చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
మారుతున్న జీవన శైలి, వాతావరణ కాలుష్యం, ఇతర కారణాల వల్ల ఇటీవలి కాలంలో చర్మ సమస్యలు విజృంభిస్తున్నాయి. రకరకాల సమస్యలు, వ్యాధుల నుంచి ఏకంగా చర్మ కేన్సర్ వరకూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి, శరీర ఉష్ణోగ్రత సమంగా ఉండటానికి, శరీరాన్ని బయటి సమస్యల నుంచి రక్షించడానికి తోడ్పడేది చర్మమే. మరి అలాంటి చర్మం పనితీరు, దానికి వచ్చే సమస్యలు, వ్యాధులు, రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను తెలుసుకుందాం..
శరీరానికి రక్షణ ఇచ్చేది చర్మమే
వాస్తవానికి చర్మం మన శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండి నిరంతరం రక్షిస్తుండే రక్షణ కవచం. అలాంటి మన శరీరంలో అతి పెద్ద అవయవం కూడా చర్మమే. ఇది జుట్టు, గోళ్లు, గ్రంథులు, నరాలగ్రహకాలతో కూడిన సమీకృత వ్యవస్థ. ఒక యుక్త వయసు వ్యక్తి శరీరం మీద ఉండే మొత్తం చర్మం బరువు 2.7 కిలోలు. ఇది సుమారు 1.7 చదరపు మీటర్ల మేర విస్తరించి ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వియా హెల్త్ సిస్టం శాస్త్రవేత్తలు నిర్ధారించారు. చర్మంపై పొరలో ఉండే కణజాలం ఎప్పటికప్పుడు కొత్తగా మారుతుంటుంది. దాదాపు 27 రోజుల కోసారి చర్మం పైపొర కొత్త కణజాలం ఏర్పడుతుందని అమెరికాలోని క్లీవ్ క్లినిక్ వైద్య నిపుణులు వెల్లడించారు.చర్మం పనేంటి?.. ఎలా పనిచేస్తుంది?
శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే చర్మం.. శరీరంలోకి నీటిని చొచ్చుకు పోనివ్వకుండా వాటర్ ప్రూఫ్ గా పనిచేస్తుంది. అలాగే ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. చర్మంలో కెరాటిన్, ఫైబ్రొస్ ప్రొటిన్, లిపిడ్స్, ఇతర ఖనిజాలు, రసాయనాలు చర్మంపై ఉండటం వల్ల ఇది వాటర్ ప్రూఫ్ లా పనిచేస్తుందని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపింది.శరీరంలోని వ్యర్థాలను, అదనంగా ఉండే లవణాలను చర్మం విసర్జిస్తుంది. రక్తం చర్మం ద్వారా ప్రవహించినప్పుడు చర్మంలోని గ్రంధులు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.- శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో చర్మానిదే కీలకపాత్ర. శరీరం ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమటను ఎక్కువగా స్రవించడం ద్వారా చల్లబడేలా చేస్తుంది. శరీరంలో నీటి స్తాయిలు తగ్గినప్పుడు చెమటను నియంత్రించడం ద్వారా డీహైడ్రెషన్‌కు గురికాకుండా అరికడుతుంది.
- నొప్పి, ఒత్తిడి తదితరాలను గుర్తించే గ్రహకాలను చర్మం కలిగి ఉంటుంది. వాటి ఆధారంగానే మనం స్పర్శ అనుభూతిని పొందుతాం.
- అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (ఏడీడీ) ప్రకారం.. శరీరాన్ని బాక్టీరియా, వైరస్, సూక్ష్మజీవుల నుంచి చర్మం కాపాడుతుంది. దాదాపు అన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులు వంటివేవీ కూడా ఆరోగ్యకరమైన చర్మం ద్వారా శరీరంలోకి చొరబడలేవు. శరీరానికి గాయమై చర్మం కోతకు గురైనప్పుడు ఆ గాయం ద్వారా మాత్రమే సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించగలవు.
- శరీరంలోని నీటిని, కొవ్వును, విటమిన్ డిని చర్మం నిల్వ చేసుకుంటుంది.
చర్మంలోని మెలనిన్, కెరోటిన్ లే రంగుకు కారణం..
మెలానిన్, కెరోటిన్, హిమోగ్లోబిన్ ల కారణంగా చర్మానికి, వెంట్రుకలకు రంగు వస్తుంది. చర్మంలోని పైపొరలో మెలనిన్ ఉంటుంది. ఇది ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయితే.. చర్మం రంగు అంత నల్లగా ఉంటుంది. తక్కువగా ఉత్పత్తి అయితే చర్మం తెల్లగా ఉంటుంది. కొందరి చర్మంలో మెలనిన్, కెరోటిన్ లు పూర్తిగా ఉత్పత్తి కావు అందువల్ల వారి చర్మం, వెంట్రుకలు పూర్తి తెల్లగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితినే ఆల్బినిజం అంటారు. దీనికితో బాధపడుతున్న వ్యక్తులను ఆల్బిడోలుగా పిలుస్తుంటారు.చర్మం మూడు పొరలను కలిగి ఉంటుంది..
1. బాహ్య చర్మం (ఎపిడెర్మిస్)2. మధ్య చర్మం (డెర్మిస్)3. అంత: చర్మం (హైపో డెర్మిస్)ఎపిడెర్మిస్.. (పైపొర)
ఎపిడెర్మిస్ అనేది చర్మంలో అన్నింటికన్నా పైన ఉండే పొర. మిల్లీమీటర్లో పదోవంతు మందంగా ఉండే ఈ పొరలో రక్తనాళాలు, గ్రంథులు వంటివేవీ ఉండవు. 40 నుంచి 50 వరసల్లో కెరాటినోసైట్లు అనే కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కెరాటినోసైట్లు కేరాటిన్ ప్రొటీన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఒక పీచులా ఉండే వాటర్ ప్రూఫ్ ప్రోటీన్. గోళ్లు, వెంట్రుకల్లోనూ ఈ ప్రొటీన్ ఉంటుంది. ఇక ఎపిడెర్మిస్ లో మెలానోసైట్ కణాలు కూడా ఉంటాయి. ఇవి మెలనిన్ అనే ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తాయి. మన చర్మానికి రంగు వచ్చేది ఈ మెలనిన్ తోనే. చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉంటే చర్మం నల్లగా ఉంటుంది. మెలనిన్ తక్కువగా ఉంటే.. తెల్లగా ఉంటుంది.డెర్మిస్.. (మధ్య చర్మం)
చర్మంలో ఎపిడెర్మిస్ పొర కింద ఉండే పొరను డెర్మిస్ అంటే మధ్య చర్మంగా పిలుస్తారు. ఇందులో మళ్లీ రెండు ఉప పొరలు ఉంటాయి. వీటిల్లో ఒకటి వదులు కణజాలంతో, మరొకటి బిగుతుగా ఉండే కణజాలంతో ఉంటుంది. ఈ రెండు పొరలకు కూడా సాగే లక్షణం ఉంటుంది. మన చర్మానికి రక్తం సరఫరా అయ్యే నాళాలు, స్పర్శను గ్రహించే నాడుల చివర్లు ఈ పొరల్లోనే ఉంటాయి. చెమటను గ్రహించే గ్రంధులు, ఆయిల్ గ్రంధులు, వెంట్రుకల కుదుళ్లు వంటివన్నీ ఈ పొరల్లోనే ఉంటాయి.హైపో డెర్మిస్.. (చర్మం కింది పొర)
చర్మంలో అన్నింటికన్నా కింద ఉండే పొరను హైపో డెర్మిస్ అంటాం. మన చర్మానికి బలాన్ని, ఆధారాన్ని ఇచ్చేది ఇదే. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొవ్వు పొర. ఈ పొరలో చర్మానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్త నాళాలు, శోషరస నాళాలు, ఉంటాయి. బయట చల్లగా ఉన్నప్పుడు శరీరంలో లోపలి వేడి బయటికి వెళ్లకుండా.. బయట వేడిగా ఉన్నప్పుడు ఆ వేడి శరీరంలోపలికి ప్రసరించకుండా.. ఈ కొవ్వు పొర ఒక ఇన్సులేషన్ గా పనిచేస్తుంది. అంతేకాదు.. మన చర్మం ముడుతలు పడకుండా నున్నగా ఉండడానికి కారణం కూడా ఈ హైపో డెర్మిస్ పొరే. మన వయసు పెరిగిన కొద్దీ చర్మం కింద కొవ్వు నిల్వ ఉండకుండా తగ్గిపోయి చర్మం ముడుతలు పడుతుంటుంది.జాగ్రత్త పడకుంటే ఎన్నో వ్యాధులు..
ఇటీవలి కాలంలో చర్మ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మంది మొటిమలు, మచ్చలు, పులిపీర్లు, చర్మం నల్లబడడం, కమిలిపోవడం, పొడిబారి పొలుసులుగా రాలిపోవడం, చర్మంపై తీవ్రంగా పగుళ్లు వంటి సాధారణ సమస్యలకు తోడు సొరియాసిస్, బొల్లి, టినియా వర్సికలర్, చర్మ కేన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, కాలుష్యం, జన్యుపరమైన సమస్యలు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మ జీవులు, అతినీలలోహిత కిరణాలు, రేడియేషన్ కు గురికావడం వంటివి చర్మ సమస్యలు, వ్యాధులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా యువత అయితే మొటిమలు, మచ్చలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి సులువుగా బయటపడొచ్చు.పులిపీర్లు (వాట్స్)
సాధారణంగా చాలా మందికి పులిపీర్లు ఉంటాయి. వైరల్ ఇన్ ఫెక్షన్లు, పలు ఇతర కారణాల వల్ల పులిపీర్లు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎక్కువగా చేతులు, కాళ్ల మీద చిన్న మొటిమలాగా ఏర్పడతాయి. తరువాత కొంత పెద్దగా మారుతాయి. ఇందులోనూ పాపిలోమా వైరల్ ఇన్ ఫెక్షన్ తో వచ్చే ఈ పులిపీర్లు పెరిగే కొద్ది రక్త నాళాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.- లేజర్ చికిత్స, ఇతర వైద్య విధానాల ద్వారా పులిపీర్లను పూర్తిగా తొలగించుకోవచ్చు.
గజ్జి..
దీన్ని డెర్మటైటిస్ అని కూడా అంటారు. ఇది వేళ్ల మధ్య, కాళ్లు, చేతుల మూలల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఇది వైరస్ వల్ల వస్తుంది. ఒకరినుంచి మరొకరికి వ్యాప్తి చెందే అంటువ్యాధి. వైద్యుల సలహా మేరకు తగిన మందులు వాడితే త్వరగా తగ్గిపోతుంది.మొటిమలు
ఇది సాధారణంగా అందరిలో కనిపించే సమస్య. యుక్త వయసు అమ్మాయిలు, అబ్బాయిల్లో మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇవి వస్తుంటాయి. ముఖంపై, ఛాతీ మీద, వీపు మీద మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువ.- విటమిన్ ఏ ప్రొడక్టులు, సాలిసైలిక్ యాసిడ్, బెంజైల్ పెరాక్సైడ్, యాంటీ బయాటిక్స్ వినియోగిస్తే మొటిమలు తగ్గిపోతాయి. అయితే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని.. తగిన చికిత్స తీసుకోవడం బెటర్.
బొల్లి
ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న చర్మ వ్యాధుల్లో బొల్లి ఒకటి. ఈ వ్యాధి సొకితే చర్మానికి రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. దానివల్ల చర్మం రంగు మారిపోతుంది. వ్యాధి సోకిన చోట చర్మం పూర్తి తెల్లగా.. మిగతా చోట్ల సాధారణ రంగులో ఉంటుంది. ఈ వ్యాధి రోగ నిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. చర్మ కణాలు పనిచేయకుండా చేయడంతోపాటు వాటి మరణానికి కారణం అవుతుంది. లైట్ ట్రీట్ మెంట్ (కాంతి చికిత్స) ద్వారా బొల్లి సమస్యను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.- అయితే ఈ వ్యాధి ముదిరి చర్మం రంగు మారిన తర్వాత తిరిగి చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చే అవకాశం మాత్రం లేదు.
సొరియాసిస్..
ఇది కూడా ఒక రకమైన చర్మ వ్యాధి. మోకాళ్లు, మోచేతులు వంటి చోట్ల ఎక్కువగా వస్తుంటుంది. వ్యాధి సోకిన ప్రాంతాల్లో చర్మం ఎర్రగా మారడం, మంట పుట్టడం వంటి లక్షణాలు ఉంటాయి. దాదాపు మూడు శాతం మంది ప్రజలు సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు అంచనా.- సరైన మందులు, లైట్ ట్రీట్ మెంట్ ద్వారా ఈ వ్యాధిని నయం చేయవచ్చు.
మచ్చలు..
మచ్చలు ప్రతి ఒక్కరి శరీరంపై ఉంటాయి. పరిమాణంలో తేాడాలు, ఎరుపు, నలుపు, గోధుమ రంగులలో ఉంటాయి. చాలా వరకు మచ్చలు ఆవ గింజంతా పరిమాణం నుంచి నాలుగైదు సెంటీమీటర్లంత పెద్దగా కూడా ఉంటాయి. కొంత మందిలో పుట్టుకతోనే మచ్చలు పెద్దగా ఉంటాయి. అయితే చిన్న పరిమాణంలో ఉన్న మచ్చలు క్రమేపీ పెద్దగా మారుతుండటం, అవి రంగు మారుతుంతడడం, నొప్పిగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం ఏదైనా సమస్య తలెత్తుతున్నట్టు భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి.పంజా విసురుతున్న చర్మ కేన్సర్లు..
ఇటీవలి కాలంలో చర్మ కేన్సర్లతో బాధపడుతున్నవారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం, అతినీలలోహిత కిరణాల ప్రభావానికి గురికావడం, సరైన పరిశుభ్రత పాటించకపోవడం, రేడియేషన్ వంటి కారణాల వల్ల చర్మ కేన్సర్లు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు తమ జీవిత కాలంలో సాధారణ చర్మ కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నట్టు అంచనా. ముఖ్యంగా తెల్లని చర్మం ఉన్న వారు సూర్యరశ్మి ప్రభావానికి ఎక్కువగా లోనవుతారని.. తద్వారా కేన్సర్ ప్రమాదం పెరుగుతుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (ఏఏడీ) వెల్లడించింది. అమెరికాలో అయితే ప్రతి ఐదుగురిలో ఒకరు సాధారణ చర్మ కేన్సర్ బారిన పడుతున్నారని తెలిపింది. చర్మ కేన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తించినట్లైతే దాదాపు 98 శాతం వరకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయొచ్చని స్పష్టం చేసింది.- కుటుంబంలో ఎవరికైన కేన్సర్ ఉంటే తరువాతి తరాలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇది మెలానోమా కేన్సర్ విషయంలో ఎక్కువగా జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాంటి కేన్సర్లను నియంత్రించలేమని, అది జన్యువుల్లోనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
- ఎండ నుంచి వచ్చే అతినిలలోహిత కిరణాల వల్ల ఎక్కువగా కేన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
- చర్మం తెల్లని రంగులో ఉండడం (మెలనిన్ తక్కువగా ఉండడం), ఎత్తైన ప్రదేశాల్లో ఉండే వాతావరణం వల్ల అక్కడ నివసించే వారికి స్కిన్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక అసాధారణ మచ్చలు, రేడియేషన్, రోగ నిరోధక శక్తి తక్కకువగా ఉండటం, హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ తో బాధపడుతుండటం, అవయవ మార్పిడి జరిగిన వ్యక్తుల్లో కేన్సర్ కు అవకాశాలు ఎక్కువ. అలాగే డ్రగ్స్ తీసుకునేవారిలో కూడా కేన్సర్ రావొచ్చు.
- ఇది మొదటి దశ కేన్సర్. చర్మంపై చిన్న చిన్న మొటిమలుగా ఏర్పడి పుండుగా మారుతుంది.
- ఇది ఎక్కువగా మెడ, చేతులు, మోచేతులు, తలపై భాగంలో వస్తుంది. ముఖ్యంగా తెల్లని చర్మం ఉన్నవారిలోనే ఈ తరహా కేన్సర్ ఎక్కువగా వస్తుంది.
- ఒక రకంగా చెప్పాలంటే ఇది స్క్వామో సెల్ కార్సినోమా కేన్సర్ కు ప్రారంభ రూపం.
- తగిన జాగ్రత్తలు తీసుకుని దీనిని మొదట్లోనే గుర్తించి చికిత్స చేయించుకుంటే ఈ తరహా కేన్సర్ నుంచి సులువుగా బయటపడొచ్చు.
- ఇది అత్యంత సాధారణ తరహా చర్మ కేన్సర్. దీని బారిన పడినప్పుడు చర్మంపై ముత్యమంత గడ్డలు కనిపిస్తాయి.
- ఇది ఇతర శరీర భాగాలకు అంత త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే చర్మ కణాలను నాశనం చేయడంతోపాటు ఎముకలకు కూాడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది.
- ఒక్క అమెరికాలోనే ఏటా 2 లక్షల మందికిపైగా ఈ తరహా కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ మిన్నేసోటా మెడికల్ స్కూల్ లో చర్మవ్యాధి నిపుణుడు ప్రొఫెసర్ చార్లెస్ తెలిపారు.
3. స్వ్కామోస్ సెల్ కార్సొనోమా (ఎస్ సీసీ)
దీన్నే పొలుసుల కేన్సర్ అని అంటారు. శరీరంపై ఎక్కడ పడితే అక్కడ ఈ తరహా కేన్సర్ వస్తుంది. చిన్న మొటిమ రూపంలో మొదలై శరీరం లోపలి వరకు వ్యాపిస్తుంది.- చికిత్స తీసుకున్నప్పుడు తగ్గినట్టు కనిపించినా.. మళ్లీ మళ్లీ వచ్చే తరహా కేన్సర్ ఇది.
- సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఈ కేన్సర్ నుంచి తప్పించుకోవచ్చు.
- దీని ద్వారా 10 శాతం మాత్రమే మరణాలు ఉంటాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (ఏడీడీ) పేర్కొంది.
4. మెలానోమా కేన్సర్
- అత్యంత ప్రమాదకరమైన తరహా కేన్సర్ మెలనోమా.
- చర్మ కేన్సర్లకు సంబంధించి అధికంగా మరణాలు ఈ తరహా కేన్సర్ ద్వారానే సంభవిస్తున్నాయి. మొత్తంగా స్కిన్ కేన్సర్లతో బాధపడుతున్నవారిలో 35 శాతం మందికిపైగా ఈ మెలనోమా కేన్సర్ తో బాధితులే.
- ఈ కేన్సర్ ఎక్కువగా 25 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి వస్తుంది.
- మన శరీరంపై ఉన్న మచ్చలలో మెలనోమా అభివృద్ధి చెందుతుంది. చిన్న మచ్చగా మొదలై ఒక్కసారిగా నల్లటి కేన్సర్ కణతిగా రూపాంతరం చెందుతుంది.
- సుదీర్ఘ కాలంపాటు నేరుగా ఎండలో లేదా సూర్యుడి వెలుతురును పోలిన కాంతి సమక్షంలో ఉండడం వల్ల చర్మం అతినీలలోహిత కిరణాల ప్రభావానికి గురై మెలనోమా కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. (exposure to natural or artificial sunlight over long periods)
- అలాగే కుటుంబంలో ఎవరికైనా ఈ రకమైన కేన్సర్ ఉంటే తరువాతి తరాలకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ.
- ప్రపంచ స్కిన్ కేన్సర్ ఫౌండేషన్ ప్రకారం 2014లో ప్రపంచవ్యాప్తంగా 76,100 మందిలో మెలనోమా కేన్సర్ బారిన పడ్డారని.. వారిలో 9,710 మంది మరణించారని వెల్లడించింది.
స్కిన్ కేన్సర్ నిర్ధారణ, పరీక్షలు..
చర్మానికి కేన్సర్ ను నిర్ధారించడంలో మొదటి పని వైద్య పరీక్షలు చేయించుకోవడం. శరీరంపై ఉండే మచ్చల పరిమాణం, రంగులో తేడాను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అత్యంత ప్రమాదకరమైన మెలానోమా కేన్సర్ ను గుర్తించడానికి వైద్యులు ‘ఏబీసీడీఈ’ పద్ధతిని కనిపెట్టారు.- ఏ- అసిమెట్రికల్ స్కిన్ లెసిన్ (చర్మంపై పెద్ద గాయం)
- బీ- బార్డర్ ఈజ్ ఇర్రెగ్యులర్ (చర్మంపై ఉండే మచ్చల సరిహద్దుల్లో మార్పులు)
- సీ- కలర్ (చర్మంపై ఎక్కడైనా రంగు మారిపోవడం)
- డీ- డయామీటర్ (మచ్చల పరిమాణంలో తేడా.. మామూలు మచ్చలు ఒక రకంగా ఉంటే.. మెలానోమో వచ్చిన మచ్చలు మరో రకంగా ఉంటాయి)
- ఈ- ఎన్ లార్జింగ్- (చర్మంపై మచ్చలు విస్తరించడం)
చర్మ కేన్సర్లకు పలు రకాల చికిత్సలివీ..
ఫస్ట్ స్టేజ్ కేన్సర్లు, మెలనోమా కాని కేన్సర్లకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయొచ్చని మేయో క్లినిక్ వైద్యులు చెబుతున్నారు. అయితే చర్మంపై ఉన్న గాయాలు, వాటి పరిమాణం, లోతు, వాటి స్థానం ఆధారంగా శస్త్రచికిత్సను నిర్వహిస్తారు.- ద్రవ నైట్రోజన్ తో చికిత్స
- కేన్సర్ కణాల పెరుగుదలను నిరోొధించడానికి లేజర్ చికిత్స
- మెహ్స్ సర్జరీ.. తిరిగి మళ్లీ మళ్లీ వచ్చే తరహా చర్మ కేన్సర్లకు ఈ చికిత్సను ఉపయోగిస్తారు.
- రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు
- పలు రకాల ప్రభావవంతమౌన ఔషధాలను ఉపయోగించి కేన్సర్ కణాలను చంపడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం.
- క్యూరటేజ్, ఎలెక్ట్రోడెసికేషన్ తదితర చికిత్సల ద్వారా కేన్సర్ కణాలను అంతమొందించడం.
నివారణ మార్గాలు..
- చర్మకేన్సర్లకు ప్రధాన కారణాల్లో ఒకటి సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలు కాగా.. రెండోది కాలుష్యం.
- ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వీలైంత వరకు ఇంట్లోంచి బయటికి వెళ్లకూడదు. ఒక వేళ వెళ్లాల్సి వచ్చినా పొడవాటి దుస్తులు, తలకు టోపీ, కళ్లకు సన్ గ్లాసెస్ వంటివి ధరించాలి.
- శరీరంపై ఎండ పడే ప్రాంతాల్లో సన్ ప్రొటెక్షన్ క్రీమ్ రాసుకోవాలి. ముఖ్యంగా ఎస్పీఎఫ్ 25 లేదా అంతకన్నా ఎక్కువ ప్రమాణమున్న లోషన్లు రాసుకోవడం బెటర్
- ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో బయట తిరగకుండా ఉండటమే మంచిది.
- కలుషిత ప్రాంతాల్లో సంచరించినప్పుడు, చర్మం ఏదైనా రసాయనాల ప్రభావానికి గురైనప్పుడు వీలైనంత త్వరగా శుభ్రం చేసుకోవడం మంచిది.