హామీలు నెరవేర్చాకే ఎన్నికల్లో పోటీ చేయాలి: సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

KTR Challenges CM Revanth Reddy on Fulfilled Promises Before Elections
  • 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేశాకే ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎంకు కేటీఆర్ సవాల్
  • ఫార్మర్స్‌ డిస్కం పేరుతో 24 గంటల ఉచిత విద్యుత్‌ను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర
  • రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేసిన కేటీఆర్
  • ఇందిరమ్మ ఇళ్లు సహా ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శ
  • ఫార్మర్స్‌ డిస్కం రైతుల మెడకు ఉరితాడుగా మారుతుందని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేశాకే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం చెప్పడం ప్రజలను మరోసారి మోసం చేయడానికేనని ఆయన ఆరోపించారు.

ఆదివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఫార్మర్స్ డిస్కం ఏర్పాటు ప్రతిపాదన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. రైతులకు కేసీఆర్ అందించిన 24 గంటల ఉచిత విద్యుత్‌ను రద్దు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

"ఫార్మర్స్ డిస్కం అనేది రైతుల మెడకు ఉరితాడు. ఉచిత విద్యుత్‌ను పూర్తిగా ఎత్తివేయడమే దీని అంతిమ లక్ష్యం" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సహా ఏ ఒక్క హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను రైతులు, పట్టణ ప్రజలు కూడా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో పరిశ్రమలు పవర్ హాలిడేలు ప్రకటించేవని, రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చి, దేశంలోనే తొలిసారిగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Go Back to Shorts
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
Telangana elections
Congress party
BRS party
Farmers Discom
Free electricity
Agriculture
Telangana politics

More Telugu News