ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి కెనడాలోని బ్యాంకులను మోసం చేసిన అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టురట్టయింది. కెనడాలో నివసిస్తున్న నలుగురు భారతీయులు, పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు కలిసి ఈ భారీ మోసానికి పాల్పడినట్లు పాకిస్థాన్ జాతీయ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌సీసీఐఏ) వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి లాహోర్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అక్టోబర్ 19న ప్రకటించింది.

మోసం చేసిందిలా..
ఈ ముఠా పనితీరు చాలా పకడ్బందీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కెనడాలోని దీప్‌సింగ్, పర్జీత్‌సింగ్, హర్‌ప్రీత్‌సింగ్, గుర్లీన్‌సింగ్ అనే నలుగురు భారతీయులు ఏఐ టూల్స్ ఉపయోగించి నకిలీ కెనడా పాస్‌పోర్టులు, ఫొటోలు తయారుచేసేవారు. వాటిని పాకిస్థాన్‌లోని తమ సహచరులైన సుభాన్ బట్, గుల్రేజ్ బట్, మహ్మద్ నోమన్‌లకు పంపేవారు. పాక్‌లోని నిందితులు ఆ నకిలీ పత్రాలకు అసలైన గుర్తింపు సంఖ్యలు, పుట్టిన తేదీల వంటి వివరాలు జోడించి, సరికొత్త సింథటిక్ ఐడీలను సృష్టించేవారు.

ఈ నకిలీ ఐడీలతో కెనడాలోని ప్రధాన బ్యాంకుల్లో ఆన్‌లైన్‌లోనే ఖాతాలు తెరిచేందుకు ‘డాల్ఫిన్ యాంటీ’ అనే ప్రత్యేక బ్రౌజర్‌ను వాడారు. ఈ బ్రౌజర్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ సిస్టమ్‌లను సులభంగా దాటవేయగలదు. ఖాతాలు యాక్టివేట్ అయ్యాక, క్రెడిట్ కార్డులను కెనడాలోని నలుగురి చిరునామాకు తెప్పించుకునేవారు. ఆ కార్డుల క్రెడిట్ లిమిట్ మొత్తం వాడేసి, వాటిని పారేసేవారు. నష్టాలను పరిశీలించే క్రమంలో బ్యాంకు అధికారులు ఇవి నకిలీ గుర్తింపులని గుర్తించారు.

కొనసాగుతున్న దర్యాప్తు
లాహోర్‌లో అరెస్టయిన నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, నకిలీ కెనడా పాస్‌పోర్టుల ప్రింటెడ్ కాపీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సీసీఐఏ అదనపు డైరెక్టర్ అతిఫ్ అమీర్ తెలిపారు. కొంతకాలంగా ఈ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టినట్లు ఆయన చెప్పారు. అయితే, కెనడాలోని నలుగురు భారతీయులను స్థానిక అధికారులు అరెస్ట్ చేశారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. అలాగే, ఏయే బ్యాంకులు మోసపోయాయి, మొత్తం నష్టం ఎంత అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. స్వాధీనం చేసుకున్న డివైజ్‌లను విశ్లేషించి, ఈ నెట్‌వర్క్ పూర్తి స్థాయిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.