భారత ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి.. ఆ సంఘంలోని సీనియర్‌ అధికారి మనీష్‌ గార్గ్‌పై కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. 2026 జులై 29న రాసిన ఈ లేఖలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద విడుదల చేసిన పత్రాలు బయటపెట్టాయి.

విధుల కేటాయింపుపై అభ్యంతరం
ఎన్నికల సంఘంలోని సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌ మనీష్‌ గార్గ్‌.. ఉన్నతాధికారుల మధ్య విధుల కేటాయింపును మార్చుతూ జులై 28న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సంధు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంతో గానీ, సంబంధిత అధికారులతో గానీ ముందుగా చర్చించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తనకు, తనకంటే సీనియర్‌ లేదా సమాన స్థాయి అధికారులకు కేటాయించిన పనుల్లోనూ మార్పులు చేశారని పేర్కొన్నారు.

ఫైలు ఇవ్వలేదన్న మరో కమిషనర్‌
వివేక్‌ జోషి కూడా ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. విధుల కేటాయింపులో మార్పులు చేసే ముందు ఎన్నికల సంఘంతో చర్చించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైలును అడిగినా పరిపాలనా విభాగం తనకు అందించలేదని లేఖలో పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఇద్దరు కమిషనర్లు గుర్తుచేశారు. ఈ చర్యలు 2023 నాటి చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జోక్యం చేసుకోవడంపై కేంద్రం జాగ్రత్త
ఈ లేఖలపై కేబినెట్‌ సెక్రటేరియట్‌ అధికారులు అంతర్గతంగా చర్చించారు. ఇద్దరు కమిషనర్లు వ్యక్తిగత హోదాలో లేఖలు రాసినందున, వాటిని ఎన్నికల సంఘం అధికారిక ఫిర్యాదుగా పరిగణించలేమని ఫైలు నోట్‌లో పేర్కొన్నారు. ఈ దశలో జోక్యం చేసుకుంటే రాజ్యాంగబద్ధ సంస్థ స్వతంత్ర పనితీరులో జోక్యం చేసుకున్నట్లవుతుందని అభిప్రాయపడ్డారు.

ఆగస్టు 5న కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ ఇద్దరు కమిషనర్ల లేఖలు అందినట్లు ధ్రువీకరించారు. సంబంధిత అధికారులకు వాటి ప్రతులను పంపించారు. అయితే ఈ ఫిర్యాదులపై తదుపరి విచారణ జరిగిందా? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే విషయాలు ఆర్టీఐ ద్వారా వెల్లడైన పత్రాల్లో స్పష్టంగా లేవు.

సెప్టెంబరు 24న మాజీ నౌకాదళ అధికారి కమోడోర్‌ లోకేశ్‌ కె.బాత్రా దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.