ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత దళపతి విజయ్ తన రాజకీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ఆయన, పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించి తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. పెరంబూరు, తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానాల నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

వివరాల్లోకి వెళితే, పెరంబూరు నియోజకవర్గంలో విజయ్ తన సమీప ప్రత్యర్థి, డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్‌పై ఏకంగా 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజయ్‌కు 1,20,365 ఓట్లు రాగా, శేఖర్‌కు కేవలం 66,650 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ పీఎంకే అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.

అదేవిధంగా, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గంలోనూ విజయ్ విజయ పరంపర కొనసాగించారు. ఇక్కడ డీఎంకే అభ్యర్థి ఎస్. ఇనిగో ఇరుదయరాజ్‌పై 27,416 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ స్థానంలో విజయ్‌కు 91,381 ఓట్లు, ఇరుదయరాజ్‌కు 63,965 ఓట్లు లభించాయి. అన్నాడీఎంకే అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ మేరకు తన విజయాలపై విజయ్ ఎన్నికల అధికారి నుంచి సర్టిఫికెట్లు అందుకున్నారు.

రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే రెండు చోట్ల గెలవడం ద్వారా, దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీలకు విజయ్ గట్టి పోటీ ఇవ్వనున్నారనే సంకేతాలు పంపారు.