పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శుక్రవారం (అక్టోబర్ 23) 47వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ అభిమానులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ కోలాహలం మొదలైంది. అదే సమయంలో జపాన్‌లోని అభిమానులు కూడా ప్రత్యేకంగా వేడుకలు జరిపి తమ ప్రేమను చాటుకున్నారు.

అర్ధరాత్రి 12 గంటలు కాగానే, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ప్రభాస్ ఇంటి ముందు పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ప్రభాస్ ఫొటోలతో ఉన్న జెండాలు, పోస్టర్లతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. కొందరు అభిమానులు లారీపై నిలబడి జెండాలు ఊపుతూ, కేకలు వేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో అభిమానులు టపాసులు కాలుస్తూ, బైక్ ఇంజిన్లను రయ్ మనిపిస్తూ వినూత్నంగా తమ అభిమానాన్ని ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి వేడుకలే జరిగాయి.

ప్రభాస్ క్రేజ్ కేవలం దేశానికే పరిమితం కాలేదని జపాన్‌లో జరిగిన వేడుకలు నిరూపించాయి. అక్కడి అభిమానులు ఒకచోట చేరి ఆయన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. నలుపు, బంగారు వర్ణం దుస్తులు ధరించి, కేక్ కట్ చేసి, బెలూన్లు, స్ట్రీమర్లతో అలంకరించిన గదిలో సంబరాలు చేసుకున్నారు. ప్రభాస్ సినిమాలకు సంబంధించిన టీ-షర్టులు ధరించి పుట్టినరోజు పాట పాడారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ సందర్భంగా వారు ప్రభాస్‌కు ఒక ప్రత్యేక సందేశాన్ని పంపారు. "హ్యాపీ బర్త్‌డే ప్రభాస్ గారు. గతేడాది మీరు జపాన్ రావడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. దయచేసి మళ్లీ జపాన్‌కు రండి. మీ కొత్త సినిమా విడుదలైనప్పుడు దాన్ని చూడటానికి మేము భారత్‌కు రావాలనుకుంటున్నాం" అని వారు తమ ప్రేమను వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే.. ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రాల నిర్మాతలు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా దేశవిదేశాల్లో అభిమానులు జరుపుతున్న ఈ వేడుకలు ప్రభాస్‌కు ఉన్న గ్లోబల్ స్టార్‌డమ్‌కు నిదర్శనంగా నిలుస్తున్నాయి.