అమెరికాలో లక్షలాది మంది తీవ్రమైన ఆర్థిక, మానసిక, వృత్తిపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒకే సమయంలో వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటూ, మరోవైపు పిల్లల ఆలనాపాలనలో మునిగిపోవడంతో వారి జీవితాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. 'శాండ్‌విచ్ జనరేషన్'గా పిలుస్తున్న ఈ వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల అమెరికా సెనేట్ కమిటీ ఆన్ ఏజింగ్ ప్రత్యేక విచారణ చేపట్టింది. వీరికి ఫెడరల్ ప్రభుత్వం నుంచి మరింత మద్దతు అవసరమని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.

సెనేట్ కమిటీ చైర్మన్ రిక్ స్కాట్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సుమారు 11 మిలియన్ల మంది అమెరికన్లు వృద్ధ తల్లిదండ్రులు, పిల్లల బాధ్యతలతో సతమతమవుతున్నారని తెలిపారు. వీరిలో ప్రతి ఐదుగురిలో ఒకరు తమ ఉద్యోగ వేళలు తగ్గించుకోవడం లేదా పూర్తిగా మానేయడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో వేతనం లేని ఈ సంరక్షణ విలువ ఏటా 600 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని ఆయన అంచనా వేశారు.

ఈ విచారణలో సెనేటర్ ఆండీ కిమ్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. తన తండ్రికి అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత తాను కూడా 'శాండ్‌విచ్ జనరేషన్'లో చేరానని, ప్రస్తుతం ఆయన బాగోగులు చూసుకోవడానికి ఒక కేర్‌గివర్‌ను నియమించాల్సి వస్తోందని వివరించారు.

ఫ్లోరిడాకు చెందిన మేగన్ మహేర్ అనే మహిళ మాట్లాడుతూ.. తన మొదటి బిడ్డ పుట్టిన కొన్ని వారాలకే తల్లికి క్యాన్సర్ అని తేలడంతో ఒకేసారి మాతృత్వం, కేర్‌గివర్ బాధ్యతలు మోయాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ బాధ్యతల కారణంగా తాను సంప్రదాయ ఉద్యోగాలు చేయలేక స్వయం ఉపాధిపై ఆధారపడాల్సి వచ్చిందని తెలిపారు.

కేర్‌గివర్స్‌కు పన్ను మినహాయింపులు, వేతనంతో కూడిన సెలవులు, వారి సేవలకు సోషల్ సెక్యూరిటీ క్రెడిట్లు వంటివి అందించే విధానాలపై దృష్టి పెట్టాలని నిపుణులు, బాధితులు కాంగ్రెస్‌ను కోరారు.