Allu Aravind: ఇంత రేటింగ్ ఎవరికీ ఇవ్వరు... బాలయ్య వల్లే సాధ్యమైంది: అల్లు అరవింద్
- నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే
- త్వరలోనే నాలుగో సీజన్ ప్రారంభం
- నేడు అన్ స్టాపబుల్-4 ట్రైలర్ ఆవిష్కరణ
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో త్వరలోనే నాలుగో సీజన్ లోకి ఎంటరవుతోంది. విజయదశమి సందర్భంగా హైదరాబాదులో ట్రైలర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. "
రెండున్నర సంవత్సరాల క్రితం ఈ టాక్ షోకి శ్రీకారం చుట్టాం. బాలకృష్ణ గారితో మంచి టాక్ షో చేస్తున్నాం అనే ఊహతో ఈ కార్యక్రమం ప్రారంభించాం. తీరా చూస్తే... ఈ టాక్ షో భారతదేశంలోనే అతి పెద్ద టాక్ షోగా నిలిచింది.
చాలామందికి తెలిసే ఉంటుంది... ప్రపంచవ్యాప్తంగా ఐఎండీబీ రేటింగ్ ఉంటుంది. ఈ ఐఎండీబీ రేటింగ్ లో అన్ స్టాపబుల్ టాక్ షోకి 9/10 రేటింగ్ ఇచ్చారు. ఇంత రేటింగ్ ఏ షోకి ఇవ్వరు. మన దేశంలో కొన్ని టాప్ షోలు ఉన్నాయి... వాటి పేర్లు చెప్పడం బాగుండదు కానీ... ఐఎండీబీలో వాటి రేటింగ్ చూడండి... అన్నీ 6.5, 6.7... ఇలా ఉంటాయి. మన షోకి మాత్రమే 9/10 ఇచ్చారు.
అటువంటి టాక్ షో మన ఆహాకి రావడం మా అదృష్టం. ఈ టాక్ షో బాధ్యతలను మేం బాలయ్య భుజాలపై పెట్టాం... ఆయన దాన్ని అంత ఎత్తుకు తీసుకెళ్లారు" అంటూ అల్లు అరవింద్ వివరించారు.