జమ్మూ – శ్రీనగర్ జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ జవాన్లు చూపిన మానవత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. జాతీయ రహదారిపై గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఒక డ్రైవర్ ప్రాణాలను జవాన్లు  సమయస్ఫూర్తితో కాపాడారు. సీపీఆర్ చేసి, ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించగా, అతని ప్రాణాలు నిలిచాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వివరాల్లోకి వెళ్తే, సీఆర్పీఎఫ్ 90వ బెటాలియన్ జవాన్లు అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహరా వద్ద జాతీయ రహదారిపై 'రూట్ ఓపెనింగ్ పార్టీ' (ROP) విధుల్లో ఉన్న సమయంలో ఒక డ్రైవర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై తన వాహనాన్ని ఆపి, రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన జవాన్లు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని వద్దకు పరుగెత్తారు.

డ్రైవర్‌కు గుండెపోటు లక్షణాలు ఉన్నట్లు గ్రహించిన జవాన్లు వెంటనే అతనికి సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రథమ చికిత్స మందులు అందించి, అతని పరిస్థితిని నిలకడగా మార్చారు. అనంతరం, బాధితుడిని సమీపంలోని బిజ్‌బెహరా సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో వైద్య సహాయం అందడంతో డ్రైవర్ ప్రాణాలు నిలిచాయని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై 90వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కమలేన్ ప్రతాప్ సింగ్ స్పందిస్తూ, "విలువైన ప్రాణాన్ని కాపాడటం మా కర్తవ్యం. అది నెరవేర్చినందుకు సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు. విధి నిర్వహణకు మించి మానవత్వాన్ని ప్రదర్శించిన జవాన్లను ఉన్నతాధికారులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.