ఔషధ గుణాల రోజా....ఆరోగ్యానికి రాజా
చూడగానే ఎంతో అందంగా కన్పించే రోజా పూలకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవి అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. రోజా రేకులను తినడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం...
వీర్యవృద్ధి : రోజా రేకులు మీ శృంగార జీవితానికి చాలా దోహదం చేస్తాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, రోజా రేకులను రోజూ గుప్పెడు తింటూ వస్తే అవి మన శరీరంలోని దోషాలను పోగొడుతాయి. తద్వారా రక్తశుద్ధి జరుగుతుంది. అంతేకాక సహజంగానే వీటికి వీర్యవృద్ధిని కలిగించే గుణముంది.
మొటిమలు, నల్లమచ్చలు మటుమాయం : యుక్త వయసులో హార్మోన్ల ప్రభావంతో యువతీయువకులకు మొహంపై వచ్చే మొటిమలు, తద్వారా ఏర్పడే నల్లమచ్చలను పోగొట్టడంలో రోజా రేకులు సమర్థవంతంగా పనిచేస్తాయి. రేకులను నీటిలో బాగా మరిగించాలి. తర్వాత వాటిని బయటకు తీసి ముద్దగా నూరాలి. దీనికి ముల్తానీ మట్టి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారంలో ఒక్కసారి మీ మొహంపై రాసుకుంటే సత్ఫలితం ఉంటుంది. క్రమేపీ నల్లమచ్చలు తగ్గిపోవడం మీరు గుర్తించవచ్చు. అంతేనా...రోజా రేకులు మీ మొహ చర్మాన్ని ఆరోగ్యవంతంగా కూడా ఉంచడంలో ఇవెంతగానో దోహదపడతాయి.
రోజా రేకుల కషాయం : రోజా రేకులతో తయారు చేసే కషాయం కూడా ఆరోగ్యానికి మంచిదే. మార్కెట్లలో లభించే ఔషధాల కంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది. మీ చర్మానికి మెరుపును అందిస్తుంది. చర్మంపై ప్రధానంగా మొహంపై మొటిమల వల్ల ఏర్పడిన కూపములను ఇది తగ్గిస్తుంది. దీనిని మీరు మీ ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు. మీకు కావాల్సిందల్లా రోజా రేకులు, నీరు మాత్రమే.
మనసుకు ప్రశాంతత : రోజా పూల నుండి వచ్చే సువాసనను ఆస్వాదించడం వల్ల మీకు శారీరకంగానే కాక మీ మనసుకు కూడా ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి దోహదపడుతుంది. వేడి నీటిలో రోజా రేకులతో పాటు కొంత బాత్ సాల్ట్‌ని కలిపాలి. ఈ మిశ్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం, మీరు గనుక పీల్చితే తప్పకుండా ఉపశమనం లభించి, చురుగ్గా మారుతారు.
నాజూకుతనానికి : రోజా రేకుల్లో ఉండే పదార్థాలు నాజూకుతనానికి బాగా ఉపయోగపడుతాయి. కొద్దిగా మెంతులు, రోజా రేకులు కలిపి చేసుకున్న పేస్టును తినడం లేదా రోజా రేకులతో కాచిన కషాయాన్ని తాగినా మీరు సన్నబడతారు. అంతేకాక రోజా రేకులు జీవక్రియను మెరుగుపరుస్తాయి. తద్వారా మీరు సన్నబడే అవకాశముంటుంది.