తెలంగాణలో పాత వాహనాలను వినియోగిస్తున్న యజమానులకు రాష్ట్ర రవాణా శాఖ కీలక సూచనలు చేసింది. రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన వాహనాలు రోడ్లపై చట్టబద్ధంగా తిరగాలంటే తప్పనిసరిగా గ్రీన్ ట్యాక్స్ చెల్లించి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ) పునరుద్ధరించుకోవాలని స్పష్టం చేసింది. సాధారణంగా ప్రైవేట్ వాహనాలకు తొలి 15 ఏళ్ల వరకు, వాణిజ్య వాహనాలకు 7 ఏళ్ల వరకు ఆర్‌సీ చెల్లుబాటు ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి దానిని పునరుద్ధరించుకోవడం తప్పనిసరి.

ఆర్‌సీ గడువు ముగిసిన వాహనాలకు ఇన్సూరెన్స్ వర్తించదు. అంతేకాకుండా, అటువంటి వాహనాలను విక్రయించడం లేదా ఇతర వ్యక్తుల పేరు మీదకు బదిలీ చేయడం సాధ్యపడదు. చట్టప్రకారం గడువు తీరిన వాహనాలను రోడ్లపై నడపడం నిబంధనలకు విరుద్ధం. కాబట్టి, యజమానులు ముందుగా గ్రీన్ ట్యాక్స్ చెల్లించి, వాహన ఫిట్‌నెస్‌ను తనిఖీ చేయించుకున్న తర్వాతే ఆర్‌సీ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వాహన యజమానులు రవాణా శాఖ అధికారిక పోర్టల్ ద్వారా లేదా మొబైల్‌కు వచ్చే ఎస్ఎంఎస్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో గ్రీన్ ట్యాక్స్ చెల్లించవచ్చు. ఇందుకోసం వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్‌లోని చివరి ఐదు అంకెలు, యజమాని వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యాక రసీదును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫీజుల వివరాలు ఇలా..

వాహనం వయసును బట్టి గ్రీన్ ట్యాక్స్, రెన్యువల్ ఫీజు, సర్వీస్ ఛార్జీలు, స్మార్ట్ కార్డ్ ఫీజులు కలిపి ఈ ఖర్చు ఉంటుంది.
15 ఏళ్లకు పైబడి 20 ఏళ్ల లోపు ద్విచక్ర వాహనానికి సుమారు రూ. 3,400, కారుకు రూ. 10,600 వరకు ఖర్చవుతుంది.
అదేవిధంగా 20 ఏళ్లు దాటిన బైక్‌కు రూ. 6,400, కారుకు రూ. 15,600 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

ఆర్‌సీ రెన్యువల్ కోసం ఫారం-25, ఒరిజినల్ ఆర్‌సీ పత్రం, చెల్లుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికేట్, ట్యాక్స్ చెల్లింపు రసీదులను సమర్పించాలి. అనంతరం రిజిస్ట్రేషన్ అథారిటీ కేటాయించిన తేదీన వాహనాన్ని భౌతిక తనిఖీ నిమిత్తం సంబంధిత కార్యాలయానికి తీసుకువెళ్లాలి.

అయితే, ఎల్పీజీ, సీఎన్‌జీ లేదా బ్యాటరీతో నడిచే వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. కానీ, ఆర్‌సీ పునరుద్ధరణకు సంబంధించి స్మార్ట్ కార్డ్ ఫీజును మాత్రం తప్పనిసరిగా చెల్లించాలి. ఇవి కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలేమీ కాదని, ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనలనే యజమానులకు గుర్తు చేస్తున్నట్లు రవాణా శాఖ తన నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్రంలో అత్యాధునిక ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.