కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే ఐపీఎల్‌లో ఒక అవాంఛిత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టోర్నీ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు నమోదైంది. 7 మ్యాచ్ లలో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న కేకేఆర్‌కు రహానే పేలవ ఫామ్ మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఇవాళ రాజస్థాన్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రహానే పెవిలియన్ చేరాడు. నాండ్రే బర్గర్ వేసిన బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించి, అదనపు బౌన్స్‌కు అంచనా వేయలేక వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న రహానే సున్నా పరుగులకే అవుటయ్యాడు. ఇది ఈ సీజన్‌లో అతనికి వరుసగా రెండో డకౌట్ కావడం గమనార్హం.

ఈ డకౌట్‌తో ఐపీఎల్‌లో ఓపెనర్‌గా రహానే డకౌట్ల సంఖ్య 12కు చేరింది. దీంతో 11 డకౌట్లతో అగ్రస్థానంలో ఉన్న పార్థివ్ పటేల్‌ను రహానే అధిగమించాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్, గౌతమ్ గంభీర్, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా రహానే వెనకే ఉన్నారు. ఈ సీజన్‌లో రహానే ఇప్పటివరకు 67, 8, 8*, 41, 28, 0, 0 స్కోర్లు నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్లు ఇద్దరూ (టిమ్ సీఫెర్ట్, రహానే) డకౌట్ కావడం జట్టు కష్టాలను రెట్టింపు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇది 13వ సారి మాత్రమే. 2014లో గౌతమ్ గంభీర్, జాక్వస్ కల్లిస్ తర్వాత కేకేఆర్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి. అంతకుముందు, బౌలింగ్‌లో రాణించిన కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (3/14), సునీల్ నరైన్ (2/26) దెబ్బకు రాజస్థాన్ 155/9 పరుగులకే పరిమితమైంది. అయితే, ఛేదనలో కేకేఆర్ ఆదిలోనే తడబడింది. చివరికి రింకూ సింగ్ అజేయ అర్ధసెంచరీ, అనుకూల్ రాయ్ కీలక ఇన్నింగ్స్ తో నేటి మ్యాచ్ లో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్ లో తొలి గెలుపు రుచిచూసింది.