ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ధర్మశాల వేదికగా మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (59*), యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (56) అర్ధశతకాలతో చెలరేగారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఆర్య కేవలం 33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పవర్‌ప్లేలో పంజాబ్ 72 పరుగులు రాబట్టింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కూపర్ కనోలీ (38)తో కలిసి స్కోరు బోర్డును నడిపించాడు.

ఆఖరి ఓవర్లలో శ్రేయస్ తన విశ్వరూపం చూపించాడు. కేవలం 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి సూర్యాంశ్ షెడ్గే (8 బంతుల్లో 21*) తోడవడంతో పంజాబ్ స్కోరు 200 దాటింది. ఢిల్లీ బౌలర్లలో మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లు తీసినప్పటికీ, భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.