భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా మంచి ఆప్షన్!
భారత విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎంచుకునే దేశాల్లో ఆస్ట్రేలియా కూడా టాప్ ప్లేస్ లో ఉంటోంది. అమెరికా, యూకేల తర్వాత ప్రపంచంలో అత్యధికంగా విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశం ఆస్ట్రేలియా. 2014లో సుమారు నాలుగు లక్షల మంది విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాకు వెళ్లగా.. అందులో 50వేలకు పైగానే భారత్ నుంచి ప్రవేశాలు పొందారు. 40కుపైగా యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి విద్యా సంస్థలు అందించే వొకేషనల్, టెక్నికల్ కోర్సులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలన్నీ ఇక్కడి విద్యా సంస్థల సర్టిఫికెట్లను గుర్తిస్తున్నాయి. అమెరికా, యూకేల కంటే నివాస వ్యయం తక్కువ. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో విద్యకు సంబంధించి అందుబాటులో ఉన్న వివిధ వీసాల గురించి తెలుసుకుందాం...
ఇవి తప్పనిసరి...
ముందుగా విద్యకు సంబంధించి ఆస్ట్రేలియాలో అనువైన విద్యా సంస్థను ఎంపిక చేసుకోవాలి. చాలా విద్యా సంస్థలకు సొంత వెబ్ సైట్లు ఉన్నాయి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఇవి వీలు కల్పిస్తున్నాయి. చేరబోయే విద్యా సంస్థలు, కోర్సులకు ప్రభుత్వ అనుమతి ఉందో, లేదో కూడా చూసుకోవాలి. cricos.deewr.gov.au, http://www.studyinaustralia.gov.au/ ఈ వెబ్ సైట్లలో ఆయా సమాచారం లభిస్తుంది. కోర్సు ఎంపిక అనంతరం ఆయా విద్యా సంస్థల వెబ్ సైట్ల ద్వారా నేరుగా అడ్మిషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజెంట్ సాయం తీసుకునేట్లయితే గుర్తింపు ఉన్న ఏజెంట్ల వివరాలను వెబ్ సైట్ నుంచి తెలుసుకోవాలి. అడ్మిషన్ ఖరారుకు ముందు అవసరమైతే యూనివర్సిటీలు ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తాయి. అంతా సవ్యంగా జరిగితే కోర్సు ఫీజు చెల్లించాలి. దీనికి ముందు లిఖిత పూర్వక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకుంటున్న కోర్సు, నిబంధనలు, ఫీజులు, ఇతరత్రా నిబంధనలతో ఈ ఒప్పందం ఉంటుంది. దీన్ని పూర్తిగా చదివి ఆమోదించాలి. అలాగే, దీనికి సంబంధించిన జిరాక్స్ కాపీలను దగ్గర ఉంచుకోవడం మంచిది.
అదే విధంగా ప్రవేశాల కోసం కావాల్సిన అర్హతల వివరాలు కూడా యూనివర్సిటీ వెబ్ సైట్ల నుంచి తెలుసుకోవచ్చు. ఏసీటీ (యాక్ట్), స్కాలస్టిక్ అసెస్ మెంట్ టెస్ట్ (శాట్) లను రాయడం ద్వారా ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి వీలవుతుంది. టోఫెల్, ఐఈఎల్టీఎస్, పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ (పీటీఈ) వంటి పరీక్షల్లో ఏదేనీ ఒకదాన్ని రాయడం ద్వారా ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని వ్యక్తీకరించాల్సి ఉంటుంది. అలాగే, మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు జీఆర్ఈ, జీమ్యాట్ పరీక్షలు అర్హత కల్పిస్తాయి.
కళాశాలకు విద్యార్థులు వారి గురించి లేఖ రూపంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఫలానా కళాశాలకే దరఖాస్తు చేసుకోవడానికి కారణాలు, అడ్మిషన్ పొందడానికి ఉన్న అర్హతలు అనే అంశాలతో వ్యక్తిగత లేఖను అడ్మిషన్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, వృత్తిపరమైన ఆకాంక్షలు, బలాబలాలు, నైపుణ్యాలు, అనుభవం తదితర అంశాలతో వ్యాసాలు రాయాలని కూడా యూనివర్సిటీలు అడుగుతాయి.
ఆస్ట్రేలియాలో ఫిబ్రవరి లేదా జూలై నెలల్లో కోర్సులు ప్రారంభమవుతాయి. గడువుకు ఆరు నెలల ముందే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో చేరాలనుకుంటే డిసెంబర్ నాటికి దరఖాస్తు ప్రక్రియ, ఇంటర్వ్యూలకు హాజరు, వీసా దరఖాస్తు ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది. జీమ్యాట్ లో 520, జీఆర్ఈలో వెర్బల్ లో 145, క్వాంట్ లో 160 మార్కులను యూనివర్సిటీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
ఏజెంట్, మరెవరి ఒత్తిడితోనూ ఎక్కడా సంతకం చేయరాదు. అన్నీ నచ్చాకే ఫీజులు చెల్లించాలి. విద్యార్థుల వీసా అప్లికేషన్లు, శాశ్వత నివాస అనుమతి దరఖాస్తులను ఆస్ట్రేలియా ప్రభుత్వమే ప్రాసెస్ చేస్తుంది. ఈ విషయంలో ఏజెంట్ల మాటలు నమ్మవద్దు. పార్ట్ టైమ్ వర్క్ విషయంలో ఏజెంట్ల మాటలపై ఆధారపడవద్దు. విద్యా సంస్థల్లోని విదేశీ విద్యార్థుల సేవా కేంద్రాలను ఆశ్రయించడం ద్వారా వసతి, ఉద్యోగం, ఇంగ్లిష్ భాష మెరుగుకు సాయం పొందవచ్చు. ఒంటరితనం భావనలో ఉంటే భాతర హైకమిషన్/కాన్సులేట్ ను సంప్రదిస్తే... స్థానిక భారతీయ సంఘాలకు పరిచయం చేస్తారు. దాంతో కొత్త ప్రాంతంలో ఉన్నామన్న భావన నుంచి బయటకు రావచ్చు.
ఆస్ట్రేలియాలో విద్యకు అయ్యే వ్యయం ఇలా…
2015 సంవత్సరానికి సంబంధించి ఆస్ట్రేలియాలో కోర్సుల ఫీజులు ఇలా ఉన్నాయి. బాచిలర్స్ డిగ్రీకి ట్యూషన్ ఫీజు 15వేల ఆస్ట్రేలియా డాలర్లు (భారతీయ కరెన్సీలో ఒక డాలరు సుమరుగా 49 రూపాయలు) ఉంది. అంటే 7.35 లక్షల రూపాయలు డిగ్రీ కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇది యూనివర్సిటీని బట్టి మారుతూ ఉంటుంది. అదే పీజీ డిగ్రీకి అయితే 20వేల ఆస్ట్రేలియా డాలర్లు, పీహెచ్ డీ కోర్సుకు 14వేల డాలర్ల ఫీజు ఉంది. మెడిసిన్ చేయాలంటే ఇంతకంటే ఎక్కువే చెల్లించుకోవాలి. కోర్సుల ఫీజుల వివరాలను http://www.studyinaustralia.gov.au/global/australian-education/education-costs/education-costs-in-australia వెబ్ సైట్ నుంచి, అలాగే చేరబోయే విద్యా సంస్థల వెబ్ సైట్ల నుంచి తెలుసుకోవచ్చు.
సొంతంగా ఆర్థిక వనరులు ఉండాల్సిందేనా..?
చదువుతూ పార్ట్ టైమ్ జాబ్ ద్వారా కోర్సు ఫీజులు పూర్తిగా చెల్లించడం సాధ్యమయ్యేది కాదు. ట్యూషన్ ఫీజు, మిగతా ఖర్చులకు సరిపడా సంపాదించాలంటే… చదువును పక్కన పెట్టాల్సిందే. చన్నీళ్లకు కాసిన్ని వేడి నీళ్లు తోడన్నట్టు.. విద్యకు సరిపడా వ్యయాన్ని ముందే సమకూర్చిపెట్టుకుని వెళ్లడమే సరైనది. వారానికి 20 గంటల పాటు పనిచేసుకోగల సౌలభ్యం ఉన్నప్పటికీ సరైన పని దొరుకుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు కదా. పైగా ఆదాయం కోసం ఎక్కువ గంటల పాటు పనిచేస్తే వీసాను క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉంది. విద్యార్థులు ఒక్కోసారి గంటకు 3 నుంచి 5 డాలర్లకు కూడా పనిచేయాల్సి రావచ్చు. పనికి సంబంధించి యజమానితో ఏవైనా విభేదాలు వచ్చినా, తగినంత వేతనం ఇవ్వకపోయినా అంబుడ్స్ మెన్ ను సంప్రదించవచ్చు. చదువుతూ పనిచేసుకునే విద్యార్థులకు ఉండే హక్కుల గురించి https://www.fairwork.gov.au/ వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చు.
పార్ట్ టైమ్ జాబ్ గురించి..
అమెరికాలో వలే ఆస్ట్రేలియాలోనూ విద్యార్థులు వారానికి 20 గంటలు మించకుండా ఉద్యోగాలు చేసుకోవచ్చు. సెలవుల్లో వారానికి 40 గంటల వరకు పనిచేసుకోవచ్చు. వేతనాన్ని వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి తీసుకోవచ్చు. ఆస్ట్రేలియాలో కనీస వేతనం ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇక్కడ కనీస వేతనం గంటకు 17 ఆస్ట్రేలియా డాలర్లు. వారాంతపు రోజులు, సెలవు రోజుల్లో ఇది ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. రెస్టారెంట్లలో వెయిటర్ కు గంటకు 23 డాలర్ల వేతనంగా ఉంది. సూపర్ మార్కెట్లో 20 డాలర్లు చెల్లిస్తున్నారు.
నాణేనికి మరో వైపు
అయితే, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. విదేశీ విద్యార్థుల అవసరాలను అవకాశంగా మలుచుకుంటున్న సంస్థలు కూడా లేకపోలేదు. సిడ్నీ తదితర ప్రాంతాల్లో విదేశీ విద్యార్థులు గంట పని చేసినందుకు గాను 8 డాలర్లు మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు రిస్క్ తీసుకుంటున్నారు. అంటే వారానికి 20 గంటల కంటే అదనంగా పనిచేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇది బయటపడితే అక్కడి నుంచి వెనక్కి పంపించే ప్రమాదం ఉంటుంది.
దేనికి ఏ వీసా...?
స్టూడెంట్ వీసాను పలు సబ్ క్లాస్ లుగా పేర్కొన్నారు. ప్రైమరీ లేదా సెకండరీ స్కూల్స్ లో ప్రవేశాల కోసం, విద్యార్థుల మార్పిడి కార్యక్రమం కింద వెళ్లే వారు సబ్ క్లాస్ 571 అనే రకం వీసా తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తి విద్యా కళాశాలల్లో డిప్లొమా, అడ్వాన్స్ డ్ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల కోసం 572 వీసా తీసుకోవాలి. యూనివర్సిటీల్లో బాచిలర్స్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ డిప్లొమా, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు గాను 573 వీసా... మాస్టర్, పీహెచ్ డీ కోర్సుల్లో ప్రవేశాలకు 574 వీసాను తీసుకోవాల్సి ఉంటుంది.
ఫౌండేషన్ కోర్సుల కోసం..
ఫౌండేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 575 వీసా తీసుకోవాలి. ప్రత్యేకమైన విద్యార్హతలు ఏమీ లేకున్నా ఫౌండేషన్ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. కోర్సు ముగిసిన తర్వాత ఎలాంటి డిగ్రీలు, సర్టిఫికేట్లు ప్రదానం చేయరు. 576 వీసా చాలా ప్రత్యేకమైనది. ఆస్ట్రేలియా ప్రభుత్వం లేదా ఆ దేశ రక్షణ విభాగం సహకారంతో చదువుకోడానికి ఇది వీలు కల్పిస్తుంది. తమపై ఆధారపడిన వారిని కూడా అక్కడికి తీసుకెళ్లవచ్చు. అంతేకాదు జీవిత భాగస్వామి కూడా మూడు నెలల పాటు చదువుకునేందుకు అవకాశం ఉంది. వీసా సబ్ క్లాస్ 580... ఇది గార్డియన్ వీసా. ఆస్ట్రేలియాకు వెళ్లే విద్యార్థులు ఈ వీసాతో తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులను తమ వెంట తీసుకెళ్లవచ్చు. ఇంగ్లిష్ కోర్సులు చదివేందుకు వెళ్లేవారు 570 వీసా తీసుకోవాల్సి ఉంటుంది.
చదువుతూనే పార్ట్ టైం జాబ్
విద్యార్థులు ఒకవైపు చదువుకుంటూనే వారానికి 20 గంటల పాటు ఉద్యోగం చేసుకోవచ్చు. సెలవుల్లో పరిమితి లేకుండా పనిచేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు కూడా వారానికి 20 గంటల పాటు పనిచేసుకోగల సౌలభ్యం ఉంది. కుటుంబ సభ్యులకు వీసా కోసం దరఖాస్తు చేసుకునేట్లు అయితే జీవనానికి సరిపడా ఆర్థిక వనరులు ఉన్నాయని ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ముందుగా వైద్య పరీక్షలకు హాజరు కావాలి.
ఆస్ట్రేలియాకు బయల్దేరుతున్నారా...? ఒక్క నిమిషం!
ఆస్ట్రేలియాలో కొంత కాలం క్రితం జాతి ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మెల్ బోర్న్ సహా పలు ప్రాంతాల్లో భారతీయ విద్యార్థులపై దాడులు, వారి నుంచి దోచుకోవడం వంటి ఘటనలు జరిగాయి. కనుక విద్యార్థులు భద్రత కోసం బయట ఎక్కువగా సంచరించకుండా విద్యకు పరిమితం కావడం మంచిది. కొన్ని ప్రైవేటు కళాశాలల నిర్వహణ అక్కడి ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఉండదు. అయినా అలాంటి కళాశాలలు భారీగా భారత విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ప్రమాణాలు లేని విద్యా సంస్థల్లో చేరితే ఇబ్బందే. అందుకే చేరుతున్న విద్యా సంస్థకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవాలి www.acpet.edu.au ఈ సైట్ అందుకు వీలు కల్పిస్తుంది.
ముందు చూపు అవసరం
ఖర్చు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా తక్కువ అద్దెలు ఉండే ప్రాంతాల్లో ఉండేందుకు మొగ్గు చూపుతుంటారు. అద్దె భారం తగ్గించుకునేందుకు ఇద్దరు ముగ్గురు కలసి ఒక గదిని షేర్ చేసుకుంటుంటారు. దీంతో ఆయా ప్రాంతాలు రద్దీగా ఉండడమే కాకుండా పరిశుభ్రంగా కనిపించవు. పైగా అలాంటి ప్రాంతాల్లో నేరాలకు కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతాలు విద్యా సంస్థలకు దూరంగానూ ఉంటాయి. ఆదాయం కోసం విద్యార్థులు రాత్రి పూట పనులకు వెళుతుంటారు. అర్ధరాత్రి సమయంలో మెల్ బోర్న్ వంటి నగరాల్లో మెట్రో రైళ్లల్లో ప్రయాణించడం ఏంతమాత్రం సురక్షితం కాదు. దొంగలు దాడి చేసే అవకాశాలు ఎక్కువ. కనుక ఆస్ట్రేలియాకు వెళ్లే ముందే అక్కడి విద్యా సంస్థలు, నివాసానికి అనువైన ప్రాంతాలు, పార్ట్ టైమ్ జాబ్స్ వల్ల వచ్చే ఆదాయం, ఫీజులు, నివాస వ్యయం తదితర అంశాల గురించి సమగ్రంగా తెలుసుకునే ఫ్లయిట్ ఎక్కాలి.
ముఖ్యమైన పత్రాలు, డబ్బులను జాగ్రత్త చేసుకోవాలి. అన్ని ముఖ్యమైన పత్రాలకు సంబంధించిన జిరాక్స్ కాపీలు మెయిల్ చేసి ఉంచుకోవడం శ్రేయస్కరం. అర్ధరాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణించరాదు. ఎక్కడికైనా వెళ్లే ముందు స్థానికంగా తెలిసిన వారికి ఆ సమాచారం తెలియజేయాలి. అవసరమైన సమయాల్లో పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సాయం పొందవచ్చు. రద్దీ ప్రాంతాల్లో తోసుకోవడం నేరం. క్యూలైన్లను బ్రేక్ చేసి వెళ్ల కూడదు. పెద్దగా మాట్లడరాదు. ఇరుగు, పొరుగు వారిని వ్యక్తిగత ప్రశ్నలు వేయకుండా ఉండడం మంచిది. అందరితోనూ మర్యాదగా మాట్లాడాలి. ప్లీజ్, థ్యాంక్యూ పదాలు అవసరమైనప్పుడల్లా ఉపయోగించడం మంచి ఫలితాన్నిస్తుంది.
భారత ఎంబసీకి వివరాలు అందించడం వల్ల...
విలువైన వస్తువులు కలిగి ఉంటే వాటికి ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆహార పదార్థాలను తీసుకెళుతుంటే వాటిని స్పష్టంగా ముందే తెలియజేయాలి. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత తమ పూర్తి వివరాలు, చిరునామా, ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు, ఆస్టేలియాలో ఎక్కడ ఉంటున్నారు? తదితర పూర్తి వివరాలను భారతీయ కాన్సులేట్ లో తెలియజేయడం అత్యవసర పరిస్థితుల్లో సాయానికి ఉపకరిస్తుంది. న్యూ సౌత్ వేల్స్ లో ఉండేవారు www.indianconsulatesydney.org, విక్టోరియా, తాస్మానియాలో ఉండేవారు www.cgimelb.org, ఆస్ట్రేలియాలోని మిగతా ప్రాంతాల్లో నివసించే వారు www.hcindia-au.org వెబ్ సైట్ల ద్వారా తగిన సమాచారం, అధికారుల సాయం తీసుకోవచ్చు.
వీసా అధికారులు ఇవి చూస్తారు సుమా!
ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం, ప్రవర్తన, ఆరోగ్యం, కోర్సు పూర్తి చేసేందుకు, నివాసానికి కావాల్సిన ఆర్థిక వనరులు, విద్యార్హతలు, విద్య కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నారా?, స్వదేశంలో వారి కుటుంబ పరిస్థితులు తదితర అంశాలను ఆస్ట్రేలియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (డీఐబీపీ) విభాగం పరిశీలిస్తుంది. అసెస్ మెంట్ లెవల్స్ ను బట్టి విద్యార్థి వీసాలను క్షుణంగా పరిశీలిస్తారు. ఇమిగ్రేషన్ రిస్క్ ఆధారంగా వివిధ దేశాల వారికి వివిధ లెవల్స్ కేటాయించారు. లెవల్ 1 అంటే తక్కువ ఇమిగ్రేషన్ రిస్క్ ఉన్నట్టు. వీరు చాలా సులభంగా వీసా పొందవచ్చు. ఐదే లెవల్ 5 ఉంటే ఎక్కువ రిస్క్ ను సూచిస్తుంది. దీంతో అభ్యర్థులు ఆస్ట్రేలియా విద్యా సంస్థలో అడ్మిషన్ కు సంబంధించిన లేఖతోపాటు తమకున్న అర్హతల విషయంలో అన్ని ఆధారాలనూ సమర్పించాల్సి ఉంటుంది. భారత విద్యార్థులకు సంబంధించి... 570 వీసాకు లెవల్ 4 కేటాయించారు. 571 (2), 572(4), 573(4), 574(4), 575(3), 576 వీసాకు లెవల్ 2 కేటాయించారు. పూర్తి వివరాలు, సందేహాలను సమీపంలోని ఆస్ట్రేలియన్ ఎంబసీ నుంచి పొందవచ్చు.
457 వీసాటెంపరరీ వర్క్ (నైపుణ్యాలు కలిగిన) వీసా (సబ్ క్లాస్ 457) అన్నది విదేశీయులకు ఇచ్చే తాత్కాలిక వీసా. నిపుణులైన కార్మికులు ఈ వీసా కింద ఆస్ట్రేలియాలోని సంస్థల్లో ఉద్యోగావకాశాన్ని సంపాదించి నాలుగేళ్ల పాటు అక్కడ పనిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సంబంధిత ఉద్యోగానికి అర్హుడైన మరో నిపుణుడు లభించలేదన్న ఆధారాలు చూపించి సంస్థలు విదేశీ నిపుణులను భర్తీ చేసుకోవచ్చు. అయితే, ఈ వీసాల కారణంగా ఆస్ట్రేలియన్ల ఉద్యోగావకాశాలను విదేశీయులు తన్నుకుపోతున్నారంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఇందులో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ వీసాలు సైతం ఏడాదికి ఇంతమందికే అన్న పరిమితి కూడా ప్రస్తుతం లేదు. 2012-13లో 1,26,000 మంది ఈ వీసా పొందారు. గతేడాది ఇది 96,000గా ఉంది.
వీసాల్లో మార్పులు
457 వీసా సబ్ క్లాస్ ను పూర్తిగా రద్దు చేస్తూ దీని స్థానంలో రెండు కొత్త వీసా కార్యక్రమాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒకటి రెండేళ్ల కాల వ్యవధి, మరొకటి నాలుగేళ్ల కాలవ్యవధితో ఉంటుంది. టెంపరరీ స్కిల్ షార్టేజ్ వీసా (తాత్కాలిక నైపుణ్య కొరతను తీర్చే వీసా అని అర్థం). ఈ కొత్త వీసాలు 2018 మార్చి నుంచి అమల్లోకి వస్తాయి. ఇక గతంలో 457 వీసా కింద 650 ఉద్యోగాల్లో ప్రవేశాలకు వీలు ఉండేది. దాన్ని 200కు కుదించారు. కొత్త వీసా నిబంధనల కింద అధిక ప్రమాణాలతో కూడిన ఇంగ్లిష్ పరిజ్ఞానం అవసరం. అలాగే సరైన పోలీసు ధ్రువీకరణ, నేరపూరిత పరిశీలన కూడా తప్పనిసరి. అలాగే, రెండేళ్ల పని అనుభవం, లేబర్ మార్కెట్ టెస్టింగ్ కూడా అవసరం.
ఆస్ట్రేలియన్లు అందుబాటులో ఉంటే వారికే ఉద్యోగాలు ఇవ్వడం, ఒకవేళ నైపుణ్య మానవ వనరులు ఆస్ట్రేలియాలో అందుబాటులో లేకుంటేనే విదేశీ నిపుణులను భర్తీ చేసుకోవడం అన్నవి నూతన వీసాల ప్రధానోద్దేశం. 457 వీసా కింద పూర్తి స్థాయి నివాసిత హోదా పొందేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. అయితే, కొత్తగా తీసుకొస్తున్న రెండేళ్ల వర్క్ వీసా కింద ఈ అవకాశం ఉండబోదు. నాలుగేళ్ల వీసా కింద అవకాశం ఇస్తున్నా, అందుకు కఠిన నిబంధనలను ప్రతిపాదించనున్నారు. అలాగే, నాలుగేళ్ల వీసా రుసుమును సైతం 1,150 డాలర్ల నుంచి 2,400 డాలర్లకు పెంచారు. ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీ పనివారిలో భారత్ నుంచి 24.6 శాతం, బ్రిటన్ నుంచి 19.5 శాతం, చైనా నుంచి 5.8 శాతం ఉంటున్నారు.
వర్కింగ్ హాలిడే ప్రొగ్రామ్ లోనూ మార్పులు
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి అక్కడి అందాలను చూడడంతోపాటు కొంత కాలం పాటు పనిచేసుకోవాలనుకునే వారు గమనించాల్సిన అంశాలున్నాయి. 2017 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల మేరకు వర్కింగ్ హాలిడే వీసా చార్జీలు 50 డాలర్లు తగ్గి 390 డాలర్లుగా ఉంది. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు వయసు పరిమితి గతంలో 30 ఏళ్లుగా ఉండగా దాన్ని 35కు పెంచారు. ఒకే సంస్థలో 12 నెలల పాటు ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాకపోతే ఒక చోట ఆరు నెలలకు మించి పనిచేయడానికి లేదు. 37,000 ఆస్ట్రేలియన్ డాలర్ల వరకూ ఆదాయం ఆర్జించే వారిపై పన్ను రేటు ను 32.5 శాతం నుంచి 19 శాతానికి తగ్గించారు. వర్కింగ్ హాలిడే వీసా 417, వీసా ఎక్స్ టెన్షన్ పోగ్రామ్ 417, వర్క్ అండ్ హాలిడే వీసా 462కు ఈ మార్పులు అమలవుతాయి.