ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 నాలుగో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

గుజరాత్ ఇన్నింగ్స్‌ను సాయి సుదర్శన్ (13), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39) దూకుడుగా ఆరంభించారు. అయితే, మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో సుదర్శన్ ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్, జోస్ బట్లర్ (38) రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని యజ్వేంద్ర చాహల్ విడదీశాడు. ఒకే ఓవర్‌లో గిల్, బట్లర్‌లను ఔట్ చేసి గుజరాత్‌ను దెబ్బకొట్టాడు.

ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (25) కొన్ని షాట్లతో అలరించినా, పంజాబ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ స్కోరు వేగాన్ని నియంత్రించారు. ముఖ్యంగా, విజయ్‌కుమార్ వైశాఖ్ చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. మార్కో యాన్సెన్ పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. పంజాబ్ బౌలర్లలో వైశాఖ్ 3, చాహల్ 2, జాన్సెన్ ఒక వికెట్ సాధించారు.