తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు తీవ్ర ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ ఓటమి పాలవుతారన్న వదంతులు విని, ఆయన వీరాభిమాని ఒకరు ఆత్మహత్యకు యత్నించారు. కృష్ణగిరిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం కృష్ణగిరికి చెందిన కె. మహేంద్రన్ (28) టీవీకే పార్టీకి, విజయ్‌కు వీరాభిమాని. ఎన్నికల్లో విజయ్ ఓడిపోతారంటూ ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు కొన్ని వదంతులు వ్యాపించాయి. ఈ వార్తలను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన మహేంద్రన్, తన ఇంటి సమీపంలోనే గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, అతడిని రక్షించారు. హుటాహుటిన కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుప‌త్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నట్లు కృష్ణగిరి టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.