
- ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు.. తప్పకుండా కేన్సర్ పరీక్షలను చేయించుకోవాలి.
- ఆల్కాహల్ ఎక్కువగా తాగడం వల్ల కూడా ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది.
- వ్యాయామం చేయడం వల్ల శ్వాసక్రియ వేగం పెరిగి ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- ఊబకాయం వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మన ఎత్తుకు తగినట్టుగా బరువు ఉండేలా జాగ్రత్త పడాలి.
- హర్మోన్ రిప్లెస్ మెంట్ థెరపీలతో కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.
- రేడియేషన్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో తిరగరాదు.
- క్రమబద్ధమైన ఆహార నియమాలను పాటించాలి.