ఆరు నెలలుగా ప్రజల మధ్యకు రాకుండా అజ్ఞాతంలో ఉన్న ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న వదంతుల పట్ల ఆ దేశం వివరణ ఇచ్చింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, దేశ పాలనా వ్యవహారాలను చురుగ్గా పర్యవేక్షిస్తున్నారని ఇరాన్ సీనియర్ దౌత్యవేత్త అబ్దుల్ మజీద్ హకీమ్ ఎలాహి స్పష్టం చేశారు. గడిచిన వారంలోనే దేశాధ్యక్షుడితో మొజ్తబా ఏకంగా ఏడు గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారని 'ఎన్డీటీవీ'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

దాదాపు ఎనిమిది నెలల క్రితం ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ దాడిలోనే ఫిబ్రవరి 28న అప్పటి సుప్రీం లీడర్, మొజ్తబా తండ్రి అయిన అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ దాడిలో మొజ్తబా కూడా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. 

తండ్రి మరణానంతరం అత్యున్నత నేతగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఆయన ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. కేవలం రాతపూర్వక ప్రకటనల ద్వారానే సందేశాలు ఇస్తున్నారు. జులైలో జరిగిన తండ్రి అంత్యక్రియలకు కూడా ఆయన గైర్హాజరు కావడం, ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలకు, భద్రతాపరమైన భయాలకు దారితీసింది.

ఈ నేపథ్యంలో అబ్దుల్ మజీద్ ఎలాహి వివరణ ఇస్తూ.. "సుప్రీం లీడర్ మొజ్తబా ఖొమేనీ చాలా మంచి ఆరోగ్యంతో ఉన్నారు. తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. గతనెలలో అధ్యక్షుడితో 7 గంటల పాటు భేటీ అయ్యారు. రేపు మా పార్లమెంట్ స్పీకర్ కూడా ఆయన్ను కలవనున్నారు. నేను కలిసిన నా స్నేహితులు కూడా ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారని, పనులన్నీ చక్కగా చేసుకుంటున్నారని నాతో చెప్పారు" అని తెలిపారు.

తండ్రి అంత్యక్రియలకు మొజ్తబా రాలేదన్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. "భద్రతా కారణాల దృష్ట్యా ఆయన మీడియా ముందుకు రావడం లేదు. అందుకే ఎవరూ ఆయన్ను చూడలేదు. కానీ, ఆయన తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో నేను ఇరాన్‌లోనే ఉన్నాను. ఆయన సోదరులిద్దరినీ కలిశాను. మొజ్తబా కూడా అక్కడే ఉన్నారు. కొన్నిసార్లు ఆయన రాత్రిపూట వీధుల్లోకి కూడా వస్తారు. ప్రజల ప్రదర్శనల్లో పాల్గొంటారు" అని ఎలాహి వివరించారు.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌ను ప్రస్తుతం ఎవరు నడిపిస్తున్నారో ఎవరికీ తెలియడం లేదంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ కు నేతలు లేకుండా పోయారని, దేశాన్ని ఎవరు పాలిస్తున్నారనేది తమకు పెద్ద సమస్యగా మారిందని ఆయన అన్నారు. 

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీలతో తాము మాట్లాడుతున్నామని, కానీ దేశంలో వారికి ఎంత అధికారం ఉందో స్పష్టత లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. ఇరాన్‌లో నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉందో, తమ ప్రతినిధులు ఎవరో అమెరికా అధికారులకు బాగా తెలుసని స్పష్టం చేసింది.