మాంసం తినే బ్యాక్టీరియా.. పరిశుభ్రత పాటించకుంటే చాలా డేంజర్!
మన చేతికో, కాలికో గాయాలైతే.. ఏముంది చిన్న గాయమే కదాని నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ ఆ నిర్లక్ష్యం మనకు కోలుకోలేని సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఒక్కోసారి ప్రాణాలకూ ప్రమాదకరంగా మారుతుంది. అందులోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ గానీ సోకితే..? శరీరాన్ని కొంచెం కొంచెంగా తినేస్తే..? శరీర భాగాల్ని కోల్పోవడమే కాదు.. అది మరణానికీ దారి తీస్తుంది. ఇలాంటి ఓ ఘటన అమెరికాలోని కెంటకీలో జరిగింది. మరి ఆ ప్రమాదం ఏమిటి, దానికి కారణమేమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి తెలుసుకుందాం..
ఆయన పేరు ఆంటోనీ బాల్ స్టన్.. వయసు జస్ట్ 31 ఏళ్లు. పనిలో ఉన్నప్పుడు వేళ్లు విరవడం ఆయనకు అలవాటు. ఏడాది కింద ఓ రోజు అలాగే కుడి చేతి వేళ్లు విరుస్తుండగా.. ఒక్కసారిగా నొప్పిగా అనిపించింది. వేలు విరిగిపోయిందేమో అన్నంతగా బాధ కలిగింది. తర్వాత నొప్పి తగ్గడంతో ఊరుకున్నాడు. కానీ ఆ రోజు రాత్రయ్యే సరికి ఆంటోనీకి జ్వరం, అలసట, నొప్పులతో బాధపడ్డాడు. ఏదో జ్వరంలే అనుకున్నాడు. తర్వాతి రోజు నిద్ర లేచేటప్పటికి జ్వరం మరింతగా పెరిగింది. నొప్పి వచ్చిన కుడి చేయి మోచేతి నుంచి వేళ్ల వరకు వాచిపోయి.. నల్లగా మారిపోయింది. దీంతో వెంటనే ఆస్పత్రికి పరుగెట్టాడు. డాక్టర్లు ఆయనకు పరీక్షలు చేసి ‘నెక్రోటైజింగ్ ఫాసిటిస్’ ఇన్ఫెక్షన్ గా నిర్ధారించారు. వెంటనే మరిన్ని పరీక్షలు చేయగా.. ఇన్ఫెక్షన్ అప్పటికే చేతిలోపల వేళ్ల దగ్గరి నుంచి మోచేతిదాకా వ్యాపించినట్లు గుర్తించారు.
వేళ్ల మధ్య గాయంతో..
ఆంటోనీ చేతి వేళ్ల మధ్య ఏదో చిన్న గాయమై.. కొంత వరకు మానింది. ఆయనకు వేళ్లు విరిచే అలవాటుంది కదా.. అలా వేళ్లు విరుస్తుండగా.. ఆ గాయం కాస్త పచ్చిగా ఉండిపోయింది. ఇదే సమయంలో స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా గాయం నుంచి చేతి లోపలికి చొరబడింది. అయితే.. నొప్పి వచ్చినా బయటికేమీ కనబడడం లేదుకదా అని ఆయన ఒక రోజు నిర్లక్ష్యం చేశారు. ఆ ఒక్క రోజులోనే బ్యాక్టీరియా చేయాల్సింత నష్టం చేసేసింది. ఆంటోనీ మోచేతి వరకు ఇన్ఫెక్షన్ సోకిందని గుర్తించిన వైద్యులు.. మోచేతి నుంచి చేతి వేళ్ల వరకు ఆపరేషన్ చేశారు. అంత పొడవునా చేతిని కోసి.. లోపల దెబ్బతిన్న కండర, చర్మ కణజాలాన్ని తొలగించారు. చిటికిన వేలు తొలగించాల్సి వచ్చింది. మరో రెండు వేళ్లు సరిగా పనిచేయడం లేదు. మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఏదైనా వస్తువును సరిగా పట్టుకోలేని దుస్థితి. ‘‘ఆంటోనీ మరింత నిర్లక్ష్యంగానీ చేసి, ఆస్పత్రికి రాకుండా ఉంటే.. చెయ్యి మొత్తం తొలగించాల్సి వచ్చేది. మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేవి. అందుకే నిర్లక్ష్యం చేయవద్దు..’’ అని డాక్టర్లు హెచ్చరించడం గమనార్హం.‘నెక్రోటైజింగ్ ఫాసిటిస్’ అంటే ఏమిటి?
మన శరీరంలోని కండరాలు, చర్మం వంటి మెత్తటి కణజాలం మరణానికి కారణమయ్యే ఇన్ఫెక్షన్. సరిగ్గా చెప్పాలంటే కణజాలాన్ని తినేసే ఇన్ఫెక్షన్. అరుదుగా వచ్చే ఈ ఇన్ఫెక్షన్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. సోకిన కొద్ది గంటల్లోనే శరీరంలోని చాలా భాగానికి విస్తరిస్తుంది. గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్, క్లెబసెల్లా, క్లొస్ట్రిడియం, ఎస్చెరిచియా కొలి, స్టఫిలోకాకస్ ఆరస్ వంటి బ్యాక్టీరియాలు దీనికి కారణమవుతాయి. వీటినే ‘ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా (మాంసాన్ని తినేసే బ్యాక్టీరియా)’లు అంటారు. ఇందులోనూ స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా అత్యంత ప్రమాదకరం.బ్యాక్టీరియా ఎలా సోకుతుంది?
ఆంటోనీ వేళ్లు విరవడంతో అప్పటికే ఉన్న గాయం పచ్చిగా ఉండి.. బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించింది. కానీ వేళ్లు విరవడానికి ఈ ఇన్ఫెక్షన్ కు ఏ సంబంధమూ లేదు. నిజానికి గాయాలను నిర్లక్ష్యం చేయడం, అదే సమయంలో పరిశుభ్రత పాటించక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకడం ఆంటోనీ సమస్యకు కారణం.- గాయం నుంచి శరీరంలోకి ప్రవేశించే ‘ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా’.. శరీర కణజాలాన్ని వినియోగించుకుంటూ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో బ్యాక్టీరియా నుంచి అత్యంత విషపూరితమైన రసాయనాలు వెలువడతాయి. అవి శరీర కణాలను చంపేస్తాయి.
- బ్యాక్టీరియా కారణంగా రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. దీంతో రక్తం సరఫరా నిలిచిపోతుంది. దీనివల్ల అక్కడి కణజాలంతోపాటు ఆ రక్తం సరఫరా కావాల్సిన శరీర భాగాలు కూడా దెబ్బతింటాయి.
లక్షణాలు ఎలా ఉంటాయి?
‘ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా’ ఇన్పెక్షన్ సోకితే.. వెంటనే చర్మంపై చిన్న పాటి కురుపులు, దద్దుర్లు వంటివి వస్తాయి. దీనికితోడు చెమట పట్టడం, వాంతులు, జ్వరం, తీవ్రమైన నొప్పి వంటివి ఉంటాయి. ఈ బ్యాక్టీరియా చాలా వేగంగా విస్తరించే లక్షణం ఉండడం వల్ల.. కొద్ది గంటల్లోనే ఇన్ఫెక్షన్ లక్షణాలు పెరిగిపోతాయి. ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతంలో వాపు వస్తుంది. మెల్లగా చర్మం, దాని కింద కణజాలం నల్లగా మారిపోతుంటుంది. విపరీతంగా నొప్పి ఉంటుంది.తగిన చికిత్స అందుబాటులో ఉందా..?
‘నెక్రోటైజింగ్ ఫాసిటిస్’ ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరమైనది. ఈ బ్యాక్టీరియా సోకిన కొద్ది గంటల్లోనే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన భాగాల్లో విడుదలయ్యే రసాయనాలు రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరమంతా వ్యాపించడం వల్ల ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. దీనివల్ల బాధితులు కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది.- ఈ ఇన్ఫెక్షన్ ను గుర్తిస్తే.. వెంటనే శస్త్రచికిత్స చేసి, అది సోకిన భాగాన్ని అంతా తొలగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడి కండర కణజాలం, చర్మాన్ని తీసేయాల్సి వస్తుంది. ఇదే సమయంలో అత్యంత ప్రభావవంతమైన యాంటీ-బ్యాక్టీరియల్ ఔషధాలను కూడా ఎక్కిస్తారు.
- అప్పటికే ఇన్ఫెక్షన్ సోకి.. దెబ్బతిన్న భాగాలను పునరుద్ధరించడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడి కణజాలం అప్పటికే చనిపోయి ఉంటుంది. అందువల్ల కొన్ని సార్లు ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతాన్ని బట్టి.. వేళ్లనుగానీ లేదా మొత్తంగా చేతిని, కాలును తొలగించాల్సి వస్తుంది.
- ఈ చికిత్సలో చర్మాన్ని తొలగించడం వల్ల.. శరీరంలోని ఇతర భాగాలపై (ముఖ్యంగా తొడలపై) చర్మాన్ని తీసుకుని, తొలగించిన స్థానంలో అమర్చుతారు.
- ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఇన్ఫెక్షన్ బాధితులు ఉంటున్నారు. ముఖ్యంగా అపరిశుభ్ర ప్రాంతాల్లో ఉండేవారికి ఈ సమస్య ఎక్కువ.
డ్రైనేజీ కలుషితాలతో జాగ్రత్త
డ్రైనేజీలు, వాటి కలుషితాలు, అపరిశుభ్ర ఆస్పత్రి పరిసరాలు ఈ ‘ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా’కు నిలయాలు. ముఖ్యంగా మానవ, జంతు వ్యర్థాలు, అన్ని రకాల కలుషితాలు డ్రైనేజీలలో చేరుతాయి కాబట్టి.. వాటిలో ఈ బ్యాక్టీరియా ఉండే అవకాశం ఎక్కువ. పలు చోట్ల డ్రైనేజీల నీరు నేరుగా నదులు, వాగులలోకి కలుస్తుంది. అటువంటి చోట వాటిల్లోని నీటిని.. తీసి పంటలకు వినియోగిస్తుంటారు. దానివల్ల అక్కడ పనిచేసేవారికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువ.- నగరాలు, పట్టణాల్లో చాలా చోట్ల డ్రైనేజీలు, మంచి నీటి సరఫరా పైపులైన్ల లీకేజీలు ఉంటాయి. అలాంటి చోట రెండూ కలసి పోయి.. కలుషిత నీరు ఇళ్లలోకి చేరుతుంది.
- ఆస్పత్రుల్లో వినియోగించిన ఇంజెక్షన్లు, సూదులు, దూది వంటి వాటిని పరిసరాల్లోనే నిర్లక్ష్యంగా పడేయడం వల్ల.. ఆ అపరిశుభ్ర పరిసరాల్లో ప్రమాదకర బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.
వ్యాధి నిరోధకత తగ్గడం, దురలవాట్లతోనూ సమస్య..
- వ్యాధి నిరోధకత తక్కువగా ఉండడం, మధుమేహం, ఆల్కాహాల్, పొగతాగే అలవాట్లు, గాయాల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఇటువంటి ఇన్ఫెక్షన్లు వేగంగా విస్తరిస్తాయి.
- వాస్తవానికి చాలా మంది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కు లోనయ్యే అవకాశమున్నా.. కొందరికి మాత్రమే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. దానికి కారణం వారి శరీరంలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండడమే. తగిన పోషకాహారం తీసుకోవడం ద్వారా దీనిని అధిగమించవచ్చు.
- మధుమేహం ఉన్నవారు ఇన్ఫెక్షన్లకు లోనయ్యే అవకాశం ఎక్కువ. వీరిలో గాయాలైతే త్వరగా మానే పరిస్థితి ఉండదు. అందువల్ల బ్యాక్టీరియా, వైరస్ వంటివి సులువుగా సంక్రమిస్తుంటాయి.
- పొగతాగడం, ఆల్కాహాల్ వంటి అలవాట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. వాటికి దూరంగా ఉండడం మంచిది.
పరిశుభ్రతే పరమౌషధం
- ‘ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా’ మాత్రమే కాదు.. చాలా రకాల బ్యాక్టీరియాలు, వైరస్ ల ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణం పరిశుభ్రత లోపమే.
- ముఖ్యంగా శరీరంపై తగిలిన గాయాలు పూర్తిగా మానిపోయే వరకు జాగ్రత్తగా ఉండాలి. గాయాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, మందులు వేస్తూ ఉండాలి. ఎటువంటి కలుషితాలు తగిలే అవకాశం లేకుండా చూసుకోవాలి.
- బయట తిరిగినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. కేవలం నీటితోనే శుభ్రపర్చుకోకుండా.. సబ్బు, యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ వాష్ వంటివి వినియోగించడం మేలు.
- డ్రైనేజీల నీరు, కలుషితాలు ఉండే చోట జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మన నివాసాల పరిసరాల్లో కూడా అలాంటివి ఉండకుండా చూసుకోవాలి.
- ఆస్పత్రులకు వెళ్లినప్పుడు వీలైనంత వరకు దేనినీ తాకకుండా ఉండడం ఉత్తమం. ఆస్పత్రుల నుంచి తిరిగి రాగానే చేతులు, కాళ్లు శుభ్రపర్చుకోవాలి.