దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్, ఒక సోషల్ మీడియా పేజ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన వదినను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలతో ఒక రీల్ పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. ఈ ఘటనపై సారా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఘాటుగా స్పందించారు.

ఓ సోషల్ మీడియా అకౌంట్.. సారా, ఆమె వదిన ఉన్న వీడియోను అనుచితమైన క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ను చూసిన సారా, దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "మీరు అసహ్యంగా ఉన్నారు. ఇది జర్నలిజం కాదు. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి" అని మండిపడ్డారు. ఆ తర్వాత ఆ పేజ్ ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. దీనిపై కూడా స్పందిస్తూ.. "మీరు పోస్ట్ డిలీట్ చేయొచ్చు, కానీ దానివల్ల మీ అసహ్యకరమైన ప్రవర్తన మారదు" అని సదరు అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ మరో స్టోరీ పెట్టారు.

ఇటీవలే సారా సోదరుడు, క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ వివాహం జరిగింది. ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త సానియా చందోక్‌ను మార్చి 5న వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సారా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సోషల్ మీడియా పేజ్ ల నుంచి ఆమె ఈ అనుచిత వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది.