ముంబైలోని వాంఖడే స్టేడియం ఎప్పుడూ క్రికెట్ హోరుతో మారుమోగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో స్టార్ క్రికెట‌ర్ల‌ ఆట చూసేందుకు అభిమానులు పోటెత్తుతారు. కానీ, బుధవారం రాత్రి జరిగిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో ఓ పాత తరం హీరో స్టేడియంలోకి అడుగుపెట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆయనే భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ.

ఒకప్పుడు తన భీక‌ర‌మైన‌ బ్యాటింగ్‌తో ఇదే మైదానాన్ని ఏలిన కాంబ్లీ, చాలా కాలం తర్వాత ఇక్కడ కనిపించడం ఒక భావోద్వేగ దృశ్యాన్ని ఆవిష్కరించింది. తెల్లటి చెక్స్ షర్ట్, బ్రౌన్ ప్యాంట్, స్పోర్ట్స్ షూస్‌తో సాధారణంగా కనిపించిన 54 ఏళ్ల కాంబ్లీ, ఆరోగ్య సమస్యల కారణంగా కొంత నీరసంగా కనిపించాడు. స్టేడియం లోపలికి నడిచి వచ్చేందుకు ఇద్దరు సహాయకుల తోడ్పాటు తీసుకోవలసి వచ్చింది. ఆయన శారీరకంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ, ముఖంలో మాత్రం మునుప‌టి ఉత్సాహం తగ్గలేదు.

పెవిలియన్ సమీపంలోని తన సీటు వైపు వెళ్తుండగా, కాంబ్లీని చూసిన అభిమానులు ఆప్యాయతను చూపించారు. ఆయన ఆటను చూస్తూ పెరిగిన చాలా మంది ఉద్వేగానికి లోనయ్యారు. స్టాండ్స్‌లో ఉన్న ఒక అభిమాని "గెట్ వెల్ సూన్, సర్" (త్వరగా కోలుకోండి సర్) అని గట్టిగా అరవగా, కాంబ్లీ అక్కడ ఆగాడు. అభిమాని వైపు చూసి, థంబ్సప్ చూపిస్తూ "థ్యాంక్యూ" అని బదులిచ్చాడు. ఈ చిన్న సంభాషణ అక్కడున్న వారిని ఎంతగానో కదిలించింది.

మైదానంలో మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్నప్పటికీ, చాలా మంది కళ్లకు కాంబ్లీ రాక ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచింది. శరీరం సహకరించకపోయినా, క్రికెట్‌పైనా, తనను ఆరాధించే అభిమానులపైనా ఆయనకున్న ప్రేమ చెక్కుచెదరలేదనడానికి ఈ సంఘటనే నిదర్శనంగా నిలిచింది. ఆయన రాకతో వాంఖడే స్టేడియంలో పాత జ్ఞాపకాలు మళ్లీ సజీవమైనట్లు అనిపించింది.