మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా బృందానికి ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. 'పెద్ది' విడుదల వాయిదా పడిందంటూ తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటని, వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ఓ వీడియో ద్వారా స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే.. ఎస్‌కేఎన్ తన సొంత నిర్మాణ సంస్థలో వస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా విడుదల తేదీని ప్రకటించే క్రమంలో నిన్న రాత్రి 'పెద్ది' గురించి మాట్లాడారు. ఏ పెద్ద సినిమా విడుదలయ్యే తేదీలో తమ చిత్రాన్ని తీసుకురావొద్దనే ఉద్దేశంతోనే తాను అలా వ్యాఖ్యానించానని, కానీ అది పొరపాటుగా దొర్లిందని వివరించారు.

ఈ సందర్భంగా 'పెద్ది' సినిమా గురించి ఆయన సానుకూలంగా మాట్లాడారు. ఆ చిత్రం అనుకున్న సమయానికే విడుదలై ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. నిర్మాత ఎస్‌కేఎన్ తాజా వివరణతో ఈ అంశంపై నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లయింది.