తక్కువ వ్యయానికే రష్యాలో వైద్య విద్య!
నాణ్యమైన విద్య విషయంలో రష్యాకు కూడా అంతర్జాతీయంగా మంచి గుర్తింపే ఉంది. ముఖ్యంగా ఇక్కడ మెడిసిన్, ఇంజనీరింగ్, ఏవియేషన్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు సంబంధించిన కోర్సులు విద్యార్థులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అయితే, భారత్ నుంచి ప్రధానంగా ఎక్కువ మంది మెడిసిన్ కోసం రష్యాకు వెళుతుంటారు. ప్రస్తుతం ఏటా సుమారు 5వేల మంది విద్యార్థులు రష్యాలోని మెడికల్, టెక్నికల్ కళాశాలల్లో చదువుతున్నారు.
అంతర్జాతీయ గుర్తింపు
రష్యాలోని అన్ని మెడికల్ కళాశాలలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉంది. విదేశీ వైద్య కళాశాలల్లో చదివే ముందు భారతీయ వైద్య మండలి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. రష్యా మెడికల్ కళాశాలలు అన్నింటిలోనూ ఇంగ్లిష్ బోధన లేదు. కేవలం కొన్నింటిలోనే అందుబాటులో ఉంది. అదీ మొదటి మూడు సంవత్సరాల వరకే ఇంగ్లిష్ బోధన. నాలుగో ఏడాది నుంచి రష్యన్ భాషలోనే టీచింగ్ కొనసాగుతుంది. చదువు పూర్తయ్యాక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ) నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణులు కావాలి. అప్పుడే ఆ డిగ్రీకి మన దేశంలో గుర్తింపు అన్నమాట!
నేరుగా అడ్మిషన్
రష్యా యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్ తదితర కోర్సుల్లో ఎలాంటి ప్రవేశ పరీక్షలు రాయకుండానే నేరుగా అడ్మిషన్ పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిలో అన్ని అర్హత ప్రమాణాలున్న వారికి ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన సీట్లు లభిస్తాయి. జనవరి నుంచి జూలై వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. తరగతులు సెప్టెంబర్ నుంచి మొదలవుతాయి. కచ్చితంగా సీటు కోరుకునేవారు ముందుగా దరఖాస్తు చేసుకోవడం మంచిదని నిపుణుల సూచన.
చాలా సంస్థలు కాంట్రాక్టర్ల మధ్యవర్తిత్వంతో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తుంటాయి. అలాగే, ఫీజుల వసూలు, హాస్టల్ వసతి, ఇతర పనులను వారి ద్వారానే నడిపిస్తుంటాయి. ఫీజు నేరుగా యూనివర్సిటీలోనే చెల్లించడం సురక్షితం. చాలా కళాశాలల్లో వసతి సదుపాయం లేదు. విడిగా నివాసం, ఆహార వసతులను విద్యార్థులే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. భారత్ లో ఎంబీబీఎస్ తదితర బేసిక్ వైద్య విద్య చదివి పీజి వైద్య విద్యను రష్యాలో చేయాలనుకునే వారు ముందుగా అక్కడి విద్యా శాఖను సంప్రదించాలి. తమ దేశంలో విద్యార్హత, రష్యాలో విద్యార్హతతో సమానమంటూ తెలిపే సర్టిఫికెషన్ ఆఫ్ ఈక్వలెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
టీవర్ స్టేట్ మెడికల్ అకాడమీ లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు చేరుతుంటారు. ఇక్కడ భారతీయుల కోసమే ప్రత్యేకంగా కమ్యూనిటీ ఉంది. భారతీయ పండుగలను కూడా జరుపుకుంటారు. శాకాహర భోజనశాల కూడా కలదు. యూరప్, అమెరికాలతో పోలిస్తే రష్యాలో ఉద్యోగ వేతనాలు తక్కువ. ఈ విధమైన కారణాల వల్ల భారతీయ విద్యార్థులు చదువు కోసం మాత్రమే రష్యాకు వెళుతున్నారు. నూటికి కేవలం ఒక్క శాతంలోపు మాత్రమే అక్కడ ఉద్యోగ అవకాశాలు చూసుకుంటున్నారు. ఇంటర్ లో కనీసం 50 శాతం మార్కులు ఉంటేనే ప్రవేశానికి అర్హత.
స్కాలర్ షిప్...
విద్యార్థులకు స్కాలర్ షిప్ సదుపాయాలు కూడా ఉన్నాయి. చదువుతూనే ఉద్యోగం చేసుకోవచ్చు. నెలవారీ జీవన వ్యయం సుమారు 100 అమెరికన్ డాలర్లుగా ఉంటుంది. యూనివర్సిటీలే విద్యార్థులకు మెడికల్ ఇన్సూరెన్స్ కల్పిస్తాయి. తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. భద్రత విషయంలో స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. వేళాపాళ లేకుండా ఎక్కడ పడితే అక్కడకు అదీ ఒంటరిగా వెళ్లడం ప్రమాదకరం. అలాగే, దగ్గర పాస్ పోర్ట్, వీసా అన్ని వేళలా ఉంచుకోవాలి. పోలీసులు ఎప్పుడైనా, ఎక్కడైనా అడిగే అవకాశం ఉంటుంది. అలాగే, వీటిని ఒక సెట్ జిరాక్స్ తీసి వేరుగా భద్రపరచుకోవడం మంచిది. భారతీయ ఎంబసీ ఫోన్ నంబర్ రాసి పెట్టుకుంటే అత్యవసర సందర్భాల్లో సాయం కోరడానికి వీలవుతుంది.
విద్యా వ్యయం
రష్యాలో ఎంబీబీఎస్ చదివేందుకు అయ్యే వ్యయం యూనివర్సిటీని బట్టి మారుతుంది. ఉదాహరణకు టీవర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో తొలి ఏడాది ఫీజు ఆరు వేల డాలర్లు, హాస్టల్ ఫీజు 750 డాలర్లు. మొత్తం కలుపుకుంటే 4,40,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇలా ఆరేళ్ల పాటు చెల్లించాలి. సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో తొలి ఏడాది ట్యూషన్ ఫీజు 4,500 అమెరికన్ డాలర్లు. హాస్టల్ ఫీజు 600 డాలర్లు. మొత్తం మీద సుమారు 3,39,000 రూపాయలు అవుతుంది. ఓరెల్ స్టేట్ యూనివర్సిటీలో తొలి ఏడాది ఈ వ్యయం 2,28,000 మాత్రమే. భోజనం ఖర్చు అదనం. చాలా కళాశాలలు హాస్టల్ వసతి కల్పిస్తాయి కానీ, ఆహారాన్ని అందించవు. విద్యార్థులే సొంతంగా వండుకోవాల్సి ఉంటుంది.
వివిధ రకాల వీసాలు
స్టూడెంట్ వీసా: అకడమిక్, భాషా కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారు స్టూడెంట్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ప్రవేశ ధ్రువీకరణ తీసుకోవాలి. వీసా గడువు మూడు నెలల నుంచి ఏడాది కాల పరిమితి ఉంటుంది. తర్వాత కోర్సుకాల వ్యవధికి అనుగుణంగా పొడిగిస్తారు.
ఎంప్లాయిమెంట్ వీసా: రష్యా కంపెనీల్లోని విదేశీ నిపుణులకు వీటిని జారీ చేస్తారు. మూడు నెలల నుంచి ఏడాది కాల వ్యవధి ఉంటుంది. వర్క్ పర్మిట్, ఉద్యోగ ఒప్పందం ఆధారంగా దీన్ని జారీ చేస్తారు.
టూరిస్ట్ వీసా: గడువు 30 రోజులు ఉంటుంది. రష్యన్ టూరిస్ట్ కంపెనీ ద్వారా తీసుకోవాలి. గడువు దాటిన తర్వాత ఉండడానికి అనుమతించరు.
బిజినెస్ వీసా: వ్యాపార పనుల కోసం వచ్చేవారికోసం. విదేశీ అధికార ప్రతినిధులు, సాంస్కృతిక, క్రీడా ప్రదర్శకులు తదితరులు దీన్ని తీసుకోవాలి. వీసా కాల పరిమితి ఏడాది వరకూ ఉన్నప్పటికీ... ఒక్కసారి రష్యాలోకి ప్రవేశించాక గరిష్ఠంగా 90 రోజుల వరకే ఉండడానికి అనుమతి ఉంటుంది. వీసా ఏడాది కాలపరిమితిలోపు మళ్లీ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
ప్రైవేట్ / హోమ్ స్టే వీసా: స్నేహితులు, బంధువులు రష్యాలో ఉంటే వారి దగ్గరకు వెళ్లేందుకు వీలుగా ఈ వీసా తీసుకోవాలి. అక్కడున్న వారి ఆహ్వానం మేరకు వెళుతున్నట్టు ఆధారం చూపాలి. 90 రోజుల వరకు ఉండవచ్చు. ఏ వీసా గడువునైనా మార్చుకునేందుకు అవకాశం లేదు. అలాగే, వీసా హోదాను కూడా మార్చుకునేందుకు అనుమతించరు.