ఆంక్ష‌లు, నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లను లెక్క‌చేయ‌కుండా ప‌ద్మావ‌త్ సినిమాను విడుద‌ల చేసినందుకు సంజ‌య్‌లీలా భ‌న్సాలీపై ప‌గ‌తీర్చుకోవాల‌ని రాజ్‌పుత్ క‌ర్ణిసేన నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయ‌న త‌ల్లి లీలాపై ఓ సినిమా తీసి ప్ర‌తీకారం తీర్చుకోవాలనుకుంటున్నార‌ట‌. ఈ విష‌యం గురించి రాజ‌స్థాన్ జిల్లా క‌ర్ణిసేన విభాగం అధ్య‌క్షుడు గోవింద్ సింగ్ కొన్ని వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

'సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్ప‌టికే ప్రారంభమైంది. సినిమాకు 'లీలా కీ లీలా' అనే పేరు ఖరారు చేశాం. అరవింద్ వ్యాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. ఓ ఏడాది వ్యవధిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం‌' అని గోవింద్ సింగ్ ప్రకటించారు. తాము తల్లిగా భావించే పద్మావతిపై సంజయ్ లీలా భన్సాలీ సినిమాను తెరకెక్కించ‌డ‌మే కాక అది రిలీజ్ చేసి ఆమెని అవమానించాడ‌ని, కానీ తాము సంజయ్ లీలా భన్సాలీ తల్లిపై తెరకెక్కించే సినిమా చూస్తే, అతడు గర్వపడేలా ఉంటుంద‌ని గోవింద్ స్పష్టంచేశారు.