ఉత్తరాఖండ్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన నవవధువు, తన పెళ్లి రోజునే రోడ్డు సౌకర్యం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లేందుకు ఏకంగా 18 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి, తన కష్టాన్ని వీడియో ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఘటన చక్రాటా ప్రాంతంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. డెహ్రాడూన్ సమీపంలోని బులహర్ గ్రామానికి చెందిన షర్మిలకు, ఉండవా అనే మారుమూల గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి ఊరేగింపుతో అత్తవారింటికి బయలుదేరిన ఆమె ప్రయాణం, లోఖండి ప్రాంతం వద్ద ఆగిపోయింది. అక్కడి నుంచి ఉండవా గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఆమె తన ప్రయాణాన్ని కాలినడకన కొనసాగించాల్సి వచ్చింది.

బరువైన పెళ్లి లెహంగా ధరించి, కఠినమైన, ఎగుడుదిగుడు దారిలో ఆమె నడుస్తున్న దృశ్యాలను గ్రామస్థులు వీడియో తీశారు. అత్తవారింటికి సమయానికి చేరుకోవాలనే ఆత్రుతతో ఆమె వేగంగా నడిచారు. ఈ ప్రయాణం మధ్యలోనే ఆమె, తన ఆవేదనను వీడియో ద్వారా నేరుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి విన్నవించుకుంది. 

"నేను లోఖండి నుంచి ఉండవా గ్రామానికి నడిచి వెళుతున్నాను, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఎవరికీ రాకుండా దయచేసి మా గ్రామానికి ఒక రోడ్డు నిర్మించండి" అని ఆమె వేడుకుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మారుమూల గ్రామాల్లోని రహదారుల సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఉండవా వంటి గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రోడ్లు లేకపోవడంతో వృద్ధులు, రోగులు, గర్భిణులు అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రులకు చేరుకోవడం అత్యంత కష్టంగా మారింది. గతంలో హండి కండి వంటి గ్రామాల్లో కూడా ఇలాంటి సమస్యల వల్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్థానికులు గుర్తు చేస్తున్నారు.