గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు మంట సాధారణంగా నీలం రంగులో కనిపిస్తుంది. అయితే, మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తుంటే అప్రమత్తంగా ఉండాలి. గ్యాస్ పూర్తిగా మండకపోవడం, బర్నర్‌ రంధ్రాలు మూసుకుపోవడం లేదా రెగ్యులేటర్‌లో సమస్యలు ఉండటం ఇందుకు కారణాలు కావచ్చు. ఈ మార్పును నిర్లక్ష్యం చేస్తే వంట సామర్థ్యం తగ్గడంతోపాటు భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

చాలామంది స్టవ్‌ వెలుగుతూ, వంట సరిగా అవుతున్నంత కాలం దాని పరిస్థితిని పట్టించుకోరు. కానీ మంట రంగు గ్యాస్‌ ఎంత సమర్థంగా మండుతోందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా మంట నీలం రంగులో ఉండటం గ్యాస్‌ సమర్థంగా మండుతున్నదానికి సూచన. పసుపు లేదా నారింజ రంగులో మంట కనిపిస్తే గ్యాస్‌, గాలి సరైన నిష్పత్తిలో కలవకపోవడం లేదా బర్నర్‌లో మురికి పేరుకుపోవడం వంటి సమస్యలు ఉండవచ్చు. అయితే, మంట రంగు ఒక్కటే సమస్యను నిర్ధారించదు.

పసుపు మంటకు కారణాలివే..
బర్నర్‌ రంధ్రాల్లో ఆహార పదార్థాల అవశేషాలు, దుమ్ము పేరుకుపోవడం వల్ల గాలి ప్రవాహానికి ఆటంకం ఏర్పడవచ్చు. దీంతో గ్యాస్‌ సరిగా మండక మంట రంగు మారవచ్చు. గ్యాస్‌ సరఫరా వ్యవస్థ లేదా రెగ్యులేటర్‌లో సమస్య ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. మంటతో పాటు పాత్రల అడుగు భాగంలో నల్లటి మసి పేరుకుపోతున్నా దాన్ని గమనించాలి. గ్యాస్‌ పూర్తిగా మండకపోతే కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి ప్రమాదకర వాయువులు ఉత్పత్తయ్యే అవకాశం ఉంది. ఈ వాయువుకు రంగు, వాసన ఉండవు. అధిక మోతాదులో పీల్చితే ప్రాణాపాయం కలగవచ్చు.

ఏం చేయాలి?
మంట పసుపు రంగులో కనిపిస్తే స్టవ్‌ను నిర్లక్ష్యంగా ఉపయోగించడం కొనసాగించకూడదు. స్టవ్‌ను ఆపి, చల్లారిన తర్వాత బర్నర్‌ను శుభ్రం చేయాలి. సమస్య కొనసాగితే గ్యాస్‌ స్టవ్ టెక్నీషియన్‌తో తనిఖీ చేయించాలి. గ్యాస్‌ వాసన వస్తే విద్యుత్‌ స్విచ్‌లను ఆన్‌ లేదా ఆఫ్‌ చేయకుండా, సురక్షితంగా బయటకు వెళ్లి గ్యాస్‌ సరఫరాదారుని సంప్రదించాలి.