హైదరాబాద్‌లో పెరుగుతున్న నీటి అవసరాలు, తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు జలమండలి (హెచ్ఎండ‌బ్ల్యూఎస్ఎస్‌బీ) వినూత్న ప్రణాళికతో ముందుకొచ్చింది. ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. 

ఇందులో భాగంగా శుద్ధి చేసిన మురుగునీటిని (ట్రీటెడ్ వాటర్) నిర్మాణ పనులు, పారిశ్రామిక అవసరాలు, రోడ్ల శుభ్రత వంటి పనులకు అందించేందుకు ‘గ్రీన్ వాటర్’ సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

 దీనికోసం నగర శివారులోని కోకాపేటలో ప్రత్యేకంగా ఒక గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే, అత్యంత విలువైన తాగునీటిని ఇతర అవసరాలకు వాడటాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

ఈ ప్రణాళిక అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్‌రెడ్డి గురువారం కోకాపేటలో పర్యటించారు. అక్కడి నీటి నాణ్యత పరీక్షల ప్రయోగశాలను సందర్శించి, శుద్ధి చేసిన నీటి నాణ్యతను ఎలా పరీక్షిస్తున్నారు, ఏయే ప్రమాణాలు పాటిస్తున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలంటే నాణ్యత విషయంలో రాజీ పడరాదని, నిరంతర పర్యవేక్షణ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. జలమండలి అధికారులతో పాటు 'తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి' (టీజీఎస్‌పీసీబీ) అధికారులు సమన్వయంతో పనిచేసి, నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నీటి పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.

నీటి నాణ్యత పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఎండీ అశోక్‌రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల జలమండలి ప్రధాన కార్యాలయం నుంచే నీటి నాణ్యతను నేరుగా పర్యవేక్షించేందుకు వీలవుతుందని తెలిపారు. 

ఇందుకు అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఐటీ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ విధానం వల్ల పర్యవేక్షణలో పారదర్శకత పెరగడమే కాకుండా సరఫరా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించవచ్చని వివరించారు.

గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌లో ట్యాంకర్లకు నీటిని నింపే ప్రక్రియపైనా అశోక్‌రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. ప్రతి ట్యాంకర్ సామర్థ్యాన్ని బట్టి నీటిని నింపేందుకు పరిమితులు విధించాలని ఆదేశించారు. 

ఏ ట్యాంకర్‌కు ఎంత నీటిని సరఫరా చేశారనే వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, పరిమితికి మించి నీరు నింపకుండా ఆటోమేటిక్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపారు. ట్యాంకర్లు నిండిన తర్వాత అదనంగా మిగిలే నీరు వృథా కాకుండా, దాన్ని తిరిగి సమీపంలోని చెరువుకు మళ్లించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు.

ఈ గ్రీన్ వాటర్ అనేది తాగునీటికి ప్రత్యామ్నాయం కాదని, కేవలం తాగడానికి అవసరం లేని పనులకు మాత్రమే వినియోగించాలని జలమండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిర్మాణ రంగం, పరిశ్రమలు, రోడ్లపై దుమ్ము నియంత్రణ, పార్కులు, హరితహారం మొక్కల సంరక్షణ వంటి పనులకు ఈ నీటిని ఉపయోగించేలా ప్రజలను, సంస్థలను ప్రోత్సహించనున్నారు. 

ప్రస్తుతం కోకాపేటలో ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటుపై సాంకేతిక పరిశీలన జరుగుతోందని, త్వరలోనే దీని ఏర్పాటు, సరఫరా సామర్థ్యం వంటి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.