ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలు చేపట్టే అవకాశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తోసిపుచ్చలేదు. అవసరమైతే మరిన్ని దాడులు చేస్తామని సంకేతాలిచ్చారు. అయితే ఈ యుద్ధం వచ్చే కాంగ్రెస్‌ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి నష్టం కలిగించవచ్చని అంగీకరించారు.

ఇరాన్‌పై యుద్ధం ఎన్నికల ప్రచారాన్ని ఎలా ప్రభావితం చేస్తోందని విలేకరులు ప్రశ్నించగా ట్రంప్‌ స్పందించారు. ఈ విషయంలో అమెరికన్లలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. అయినా ఇరాన్‌ అణ్వాయుధాన్ని సంపాదించకుండా అడ్డుకోవడం ముఖ్యమని స్పష్టం చేశారు.

‘‘ఈ చర్యను కొందరు ఇష్టపడుతున్నారు. మరికొందరు వ్యతిరేకించవచ్చు. దీని వల్ల రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు. అయినా ఇరాన్‌ అణ్వాయుధాన్ని కలిగి ఉండటానికి అనుమతించలేం’’ అని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌పై ఇప్పటికే తీవ్రస్థాయిలో దాడులు చేశామని ట్రంప్‌ పేర్కొన్నారు. అవసరమైతే మరికొన్ని చర్యలు తీసుకోవచ్చని అన్నారు. అయితే కొత్తగా దాడులకు ఆదేశించారా? తదుపరి లక్ష్యాలేంటి? ఎప్పుడు చేపడతారు? అనే వివరాలను వెల్లడించలేదు. ఆయన వ్యాఖ్యలు మరిన్ని సైనిక చర్యలకు అవకాశం ఉందనే సంకేతాలుగానే నిలిచాయి.

రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయావకాశాలు తన మద్దతుదారులు ఎంతమంది ఓటు వేస్తారన్న దానిపై ఆధారపడి ఉంటాయని ట్రంప్‌ అన్నారు.

మరోవైపు, యుద్ధాల ప్రభావం పోరాటం జరుగుతున్న దేశాలకే పరిమితం కావడం లేదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. ఇంధన ధరలు, నౌకాయానం, సరఫరా వ్యవస్థలు, ఆర్థిక రంగాలపై ప్రభావం పడుతోందన్నారు. హర్మూజ్‌ జలసంధిలో పరిణామాలు సామాన్య కుటుంబాలపైనా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.

పోరాటాలకు ముగింపు పలకాలని, పౌరులను రక్షించాలని, దౌత్య చర్చలకు అవకాశం కల్పించాలని గుటెరస్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఈజిప్టులో పర్యటించనున్నట్లు తెలిపారు. అమెరికా-ఇరాన్‌ ఘర్షణలో ఈజిప్టు మధ్యవర్తిగా వ్యవహరిస్తోందని చెప్పారు. అయితే చర్చల్లో పురోగతి సాధించినట్లు వెల్లడించలేదు.