ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జీవిగా పేరుగాంచిన 'ఫిన్ వేల్' తిమింగలం ఆహారం స్వీకరిస్తున్న అద్భుత దృశ్యం ఒకటి కెమెరాకు చిక్కింది. వేల్స్ తీరంలో ఒక జాలరి తన డ్రోన్‌తో ఈ అరుదైన వీడియోను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వేల్స్‌లోని పెంబ్రోక్‌షైర్ తీరానికి సమీపంలో గల సెల్టిక్ సముద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రిస్ మోర్గాన్ అనే స్థానిక జాలరి.. తన స్నేహితుడితో కలిసి చేపల వేటకు వెళ్లారు. ఆ సమయంలో సముద్రంలో భారీ తిమింగలం కదలికలను గమనించారు. వెంటనే తన పడవలో ఉన్న డ్రోన్‌ను గాల్లోకి పంపి దానిని చిత్రీకరించారు. ఆ తిమింగలం తన భారీ నోరు తెరిచి, ఒకేసారి వేలాది గ్యాలన్ల నీటిని, క్రిల్ (చిన్న సముద్ర జీవులు)ను లోపలికి తీసుకుంటున్న దృశ్యం ఆ వీడియోలో రికార్డ్ అయ్యింది.

ఈ ఘటన గురించి మోర్గాన్ మాట్లాడుతూ "ఇది పూర్తిగా అదృష్టవశాత్తూ సాధ్యమైంది. పడవ వెనుక నుంచి డ్రోన్‌ను పంపి చూశాం. ఆ దృశ్యం చూడగానే మేమంతా ఎంతో ఉత్సాహానికి లోనయ్యాం" అని తెలిపారు. ఫిన్ వేల్స్ సాధారణంగా 24 మీటర్ల (సుమారు 78 అడుగులు) పొడవు వరకు పెరిగి 70-77 టన్నుల బరువు ఉంటాయి.

సముద్ర జీవుల నిపుణులు ఈ దృశ్యం చాలా అరుదైనదని అభిప్రాయపడుతున్నారు. బంగోర్ యూనివర్సిటీకి చెందిన సముద్ర జీవశాస్త్ర నిపుణురాలు డాక్టర్ మరియాన్నా చిమియెంటి మాట్లాడుతూ "ఫిన్ వేల్స్ సాధారణంగా చల్లని, లోతైన సముద్ర జలాల్లో ఉంటాయి. అవి తీరానికి ఇంత దగ్గరగా వచ్చి ఆహారం తీసుకోవడం చాలా అరుదైన విషయం" అని వివరించారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో తిమింగలాల వేట, వాటి సంరక్షణ ఆవశ్యకతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. తన వీడియో ఇంత పెద్ద స్థాయిలో అవగాహన కల్పిస్తుందని ఊహించలేదని, అయితే దీనిపై సంతోషంగా ఉందని మోర్గాన్ పేర్కొన్నారు.