హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్ లో ఈ రోజు ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఎంబీ భవన్ వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి ముందుకు దూసుకువెళ్లి పలు వాహనాలను ఢీ కొట్టింది. రెండు నిండు ప్రాణాలను బలిగొంది.

ఇద్దరు కాలేజీ విద్యార్థులు బైక్‌పై వెళ్తూ ఆ లారీ ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందారు. వారిద్దరు హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మృతి చెందిన విద్యార్థుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నడిరోడ్డుపై పడి ఉన్న వారి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.