టాలీవుడ్‌ యువ హీరో తేజ సజ్జా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తన వివాహం జరగనున్నట్లు వెల్లడించాడు. నవంబర్‌లో నిశ్చితార్థం నిర్వహించి, ఆ తర్వాతి నెలలో పెళ్లి వేడుక జరగనుంది. తనది పెద్దలు కుదిర్చిన వివాహమని, తల్లిదండ్రులే సంబంధం ఖరారు చేశారని తేజ తెలిపాడు.

తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచే తేజ.. పెళ్లి వేడుకను కూడా నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఉదయ్‌పూర్‌లో వివాహం అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు.

తనకు కాబోయే భార్య కుటుంబానికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధాలు లేవని తేజ వెల్లడించాడు. వారు టెక్నాలజీ రంగంలో ఉన్నారని, ఆమె ప్రస్తుతం తన తండ్రితో కలిసి పనిచేస్తోందని చెప్పాడు. అమెరికాలో పెరిగిన ఆమెకు సినీ ప్రముఖుల ప్రపంచం, ప్రచార హడావుడి గురించి పెద్దగా పరిచయం లేదని తెలిపాడు. ఆ విషయం తనకు బాగా నచ్చిందని, పెళ్లి తర్వాత కూడా ఆమె వ్యక్తిగత జీవితానికి గోప్యత ఉండేలా చూసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

తనకు కాబోయే భార్య వివరాలను మాత్రం తేజ వెల్లడించలేదు. ఆమె వ్యక్తిగత గోప్యతను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘హనుమాన్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. ఆ తర్వాత ‘మిరాయ్‌’తోనూ ప్రేక్షకులను అలరించాడు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రం కెరీర్‌కు దూరంగా ఉంచుతున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘ది ట్రైటర్స్‌ తెలుగు’ తొలి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.