బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థ 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' నుంచి వస్తున్న తాజా చిత్రం 'ఏక్ దిన్'. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం, ఒక విభిన్నమైన ప్రేమకథతో ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ ప్రకారం కథానాయకుడు రోహన్ (జునైద్ ఖాన్) తన సహోద్యోగి మీరా (సాయి పల్లవి)ను ఇష్టపడతాడు, కానీ తన ప్రేమను వ్యక్తపరచడానికి ధైర్యం చేయలేకపోతాడు.

కథలో భాగంగా కంపెనీ టార్గెట్లను అధిగమించడంతో వారి బాస్ (కునాల్ కపూర్) మొత్తం టీమ్‌ను జపాన్‌కు ట్రిప్‌కు తీసుకువెళ‌తాడు. అక్కడ జరిగిన ఒక ప్రమాదంలో మీరా గాయపడుతుంది. ఆమెను పరీక్షించిన వైద్యులు, ఆమె 'ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా' (టీజీఏ) అనే అరుదైన పరిస్థితికి గురైందని రోహన్‌కు చెబుతారు. ఈ సమస్య వల్ల వ్యక్తి స్వల్పకాలిక జ్ఞాపకశక్తిని కోల్పోతారని, సాధారణంగా 24 గంటల్లో తిరిగి మామూలు స్థితికి వస్తారని వివరిస్తారు. దీంతో మీరాతో ఒక రోజంతా గడిపే అవకాశం రోహన్‌కు లభిస్తుంది. అయితే, 24 గంటల తర్వాత ఆమె తనను పూర్తిగా మర్చిపోతుందనే వాస్తవం అతడిని సంఘర్షణకు గురిచేస్తుంది.

ఈ ట్రైలర్ చూసిన చాలా మందిలో ఒకే ప్రశ్న మెదులుతోంది. నిజంగా ఇలా 24 గంటల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోవడం సాధ్యమేనా? ఈ సందేహాలకు సమాధానమిచ్చేందుకు, ఎన్డీటీవీ గురుగ్రామ్‌కు చెందిన మారెంగో ఆసియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్‌ స్పైన్ (MAIINS) ఛైర్మన్, డాక్టర్ ప్రవీణ్ గుప్తాతో మాట్లాడింది.

ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా (టీజీఏ) అంటే ఏమిటి?
డాక్టర్ ప్రవీణ్ గుప్తా వివరిస్తూ.. "టీజీఏ అనేది ఒక న్యూరలాజికల్ సిండ్రోమ్. ఇది అకస్మాత్తుగా మొదలై, దానంతట అదే తగ్గిపోతుంది. దీనివల్ల బాధితులు కొత్త జ్ఞాపకాలను ఏర్పరుచుకోలేరు. కొన్నిసార్లు పాత జ్ఞాపకాలను కూడా కొంతమేర మర్చిపోతారు. ఈ పరిస్థితి సాధారణంగా 4 నుంచి 8 గంటల పాటు ఉండి, 24 గంటలలోపు పూర్తిగా సర్దుకుంటుంది" అని తెలిపారు. ఇది ప్రధానంగా 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారిలో కనిపిస్తుందని, మైగ్రేన్ చరిత్ర, తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా శారీరక శ్రమ వంటివి దీనికి ప్రమాద కారకాలుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మేయో క్లినిక్ నివేదిక ప్రకారం బాధితులు తమ గుర్తింపును, కుటుంబ సభ్యులను గుర్తుపడతారు కానీ, కొన్ని రోజుల, నెలల లేదా ఏడాది క్రితం జరిగిన విషయాలను మర్చిపోవచ్చు.

టీజీఏ రావడానికి కారణాలేంటి?
డాక్టర్ గుప్తా ప్రకారం తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక శారీరక శ్రమ, బాధ కలిగించే సంఘటనలు, వేడి లేదా చల్లటి నీటిలో అకస్మాత్తుగా మునగడం వంటివి టీజీఏను ప్రేరేపిస్తాయి. దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏదీ లేదని, ఇది ప్రమాదకరం కాని, వాటంతట అవే నయమయ్యే సమస్య అని ఆయన స్పష్టం చేశారు. అయితే, స్ట్రోక్ లేదా మూర్ఛ వంటి తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు లేవని నిర్ధారించుకోవడం కోసం తక్షణ వైద్య సహాయం అవసరమని సూచించారు.

సినిమా వర్సెస్ వాస్తవికత
డాక్టర్ గుప్తా మాట్లాడుతూ... "సినిమాల్లో టీజీఏని తరచుగా అతిశయోక్తిగా, వైద్యపరంగా తప్పుగా చూపిస్తారు. వాస్తవానికి బాధితులు స్పృహలోనే ఉంటారు, వారి శారీరక వ్యవస్థలు సాధారణంగానే పనిచేస్తాయి. కేవలం జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్య మాత్రమే ఉంటుంది తప్ప, సినిమాలో చూపించినట్లు వ్యక్తి పూర్తిగా కుప్పకూలిపోరు" అని స్పష్టం చేశారు. టీజీఏ నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి శాశ్వత ప్రభావాలు ఉండవని, జ్ఞాపకశక్తి పూర్తిగా తిరిగి వస్తుందని ఆయన తెలిపారు. ఇక‌, 'ఏక్ దిన్' ప్రేమకథలో రోహన్, మీరాల మధ్య సంబంధం ఎలా మారుతుందో చూడాలంటే మే 1 వరకు వేచి చూడాల్సిందే.