ప్రపంచ స్కాచ్ విస్కీ మార్కెట్‌లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పరిమాణం (వాల్యూమ్) పరంగా అగ్రస్థానంలో ఉన్న మన దేశం, త్వరలోనే విలువ (వాల్యూ) పరంగా కూడా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా అవతరించనుందని స్కాచ్ విస్కీ అసోసియేషన్ అంచనా వేసింది. 

ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాను కూడా భారత్ అధిగమించనుంది. భారత్-యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ), దేశంలో ప్రీమియం మద్యం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ ఈ మార్పునకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

తగ్గిన సుంకాలు.. పెరిగిన ఆశలు
భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జులై 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా స్కాచ్ విస్కీ దిగుమతులపై ఉన్న 150 శాతం కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏకంగా సగానికి, అంటే 75 శాతానికి తగ్గించింది. అంతేకాదు, రాబోయే పదేళ్లలో ఈ సుంకాన్ని దశలవారీగా 40 శాతానికి తగ్గించనున్నారు. 

ఈ నిర్ణయంతో స్కాచ్ విస్కీ సామాన్యులకు మరింత అందుబాటులోకి వస్తుందని, వినియోగదారులు ప్రీమియం ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీని ప్రభావం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కనిపిస్తోంది. కొన్ని బ్రాండ్ల ధరలు 6 నుంచి 15 శాతం వరకు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.

గణాంకాల ప్రకారం.. 2025లో భారత్‌కు స్కాచ్ విస్కీ ఎగుమతుల విలువ 286 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.3,614 కోట్లు)గా ఉంది. ఇది దాదాపు 220 మిలియన్ బాటిళ్లతో సమానం. ప్రస్తుతం విలువ పరంగా చూస్తే అమెరికా, ఫ్రాన్స్ తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా కొనసాగుతోంది. అయితే, తగ్గిన సుంకాలతో ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి.

దేశీయ కంపెనీల ఆందోళన.. వ్యూహరచన
అయితే, దిగుమతి సుంకాల తగ్గింపుపై 'భారత ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీల సమాఖ్య' (సీఐఏబీసీ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశీయ, విదేశీ ఉత్పత్తుల మధ్య సమానమైన పోటీ ఉండేలా పన్నుల విధానంలో సమానత్వం పాటించాలని డిమాండ్ చేస్తోంది. కేవలం దిగుమతి సుంకం తగ్గించినంత మాత్రాన తుది ధర పూర్తిగా తగ్గదని, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, పంపిణీ ఖర్చులు, రిటైలర్ల మార్జిన్‌లు కూడా తుది ధరను నిర్దేశిస్తాయని స్పష్టం చేసింది.

మరోవైపు విదేశీ స్కాచ్ నుంచి పోటీ పెరగడంతో దేశీయ తయారీదారులు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. దిగుమతి చేసుకున్న స్కాచ్‌తో పోటీ పడేందుకు వీలుగా డిస్టిలేషన్, మెచ్యూరేషన్, నాణ్యత వంటి అంశాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రీమియం సెగ్మెంట్‌లో తమదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. 

మొత్తం మీద ఈ కొత్త పరిణామాలతో భారత మద్యం మార్కెట్ రానున్న రోజుల్లో మరింత పోటీతత్వంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.