అమెరికా, పాకిస్థాన్‌ మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్న వేళ భారత్‌కు అగ్రరాజ్యం భరోసా ఇచ్చింది. ఇతర దేశాలతో తమ సంబంధాల వల్ల భారత్‌తో బంధానికి ఎలాంటి నష్టం జరగదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం, పరస్పర సహకారానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్‌తో సంబంధాలు అవసరమేనని రూబియో అన్నారు. ఆ దేశంతో తమకున్న సంబంధాలను సానుకూలంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. భారత్‌ను ఆందోళనకు గురిచేసే చర్యలను పాకిస్థాన్‌ నిరుత్సాహపరిచేలా తమ ప్రభావాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. తద్వారా ప్రాంతీయ ఘర్షణలు తలెత్తకుండా చూడవచ్చని అభిప్రాయపడ్డారు.

భారత్‌తో వాణిజ్య ఒప్పందం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితులను 1970ల నాటి అమెరికా విదేశాంగ విధానంతో పోల్చడం సరికాదని రూబియో అన్నారు. అప్పట్లో ప్రచ్ఛన్న యుద్ధం సహా అనేక పరిణామాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ హయాంలో పాకిస్థాన్‌ సైనిక పాలకులకు వాషింగ్టన్‌ మద్దతుగా నిలిచింది.

రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న రూబియో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపైనా స్పందించారు. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి పరిష్కారం కనుగొనడం అంత సులువు కాదని అన్నారు. సమస్యను పరిష్కరించడం తేలికై ఉంటే ఇప్పటికే యుద్ధం ముగిసిపోయేదని వ్యాఖ్యానించారు.