ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై వేటు పడేలా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో జట్టు ఘోర వైఫల్యంతో యాజమాన్యం గుర్రుగా ఉంది. ‘‘అతడికి చాలా అవకాశాలు ఇచ్చాం’’ అంటూ తాజాగా బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి.

కెప్టెన్‌గా పాండ్యా ఫెయిల్
ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ సీజన్‌లో ఆ జట్టు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా జట్టును నడిపించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లోనూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

కోచ్ పొలార్డ్ ఏమన్నారంటే?
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ ముంబై ఓడిపోయింది. అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో కోచ్ పొలార్డ్ మాట్లాడాడు. హార్దిక్ కెప్టెన్సీ ఆశించిన స్థాయిలో సాగలేదని కుండబద్దలుకొట్టాడు. మేనేజ్‌మెంట్ ఆశించిన ఫలితాలను పాండ్యా రాబట్టలేకపోయాడని స్పష్టం చేశాడు.

మేమంతా ప్రయత్నించాం
హార్దిక్ పాండ్యాకు మేనేజ్‌మెంట్ పూర్తి మద్దతు ఇచ్చిందని పొలార్డ్ తెలిపాడు. అతడు బాగా రాణించడానికి అన్ని అవకాశాలు కల్పించామని చెప్పాడు. అయితే మైదానంలో వ్యూహాలు అస్సలు వర్కౌట్‌ కాలేదన్నాడు. ఈ ఓటమికి ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయలేమని వ్యాఖ్యానించాడు.

జట్టులో మార్పులు
త్వరలోనే జట్టు భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నాడు. రాబోయే రోజుల్లో ముంబై జట్టులో మార్పులు ఉంటాయని హింట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడున్న బాధలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోమన్నాడు. అందరూ కూర్చొని లోపాలను సమీక్షించుకుంటామని వివరించాడు.

బుమ్రాకు రెస్ట్ అందుకే
చివరి మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంపై పొలార్డ్ స్పందించాడు. బుమ్రా భారత క్రికెట్‌కు దొరికిన ఒక అద్భుతమైన రత్నమన్నాడు. జట్టు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిందని గుర్తు చేశాడు. అందుకే యువకులను పరీక్షించడానికి బుమ్రాకు రెస్ట్ ఇచ్చామని చెప్పాడు.