విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్, ఇప్పుడు పూర్తిస్థాయి యాక్షన్ అవతారంలోకి మారుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రానికి 'సమవర్తి' అనే టైటిల్‌ను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు అజయ్ నాగ్ వి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇందులో సత్యదేవ్ హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ప్రశాంతంగా సంగీతం వింటుండగా, ఆయనపై గొడ్డళ్లు, కత్తులతో కొందరు వ్యక్తులు దాడికి వస్తున్నట్లు చూపించారు. పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో పులి బొమ్మ ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ, "ఈసారి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం!!" అని సత్యదేవ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

నాయకుడిగా సత్యదేవ్‌కు ఇది 16వ చిత్రం. 'ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్' అనే కొత్త జానర్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రకృతి నేపథ్యంలో సాగే యాక్షన్, పర్యావరణ సంఘర్షణల కలయికతో ఈ చిత్రం ఉండనుంది. రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ బ్యానర్లపై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ 'సమవర్తి'ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గానవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సింజిత్ యర్రమిల్లి సంగీతం అందిస్తుండగా, హర్ష మల్లికార్జున్, దేవ్ దీప్ గాంధీకుండు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.