బజాజ్ ఆటో భారత మార్కెట్లో కొత్త పల్సర్ ఎన్‌250ఎస్‌ఎస్‌ బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.1,59,406గా నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పల్సర్ ఎన్‌250కి అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చింది. ఇంజిన్‌, గేర్‌బాక్స్‌, డిస్‌ప్లే సహా పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌, క్విక్‌షిఫ్టర్‌, 5 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్‌ వంటి ఫీచర్లు కొత్త బైక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

డిజైన్‌ పరంగా పల్సర్‌ కుటుంబానికి చెందిన స్పోర్టీ రూపాన్ని కొనసాగించింది. బాడీపై పదునైన గీతలు, కొత్త పెయింట్‌ ఆప్షన్లు, తాజా గ్రాఫిక్స్‌ అందించారు. హెడ్‌ల్యాంప్‌ డిజైన్‌ మాత్రం సాధారణ ఎన్‌250 మోడల్‌కు దగ్గరగా ఉంది.

ఇంజిన్‌ విషయానికి వస్తే.. ఇందులో 249 సీసీ ఎయిర్‌-కూల్డ్‌, ఆయిల్‌-కూల్డ్‌ ఇంజిన్‌ను అప్‌డేట్‌ చేశారు. నాలుగు వాల్వ్‌లతో పనిచేసే ఈ ఇంజిన్‌ 25 హెచ్‌పీ పవర్‌, 22 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ ఎన్‌250లో 24.5 హెచ్‌పీ పవర్‌, 21.5 ఎన్ఎం టార్క్‌ లభిస్తాయి. అంటే కొత్త మోడల్‌లో స్వల్పంగా పవర్‌, టార్క్‌ పెరిగాయి. పాత 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ స్థానంలో 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు. క్లచ్‌ ఉపయోగించకుండా గేర్లు పెంచేందుకు వీలుగా స్పోర్ట్స్‌ షిఫ్టర్‌ ఫీచర్‌ను కూడా స్టాండర్డ్‌గా అందించారు.

ఫీచర్ల పరంగా కొత్త బైక్‌లో ఎలక్ట్రానిక్‌ థ్రాటిల్‌ బాడీని ప్రవేశపెట్టారు. ఇది ఏబీఎస్‌ మోడ్‌లతో కలిసి రైడింగ్‌ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. అయితే, ఆయా మోడ్‌ల పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. పాత ఎల్‌సీడీ డిస్‌ప్లే స్థానంలో గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌ సదుపాయం ఉన్న 5 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇందులో ల్యాప్‌ టైమర్‌, వాహన పత్రాలను భద్రపరిచే సదుపాయం కూడా ఉంది. అడ్జస్టబుల్‌ లివర్లు, యూఎస్‌బీ టైప్‌-సీ ఛార్జింగ్‌ పోర్ట్‌, హజార్డ్‌ స్విచ్‌, అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు హెచ్చరించే పానిక్‌ బ్రేక్‌ అలర్ట్‌ ఫీచర్లను జోడించారు. సాధారణ పల్సర్‌ ఎన్‌250తో పోలిస్తే ఈ కొత్త మోడల్‌ ధర రూ.14,000 ఎక్కువ.