ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మరోసారి యువత సంబంధాలు, వివాహ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. గర్ల్‌ఫ్రెండ్‌తో పిల్లల్ని కని ఆ తర్వాత వారిని వదిలేయవద్దని యువకులకు ఆమె హితవు పలికారు. లక్నోలోని మహర్షి యూనివర్సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. యువత మొదట ఆర్థికంగా నిలదొక్కుకుని, తాము ఏర్పరచుకున్న సంబంధాలకు బాధ్యత వహించాలని సూచించారు.

"గర్ల్‌ఫ్రెండ్‌ను చేసుకోవడంలో తప్పు లేదు. ఒకవేళ గర్ల్‌ఫ్రెండ్‌ను చేసుకుంటే, పెళ్లి కూడా చేసుకోండి. ఒక అమ్మాయిని తల్లిని చేశాక వదిలేయడం చాలా తప్పు. యువకులారా, ముందుగా మీరు స్వయం సమృద్ధి సాధించండి" అని ఆనందీబెన్ పటేల్ స్పష్టం చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి.

ఆనందీబెన్ పటేల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఆమె సహజీవన సంబంధాలు, సమాజంలో మహిళల పాత్రపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గత ఏడాది అక్టోబర్ లో బలియా, వారణాసిలోని విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాల్లో మాట్లాడుతూ సహజీవన సంబంధాలపై యువతులకు హెచ్చరికలు జారీ చేశారు. 

సహజీవనం వల్ల కలిగే పరిణామాలను చూడాలంటే అనాథ శరణాలయాలను సందర్శించాలని, అక్కడ పిల్లలతో ఒంటరిగా ఉన్న యువతులు కనిపిస్తారని బలియాలో వ్యాఖ్యానించారు.

ఆ మరుసటి రోజే వారణాసిలో మాట్లాడుతూ.. యువతులు సహజీవనానికి దూరంగా ఉండాలని, లేకపోతే '50 ముక్కలుగా నరికివేయబడటం' వంటి హింసాత్మక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి.

అంతేగాక ఈ ఏడాది జులైలో కాన్పూర్‌లోని ఓ స్నాతకోత్సవంలో మహిళలు ఐఏఎస్ అధికారులుగా లేదా ఉపాధ్యాయులుగా మారడానికి ముందు 'నిపుణులైన తల్లులు'గా మారాలని సూచించారు. మహిళలు వంట నేర్చుకోవడం, వృత్తి జీవితాన్ని కుటుంబ బాధ్యతలతో సమన్వయం చేసుకోవడం గురించి కూడా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు కూడా అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.

తాజా వ్యాఖ్యలతో ఆనందీబెన్ పటేల్ మరోసారి వార్తల్లో నిలిచారు. మహిళల భద్రత, సామాజిక బాధ్యత కోణంలోనే తాను ఈ సూచనలు చేస్తున్నానని ఆమె చెబుతున్నప్పటికీ, ఆమె అభిప్రాయాలు తరచుగా లింగ సమానత్వం, ఆధునిక సమాజంలో యువతులు తమ జీవితంపై తీసుకునే నిర్ణయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలపై విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.