అమెరికాలో యువత నికోటిన్ వాడకంలో ఒక కొత్త, ఆందోళనకరమైన ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు అబ్బాయిలే ఎక్కువగా వాడే వేపింగ్ (ఈ-సిగరెట్లు), ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తోంది. మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా (ఎంయూఎస్‌సీ) నిర్వహించిన ఒక తాజా అధ్యయనం, నికోటిన్ వినియోగంలో దశాబ్దాలుగా ఉన్న ధూమపాన అలవాట్ల సరళిని పూర్తిగా తారుమారు చేసిందని స్పష్టం చేస్తోంది. ఈ పరిశోధన వివరాలను ప్రముఖ జర్నల్ 'జేఏఎంఏ పీడియాట్రిక్స్‌'లో ప్రచురించారు.

2014 నుంచి 2024 మధ్య కాలంలో అమెరికాలో 12 నుంచి 17 ఏళ్ల వయసు గల టీనేజర్లపై జరిపిన 'పాపులేషన్ అసెస్‌మెంట్ ఆఫ్ టొబాకో అండ్ హెల్త్' (పీఏటీహెచ్‌) స్టడీ డేటాను పరిశోధకులు విశ్లేషించారు. అప్పుడప్పుడు కాకుండా రోజూ లేదా తరచుగా వేపింగ్ చేసే వారిపై ఈ అధ్యయనం దృష్టి సారించింది. ఈ విశ్లేషణలో 2021 నుంచి అమ్మాయిలు ఈ విషయంలో అబ్బాయిలను అధిగమించడం ప్రారంభించారని తేలింది. ముఖ్యంగా పెద్ద వయసు టీనేజర్లలో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది.

గణాంకాల ప్రకారం, 15 నుంచి 17 ఏళ్ల వయసున్న అమ్మాయిల్లో 2021లో 4.9 శాతంగా ఉన్న రెగ్యులర్ వేపింగ్ వాడకం, 2024 నాటికి 7.8 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఇదే వయసున్న అబ్బాయిల్లో ఈ వాడకం 2024లో కేవలం 4.6 శాతంగానే నమోదైంది. 12 నుంచి 14 ఏళ్ల వయసు వారిలో ఈ సంఖ్యలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, 2021 తర్వాత అమ్మాయిల్లోనే వేపింగ్ వాడకం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

సాధారణంగా గతంలో నికోటిన్ సంబంధిత ఉత్పత్తులను అబ్బాయిలు, పురుషులే అధికంగా వాడేవారు. అయితే, 2018-19 సంవత్సరాల్లో వివిధ ఫ్లేవర్లతో, సులభంగా వాడగలిగే పాడ్-ఆధారిత పరికరాలు రావడంతో యువతలో వేపింగ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ పరిణామం అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించగా, ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా రివర్స్ కావడం గమనార్హం.

ఈ అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యువతలో సంప్రదాయ సిగరెట్ల వాడకం గణనీయంగా పడిపోయింది. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరిలోనూ ఇది 0.5% కంటే తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. అయితే, యువతలో వేపింగ్ సమస్య ఇంకా తీవ్రంగానే ఉందని, దీన్ని అరికట్టేందుకు ప్రత్యేకమైన నివారణా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎంయూఎస్‌సీ హెల్త్ టొబాకో ట్రీట్‌మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ బెంజమిన్ టోల్ హెచ్చరించారు. ఈ కొత్త ట్రెండ్, ప్రజారోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.