ఫిలిప్పీన్స్ లో డాక్టర్ పట్టా... ఖర్చు తక్కువే!

వైద్య విద్య విషయంలో భారతీయ విద్యార్థులకు చైనా, రష్యా కంటే ఫిలిప్పీన్స్ అనుకూలం. ఇంగ్లిష్ తెలిస్తే చాలు మరే భాషతోనూ పనిలేదు. ఏటా ఎంతో మంది వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్ వెళుతున్నారు. ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్, డెంటిస్ట్రీ, ఫార్మసీ, ఫిజియో థెరపీ, ఆప్టోమెట్రీ, నర్సింగ్ ఇలా అన్ని రకాల మెడికల్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఇక్కడి విద్యా సంస్థలు ఇతర కోర్సుల విషయంలోనూ నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. పెట్రోలియం ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, మెరైన్ సహా అన్ని ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 40 మెడికల్ కళాశాలలు, 2299 ఉన్నత విద్యాసంస్థలు కొలువుదీరాయి. 

అమెరికాలో చదివినట్టే

ఇది ఏడువేల దీవుల సమూహం. 9 కోట్లకు పైబడిన జనాభాలో 2 కోట్ల మంది వరకు రాజధాని మనీలాలోనే ఉంటారు. ఇక్కడ 93 శాతం మంది క్రిస్టియన్లే. ప్రపంచంలో ఇంగ్లిష్ భాష మాట్లాడే మూడో అతి పెద్ద దేశం. అమెరికన్ విద్యా విధానమే ఇక్కడ కూడా అమల్లో ఉంది. ఏటా 20 వేలకుపైగా విదేశీ విద్యార్థులు ఇక్కడి యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందుతున్నారు. వీరిలో అధిక శాతం భారతీయ విద్యార్థులే ఉంటున్నారు. ఏటా వేల సంఖ్యలో డాక్టర్లు, ఇంజనీర్లను ఈ దేశం ప్రపంచానికి అందిస్తోంది. అమెరికాలో ఉన్న ప్రతి పది మంది వైద్యుల్లో ఒకరు ఫిలిప్పీన్స్ లో వైద్య విద్య చదివిన వారే. దీన్ని బట్టి ఇక్కడి విద్యకు నాణ్యత పరంగా ఎంతటి గుర్తింపు ఉందో తెలుసుకోవచ్చు. 

ఫిలిప్పీన్స్ నుంచి భారత్, అమెరికా వరకు

ఫిలిప్పీన్స్ లో ఎండీ డిగ్రీని ప్రాథమిక వైద్య కోర్సుగా అందిస్తున్నారు. ఇది భారత్ లో ఎంబీబీఎస్ కు సమానం. దీన్ని పూర్తి చేసిన తర్వాత భారత్ లో ప్రాక్టీస్ చేయడానికి ఎం.సి.ఐ. నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంటుంది. తొలి ఏడాదిన్నర సైన్స్ గ్రూపులపై బోధన ఉంటుంది. తదుపరి నాలుగేళ్లు మెడిసిన్ అంశాలపై బోధన సాగుతుంది. కోర్సు ముగింపులో విద్యార్థులను హాస్పిటల్స్ కు అటాచ్ చేస్తారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో రోగులకు సేవలు అందించాల్సి ఉంటుంది. ఐదున్నరేళ్ల కోర్సు అనంతరం ఏడాది పాటు ఇంటర్న్ షిప్ చేయాలి. భారతీయ వైద్య మండలి స్క్రీనింగ్ టెస్ట్ పూర్తి చేస్తే భారత్ లో ఎక్కడైనా ఇంటర్న్ షిప్ చేసుకోవచ్చు. అనంతం వైద్యునిగా నమోదు చేసుకుని ప్రాక్టీస్ కూడా ప్రారంభించవచ్చు. యునైటెడ్ స్టేట్స్ మెడికిల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ రాసి ఉత్తీర్ణత సాధిస్తే... అమెరికాలో పీజీ వైద్య విద్య చేయడానికి లేదా అక్కడ వైద్యునిగా పనిచేయడానికి అనుమతి లభిస్తుంది. 

అనుకూలతలు...

డొనేషన్ లేకపోవడం, అందుబాటులో ఫీజులు,  నివాస వ్యయం తక్కువ, 95 శాతం మంది ఇంగ్లిష్ మాట్లాడడం, అమెరికన్ విద్యా విధానం, ఇంటర్ సైన్స్ గ్రూపులో 50 శాతం మార్కులతో ప్రవేశాలు పొందగలిగే వెసులుబాటు, భారత్, అమెరికా సహా ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇవన్నీ అనుకూలతలే. తీర ప్రాంతం కావడంతో వాతావరణం విషయంలో భారత్ మాదిరిగా ఉంటుంది. భారతీయ ఆహారం కూడా లభిస్తుంది. పైగా మన దేశానికి దగ్గరగానూ ఉంటుంది. కళాశాలల్లో వైఫై సౌకర్యం కూడా ఉంటుంది. ఫిలిప్పీన్స్ లో వైద్య విద్యా బోధన అంతా ఇంగ్లిష్ లోనే కొనసాగుతుంది. కనుక ఇక్కడ డాక్టర్ కోర్స్ చేయడం భారతీయ విద్యార్థులకు అనువుగా ఉంటుందని చెప్పవచ్చు. ఆధునిక బోధనా విధానాలు అమల్లో ఉన్నాయి. అమెరికన్ విద్యా విధానం కనుక ఎండీ కోర్సు పూర్తి చేసిన వారికి ఉన్నత విద్యా అవకాశాలతోపాటు అమెరికాలో వైద్యునిగా ఉద్యోగ అవకాశాలు కూడా తలుపు తడతాయి. 

ఫీజులు.. ఖర్చులు...

ట్యూషన్ ఫీజును ఏటా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఐదున్నరేళ్ల కోర్సుకు సుమారుగా 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. హాస్టల్ ఫీజులు, మెస్ ఫీజులు సహా నెలవారీ ఖర్చు 12వేల రూపాయల వరకు ఉంటుంది. అన్నీ కలుపుకుంటే 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే భారత్ లో అయితే మేనేజ్ మెంట్ కోటాలో సీటు సంపాదించాలంటే కోట్లు సమర్పించుకోవాల్సిందే. ఉదాహరణకు యూనివర్సిటీ ఆఫ్ పర్పెట్యుల్ హెల్ప్ లో ఎండీ కోర్సు ఫీజులు, ఇతర ఖర్చులు 2015 సంవత్సరంలో ఇలా ఉన్నాయి (అవగాహన కోసం)... తొలి ఏడాది ట్యూషన్ ఫీజు 4,762 అమెరికన్ డాలర్లు, హాస్టల్ లో ఉండేందుకు 2223 డాలర్లు... మొత్తం 6985 అమెరికన్ డాలర్లు. రెండో ఏడాది ఈ మొత్తం 5398 అమెరికన్ డాలర్లు, మూడు నుంచి ఐదో ఏడాది వరకు ఏటా 4604 అమెరికన్ డాలర్లుగా ఉంది. మొత్తం ఐదేళ్లకు భారతీయ కరెన్సీలో సుమారుగా రూ.20 లక్షల వరకు వ్యయం అవుతుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ఖర్చులు అదనం. ఇలా యూనివర్సిటీని బట్టి కోర్సు పూర్తి చేయడానికి అయ్యే వ్యయం మారుతుంది. కొన్ని యూనివర్సిటీల్లో 25 నుంచి 26 లక్షల రూపాయల వరకూ వ్యయం కావచ్చు. 

కళాశాలకు గుర్తింపు ఉందా? లేదా..?

కమిషన్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద ఫిలిప్పీన్స్ (సీహెచ్ఈడీ) ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు గుర్తింపు ఇస్తుంది. ప్రవేశం తీసుకుబోయే విద్యా సంస్థకు భారతీయ వైద్య మండలి గుర్తింపు ఉందా? లేదా? విచారించుకోవాలి. ఏఎంఏ కాలేజీ ఆఫ్ మెడిసిన్, ఏంజెల్స్ యూనివర్సిటీ ఫౌండేషన్, బికోల్ క్రిస్టియన్ కాలేజీ, కాగయాన్ స్టేట్ యూనివర్సిటీ, సెబు డాక్టర్స్ యూనివర్సిటీ కాలేజీ, సెబ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్, సెంట్రల్ ఫిలిప్పీన్స్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ మెడిసిన్, డావో మెడికిల్ స్కూల్ ఫౌండేషన్, డీ లా సల్లే హెల్త్ సైన్స్ ఇన్ స్టిట్యూట్, ఎమీలియో అగ్నాల్డో కాలేజ్, ఫార్ ఈస్ట్రన్ యూనివర్సిటీ, ఇలోయిలో డాక్టర్స్ కాలేజీ ఆఫ్ మెడిసిన్, లైసెమ్ నార్త్ వెస్ట్రన్ కాలేజీ, మిండానా స్టేట్ యూనివర్సిటీ, ఔర్ లేడీ ఆఫ్ ఫాతిమా యూనివర్సిటీ, శాన్ బెడా కాలేజీ, సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీ , యూనివర్సిటీ ఆఫ్ పెర్పెట్యుల్ హెల్ప్, యూనివర్సిటీ ఆఫ్ శాంటో థామస్, యూనివర్సిటీ ఆఫ్ ద సిటీ ఆఫ్ మనీలా, యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ తదితర విద్యా సంస్థలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉంది. నిబంధనల్లో మార్పులు ఇతర సమాచారం కోసం www.ched.gov.ph, www.ched.gov.phవెబ్ సైట్ ను పరిశీలించవచ్చు. 

సీ హెచ్ఈడీ ఎప్పటికప్పుడు గుర్తింపు కలిగిన కళాశాలల జాబితాను విడుదల చేస్తుంది. దీనిని www.indembassymanila.in  వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. ఇక్కడి కళాశాలలు మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు సీట్లకు మాత్రమే విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతి ఉంది. కొన్ని కళాశాలలు దీన్ని పాటించకుండా అదనంగా ఎన్నో రెట్లు విద్యార్థులను చేర్చుకుంటుంటాయి. కొన్ని కళాశాలలు బీఎస్ కోర్సును రెండు సెమిస్టర్లలోనే పూర్తి చేయవచ్చని చెబుతుంటాయి. అలాంటప్పుడు సీహెచ్ఈడీ మార్గదర్శకాలను ఆయా కళాశాలలు పాటిస్తున్నాయా? లేదో చూసుకోవాలి.

అడ్మిషన్ ఎలా…?

టోఫెల్, ఐఈఎల్టీఎస్ వంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. నేరుగా ఎండీ కోర్సులో ప్రవేశం కల్పించరు. ఎండీ కోర్సులోకి ప్రవేశం పొందాలంటే 10+4 చదివి ఉండాలి. అందుకే భారతీయ విద్యార్థులు ముందుగా 10+2 విద్యార్హతతో బీఎస్ కోర్సులో ప్రవేశం పొందాలి. ఇది ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఎన్ మ్యాట్ టెస్ట్ రాసి ఎండీ కోర్సులోకి ప్రవేశం తీసుకోవాలి. ఎండీ కోర్సులో ప్రవేశం కోసం డిగ్రీ కలిగి ఉండడం తప్పనిసరి. బీఎస్ కోర్స్ ఆ అర్హతను అందిస్తుంది. ఎన్ మ్యాట్ లో కనీసం 40 పర్సంటైల్ అయినా రావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష చాలా కఠినంగా ఉంటుందని దీన్ని ఎదుర్కొన్న భారతీయ విద్యార్థులు చెబుతుంటారు. అయితే, అన్ని యూనివర్సిటీలూ ఎన్ మ్యాట్ ను తప్పనిసరిగా భావించడం లేదు. కేవలం కొన్ని యూనివర్సిటీలే ఈ పరీక్షను అర్హతగా అడుగుతున్నాయి. ఇందులో ఎలాంటి ర్యాంకింగ్ విధానం లేదు. పరీక్ష పాస్ అయితే చాలు. ఈ పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్ 1లో వెర్బల్ రీజనింగ్, క్వాంట్… పార్ట్ 2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు.

అన్నీ విచారించుకునే… 

అడ్మిషన్ కోసం ఏజెంట్ల సాయం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు విద్యార్థులకు అడ్మిషన్ విషయంలో, ఫిలిప్పీన్స్ లో ఉండే అవకాశాలు, వసతుల విషయంలో అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తుంటారు. భారతీయ ఎంబసీకి ఎక్కువగా ఈ విషయాలపైనే ఫిర్యాదులు వస్తుంటాయి. ఫీజు, కోర్సు కాల వ్యవధి, వీసా వీటి విషయంలో సరైన సమాచారం ఇవ్వరు. అందుకే విద్యార్థులు ఆయా యూనివర్సిటీలకు నేరుగా మెయిల్ చేసి సంప్రదింపుల ద్వారా అసలైన సమాచారాన్ని తెలుసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అన్ని కళాశాలల్లోనూ విదేశీ విద్యార్థుల కోసం ఓ డైరెక్టర్ ఉంటారు. ఈ మెయిల్ ద్వారా వారి నుంచి సమాచారం తెలుసుకోవాలి. అడ్మిషన్ పొందడం ఎలా?, ఫీజులు, ఫ్యాకల్టీ వివరాలు, బీఎస్ కోర్సు కాల వ్యవధి, ఎండీ సీట్లలో ఏదైనా కోటా ఉందా, బ్యాంకు ద్వారా నేరుగా ఫీజు చెల్లించవచ్చా, హాస్టల్, మెస్ సదుపాయాలు, శాంతి భద్రతలు, బ్యాంకు సదుపాయాలు మొదలైన అంశాలపై  పూర్తి సమాచారం తెప్పించుకోవాలి.

వీసా రకాలు

డిగ్రీ, ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం స్టూడెంట్ వీసా తీసుకోవాలి. అదే నాన్ డిగ్రీ కోర్సుల్లో చేరే 18 ఏళ్లలోపు వారికి స్పెషల్ స్టూడెంట్ పర్మిట్ జారీ చేస్తుంటారు. స్టూడెంట్ వీసా ఏడాది గడువుతో జారీ చేస్తారు. దీన్ని కోర్సు పూర్తయ్యే వరకూ పొడిగించుకోవచ్చు. మెడిసిన్ కోర్సుల కోసం వెళ్లే విద్యార్థులు సీహెచ్ఈడీ జారీ చేసే సర్టిఫికెట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ (సీఈఏ) కాపీని వీసా కోసం సమర్పించాల్సి ఉంటుంది. ఫిలిప్పీన్స్ విదేశీ వ్యవహరాల శాఖ సంబంధిత పత్రాలను అభ్యర్థికి సంబంధించిన దేశంలోని ఫారిన్ సర్వీస్ పోస్ట్ కు పంపిస్తుంది. ధ్రువీకరణ పూర్తయ్యాక అన్ని అర్హత పత్రాలతో వీసా ఇంటర్వ్యూ పిలుపు అందుతుంది. ఇందుకు సంబంధించి ఫేస్ బుక్ పేజీ www.facebook.com/IndiaInPhilippines  నుంచి కూడా సమచారం తెలుసుకోవచ్చు. 

సాధారణంగా టూరిస్ట్ వీసాపై వెళ్లి దాన్ని స్టూడెంట్ వీసాగా మార్చుకోవచ్చని ఏజెంట్లు చెబుతుంటారు. ఇది కొంచెం సమయం తీసుకుంటుంది. దానికంటే కూడా స్టూడెంట్ వీసాపై వెళ్లడం ఉత్తమం. ఫిలిప్పీన్స్ లో మెడిసిన్ చదవడం పూర్తయ్యాక విద్యార్హతల పత్రాలను సీహెచ్ఈడీ, కాన్సులర్ వింగ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫారీన్ అఫైర్స్ ద్వారా ధ్రువీకరించుకోవాలి. దీన్నే రెడ్ రిబ్బన్ ప్రాసెస్ అంటారు. ఇది పూర్తయ్యాక ఒరిజినల్ పత్రాలను భారతీయ ఎంబసీకి సమర్పించి అటెస్టేషన్ తీసుకోవాలి. భారత కు చేరుకున్న తర్వాత తిరిగి ఒరిజినల్ అర్హతా పత్రాల జిరాక్స్ కాపీలను ఎంసీఐకి సమర్పిస్తే... వారు భారతీయ ఎంబసీకి పంపించి అసలైనవా, కావా? అన్నది నిర్ధారించుకుంటారు.

తెలుసుకుని రండి  

వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్ వరకు వెళ్లిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి...? విద్యా విధానం, చదువు, ఆహారం, భద్రత ఇలాంటి విషయాల సంగతేంటి...? తెలుగు వారందరికీ ఎంతో ఉపకరించే ఈ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఆ దేశంలో ఎండీ కోర్సు చేస్తున్న సీహెచ్ పవన్ https://www.ap7am.com/ కు తెలియజేశారు.  

75 శాతం వస్తేనే పాస్

ఇక్కడి బోధనా విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది. పేరున్న వైద్య విద్యా సంస్థలు చాలానే ఉన్నాయి. ఎండీ (ఎంబీబీఎస్) కోర్సు కాల వ్యవధి మొత్తం నాలుగేళ్లు. తొలి రెండేళ్లు టీచింగ్. తదుపరి రెండేళ్లు పూర్తిగా ఇంటర్న్ షిప్. ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ప్రతీ సబ్జెక్టులోనూ 75 శాతం మార్కులు తప్పనిసరి. ఆ మేరకు వస్తేనే పాస్ గా పరిగణిస్తారు. అంతకన్నా తగ్గితే అదే సబ్జెక్ట్ ను మళ్లీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక సెమిస్టర్ లో ఒక సబ్జెక్ట్ లో వెనుకబడితే తదుపరి సెమిస్టర్ లో దానికి సంబంధించిన లింక్ సబ్జెక్ట్ చదవడానికి కూడా అనుమతించరు. కనుక ఇక్కడికి వచ్చే ప్రతీ ఒక్కరూ శ్రద్దగా చదవాల్సి ఉంటుంది.

వైద్య విద్య చదివే స్థానిక ఫిలిప్పీన్స్ వాసుల్లో 99 శాతం మంది పాస్ అవుతుంటారు ఎక్కడో ఒకరు తప్ప. కానీ, మనదేశం నుంచి వచ్చే వారిలో కొద్దిమంది మాత్రం 75 శాతం సాధించలేక సబ్జెక్ట్స్ ను రిపీట్ చేస్తుంటారు. దీంతో వైద్య విద్య పూర్తి చేసేందుకు అదనంగా ఒకటి రెండేళ్ల సమయం తీసుకుంటారు.

ఇంటర్న్ షిప్

ఇంటర్న్ షిప్ లో భాగంగా హాస్పిటల్స్ లో వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఇంటర్న్ షిప్ లో భాగంగా కచ్చితమైన వేళలు పాటించాలి. విధులు నిర్వహిస్తేనే ఇంటర్న్ షిప్ కు వైద్యులు ఆమోదముద్ర వేస్తారు. రెండేళ్ల పాటు రోగులకు వైద్య సేవలు అందించే సమయంలో వారితో స్థానిక భాషలో మాట్లాడాల్సి ఉంటుంది. నిజానికి ఇక్కడి వైద్యుల్లో 90 శాతం మంది సేవా దృక్పథం కలవారే. కేవలం 10 శాతం మాత్రమే ధన ప్రయోజనాల కాంక్షతో ఉంటారు. 

వసతి, భద్రత

విద్యార్థులు కచ్చితంగా కళాశాలల అనుబంధ డార్మిటరీల్లోనే ఉండడం భద్రతా పరంగా మంచిది. బయటి ప్రదేశాల్లో గాడ్జెట్లు చోరీకి గురవుతుంటాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానికులతో వివాదం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే వివాదం వచ్చినా పోలీసులు స్థానికులపై చర్యలు తీసుకోరు. ఇక్కడికి చదువుకునేందుకు వచ్చే విదేశీయుల్లో అధిక శాతం మంది నైజీరియన్లు, కొరియన్లు, ఆ తర్వాత భారత్ నుంచి ఉంటారు. మనవారు 13 వేల మంది వరకు ఇక్కడ చదువుకుంటున్నారు. 

వీటి ఆకర్షణలో పడితే చదువు గుల్లే

ఫిలిప్పీన్స్ లో అంతా ఫ్రీ, ఓపెన్ కల్చర్. పబ్బులు, అమ్మాయిలు... ఇలా ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. ఇక్కడికి వచ్చే తెలుగు వారు సాధారణంగా వీటి ఆకర్షణలో పడి చదువును ఆగం చేసుకుంటున్నారు. అధ్యాపకులు కౌన్సెలింగ్ ఇచ్చినా వినేవారు తక్కువే. ఎంతో వ్యయం చేసి ఇక్కడి వరకూ వచ్చినప్పుడు, అత్యుత్తమ విద్యా బోధనను అవకాశంగా తీసుకుని కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ముందుగానే తగిన అవగాహన కల్పించాలి.

అవగాహనతోనే అడుగు పెట్టాలి

ఫిలిప్సీన్స్ లో పరిస్థితులు, వసతులు, సౌకర్యాలు, అక్కడి నిబంధనలు, పద్ధతులు ఇలా ఎన్నో అంశాల గురించి చెప్పేవారే ఉండరు. తీరా ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత అంతా కొత్తగా ఉంటుంది. కన్సల్టెన్సీలు కేవలం పంపించడానికే పరిమితం అవుతాయి. సమస్య వస్తే సాయం చేసేవారే కనిపించరు. భారతీయ ఎంబసీ ఏదైనా చేస్తుందన్న ఆశ కూడా పెట్టుకోవద్దు. దాదాపు అక్కడి నుంచి కూడా ఎలాంటి సహకారం అందదు. 

కళాశాలల్లో ఎలా మసలుకోవాలి, విద్యా విధానం గురించి ముందుగానే తెలుసుకుంటే మంచిది. మన దేశం నుంచి వచ్చే వారు స్వదేశంలో వలే కాపీ కొట్టే ట్రిక్స్ చేస్తుంటారు. ఫిలిప్సీన్స్ వాసులు కాపీకి దూరం. ఈ విషయంలో ఇక్కడి అధ్యాపకులు కూడా స్ట్రిట్ గా ఉంటారు. స్వదేశం నుంచి ఇక్కడకు వస్తున్న తెలుగువారిలో కొందరు చదువు మధ్యలో ఆపేసి వెనుదిరుగుతుంటారు. అవగాహన లేమి, ఆకర్షణల వలలో పడి చదువులో వెనుకబడి ఈ పరిస్థితిని తెచ్చుకుంటారు.

అత్యుత్తమ విద్యా సంస్థలు

వైద్య విద్యకు మనీలాలోని యూనివర్సిటీ ఆఫ్ శాంట థామస్ అత్యుత్తమ విద్యా సంస్థ. ఇక్కడ వైద్య కోర్సుకు రూ.40 లక్షల వ్యయం అవుతుంది. చాలా పేరున్న విద్యా సంస్థ. ప్లేస్ మెంట్ గ్యారంటీ. డెంటల్ వైద్య విద్యకు పేరు గాంచినది అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ. కోర్సుకు అయ్యే ఖర్చు రూ.35 లక్షలు. సెబు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్, సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్, సేంట్ పౌల్ యూనివర్సిటీ, కెగయాన్ స్టేట్ యూనివర్సిటీలు విద్యా నాణ్యత పరంగా మంచివి. యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ ఫిలిప్సీన్స్ మంచిది కాదు. 

ఇలా చేస్తే బెటర్...

ఇంటర్ అర్హతతో ఫిలిప్సీన్ కు వచ్చి ఏడాదిన్నర పాటు బీఎస్ కోర్సు చేసి, ఎన్ మ్యాట్ టెస్ట్ ద్వారా నాలుగేళ్ల వైద్య విద్య కోర్సు చదవడం కంటే... స్వదేశంలోనే డిగ్రీ చదివి ఇక్కడ నాలుగేళ్ల వైద్య కోర్సు చేసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. 

గమనిక: విదేశాల్లో కోర్సులు చేస్తున్నవారు, ఇప్పటికే కోర్సులు పూర్తి చేసిన వారు లేదా వారి తల్లిదండ్రులు ఎవరైనా విలువైన విషయాలు, తమ అనుభవాలను ఏపీ7ఏఎంకు తెలియజేయవచ్చు. ఆర్టికల్ చివరిలో ఫీడ్ బ్యాక్ కాలమ్ లో తెలియజేయండి. లేదా మీ పేరు కాంటాక్ట్ నంబర్ ఇస్తే మేమే కాల్ చేసి వివరాలు తీసుకుంటాం


More Articles