బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన రాజకీయం ప్రకంపనలు సృష్టిస్తోంది. జైలు నుంచే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ దాడికి బాధ్యత వహించడంపై ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే తీవ్ర విస్మయం, ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైల్లో ఉంటూ దాడులకు ప్రణాళికలు రచించడం, సోషల్ మీడియా వేదికగా బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించడం ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. ఈ ఉదంతంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.

గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, "లారెన్స్ బిష్ణోయ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడని వార్తా సంస్థలు చెబుతున్నాయి. కానీ, 'ఈ దాడికి నేనే బాధ్యుడిని' అంటూ అతడు స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నాడు. జైల్లో ఉన్న వ్యక్తి ఇలా నేరాలకు బాధ్యత వహించడం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ వ్యవహారం ఎంతో గందరగోళానికి గురిచేస్తోంది. ప్రజలను ఇలా భయబ్రాంతులకు గురిచేయడం సరికాదు. జైల్లో ఉండి ఇవన్నీ ఎలా నిర్వహించగలుగుతున్నాడనే అంశంపై విచారణ జరపాలని మేము కోరుతున్నాం" అని స్పష్టం చేశారు.

ఈ నెల 18న ముంబైలోని జుహూ ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కాల్పులు జరిగిన కొన్ని గంటల్లోనే, సల్మాన్ ఖాన్‌తో కలిసి పని చేయవద్దని టైగర్‌కు హెచ్చరిక జారీ చేస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ ముఠా ప్రకటించింది. కాగా, ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని పోలీసులు రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు.

తాజాగా ఈ కేసులో రాధ, బబిత, కునాల్, సుమిత్ అనే మరో నలుగురిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. 

పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు తొలుత మరో బాలీవుడ్ సెలబ్రిటీని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. అయితే, ఆ సెలబ్రిటీని చేరుకోవడం కష్టతరమవ్వడంతో టైగర్ ష్రాఫ్‌ను టార్గెట్ చేశారు. టైగర్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వీడియోల (రీల్స్) ద్వారా అతడికి పోలీస్ భద్రత లేదని నిర్ధారించుకుని ఈ దాడికి పాల్పడినట్లు తేలింది.