తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్యమైన ఫలితాలు వెలువడుతున్నాయి. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన నటుడు విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండగా, పార్టీ అధినేత విజయ్ మాత్రం తాను పోటీ చేస్తున్న తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఇది ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తొలి రౌండ్ల కౌంటింగ్, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి రాష్ట్రవ్యాప్తంగా టీవీకే సంచలనం సృష్టిస్తోంది. సుమారు 50కి పైగా స్థానాల్లో టీవీకే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అధికార డీఎంకేకు, టీవీకేకు మధ్య హోరాహోరీ పోరు నడుస్తుండగా, అన్నాడీఎంకే మూడో స్థానానికి పరిమితమైంది. దీంతో తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొన్నట్లు స్పష్టమవుతోంది.

మరోవైపు, ఈ ఎన్నికల ఫలితాలు డీఎంకేకు కూడా గట్టి షాక్ ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో వెనుకంజలో ఉండగా, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సైతం చేపాక్‌లో వెనుకబడ్డారు. చెన్నైలోని వేలచ్చేరిలో టీవీకే 3,826 పోస్టల్ ఓట్లతో ఆధిక్యంలో ఉంది.

అయితే, తిరుచ్చి ఈస్ట్‌లో విజయ్ వెనుకంజలో ఉన్నప్పటికీ, విజయ్ సన్నిహితుడు శ్రీనాథ్ తూత్తుకుడిలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇవి కేవలం ప్రారంభ ట్రెండ్స్ మాత్రమేనని, తుది ఫలితాలు వెలువడటానికి చాలా సమయం పడుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా, తొలి ఎన్నికల్లోనే విజయ్ పార్టీ సత్తా చాటడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.