‘కల్కి 2898 ఏడీ’లో భైరవగా ప్రేక్షకులను అలరించిన ప్రభాస్‌.. ఇప్పుడు సీక్వెల్‌లోనూ అదే పాత్రలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ‘కల్కి 2’ షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నాడు. ప్రభాస్‌ భైరవగా తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టడంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక తెరవెనుక వీడియోను విడుదల చేశారు. ఇందులో భైరవగా ప్రభాస్‌ కనిపించడంతో పాటు, సినిమా కోసం రూపొందిస్తున్న భారీ సెట్‌ కూడా చూపించారు. సీక్వెల్‌పై ఈ వీడియో అంచనాలను మరింత పెంచుతోంది.

‘కల్కి 2898 ఏడీ’లో తన స్టైల్‌, హాస్యంతో కూడిన డైలాగులు, నటనతో భైరవ పాత్రకు ప్రభాస్‌ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు. ఇప్పుడు సీక్వెల్‌లోనూ ఆ పాత్రను కొనసాగిస్తూ.. కల్కి ఆగమనానికి సంబంధించిన తన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌ సుప్రీమ్‌ యాస్కిన్‌గా తిరిగి కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారతీయ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయి విజువల్స్‌ను చూపించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.