అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌పై ఓ ఉద్యోగిని సంచలన ఆరోపణలు చేశారు. సంస్థలో ఉన్నత హోదాలో పనిచేస్తున్న అధికారి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. దీనిపై కంపెనీకి తెలియజేసినా సమగ్ర విచారణ జరపలేదని, ఘటన గురించి బయట మాట్లాడకుండా తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు న్యూయార్క్‌ పోస్ట్‌, సియాటిల్‌ టైమ్స్‌ వార్తా కథనాలు ప్రచురించాయి.

అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌)లో మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న లారా డాన్‌బోమ్‌ ఈ దావా వేశారు. 2023 అక్టోబరు 27న పని నిమిత్తం న్యూయార్క్‌ వెళ్లిన సమయంలో సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న మైకెలాంజెలో సిమోంటే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సిమోంటే మాడ్రిడ్‌లో పనిచేస్తున్న అడ్వర్టైజ్‌మెంట్‌ విభాగం అధికారి అని పేర్కొన్నారు.

దావాలో పేర్కొన్న వివరాల ప్రకారం.. లారా, సిమోంటే సహా పలువురు సహోద్యోగులు న్యూయార్క్‌లో అమెజాన్‌ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడి నుంచి కరావోకే బార్‌లకు వెళ్లారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులను కంపెనీయే భరించింది. ఆ పర్యటనలోనే తనపై అత్యాచారం జరిగిందని లారా ఆరోపించారు.

ఘటనపై ఫిర్యాదు చేసిన తర్వాత అమెజాన్‌ తనకు సరైన న్యాయం చేయలేదని లారా పేర్కొన్నారు. ఆరోపణల గురించి ఆఫీసులో మాట్లాడకూడదని చెప్పడంతో పాటు, తాను ఆరోపించిన అధికారితో వృత్తిపరమైన సంబంధాలు కొనసాగించాల్సిన పరిస్థితి కల్పించారని దావాలో తెలిపారు. దీనివల్ల ఆఫీసులో తనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని ఆరోపించారు. ఉద్యోగులపై వేధింపులు, వివక్ష, లైంగిక దాడులకు సంబంధించిన అంశాలపై మాట్లాడకుండా అడ్డుకోవడాన్ని పరిమితం చేసే వాషింగ్టన్‌ రాష్ట్ర చట్టాన్ని కూడా కంపెనీ ఉల్లంఘించిందని పేర్కొన్నారు.

ఘటన జరిగిన కొన్ని రోజులకే పోలీసులు తనను విచారించారని, డీఎన్‌ఏ ఆధారాలున్న కండోమ్‌ను అందజేశానని లారా తెలిపారు. అయితే, ఆ ఆధారాలను సిమోంటే డీఎన్‌ఏ నమూనాతో పోల్చేందుకు పోలీసులు చర్యలు తీసుకోలేదని దావాలో ఆరోపించారు. కంపెనీ కూడా ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరపలేదని ఆమె తరఫు న్యాయవాది జే ఫ్రీ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కోర్టులో ఇంకా విచారణ పూర్తికాలేదు.