ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలోని షేర్లలో భారీ అమ్మకాలు ఆసియా స్టాక్‌ మార్కెట్లను కుదిపేశాయి. దక్షిణ కొరియా కోస్పీ సూచీ శుక్రవారం 8.2 శాతం కుప్పకూలగా, జపాన్‌ నిక్కీ 225 సూచీ దాదాపు 5 శాతం నష్టపోయింది. తీవ్ర అమ్మకాలతో కొరియా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 20 నిమిషాల పాటు ప్రోగ్రామ్‌ ట్రేడింగ్‌ను నిలిపివేసింది. మొహర్రం నేపథ్యంలో ఈరోజు భారత స్టాక్‌ మార్కెట్లు పనిచేయడం లేదు.

హాంకాంగ్‌ హ్యాంగ్‌సెంగ్‌ 2.4 శాతం, చైనా సీఎస్‌ఐ300 2.9 శాతం, షాంఘై కాంపోజిట్‌ 2 శాతానికి పైగా పడిపోయాయి. జపాన్‌ను మినహాయించిన ఎంఎస్‌సీఐ ఆసియా-పసిఫిక్‌ సూచీ కూడా 3.8 శాతం క్షీణించింది. గత ఏడాది కాలంలో ఇదే అతిపెద్ద వారాంత పతనంగా మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఈ అమ్మకాలకు అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రధాన కారణంగా నిలిచింది. మెమరీ, స్టోరేజ్‌ చిప్‌ల ధరలు పెరగడంతో ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌ ధరలను పెంచుతున్నట్లు యాపిల్‌ ప్రకటించింది. దీంతో కంపెనీ షేరు 6.1 శాతం పడిపోగా, ఒక్క రోజులోనే దాదాపు 250 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ ఆవిరైంది. పెరుగుతున్న చిప్‌ వ్యయాలు ఏఐ రంగం లాభాలపై ప్రభావం చూపుతాయనే ఆందోళన ఇన్వెస్టర్లలో పెరిగింది.

అదే సమయంలో త్రైమాసికం ముగింపునకు రావడంతో పెట్టుబడిదారులు భారీగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఇప్పటికే ఏఐ షేర్ల విలువలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో రిస్క్‌ తగ్గించుకునేందుకు చాలామంది విక్రయాలు చేపట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది ఏఐ బూమ్‌కు ముగింపు కాదని, ఇటీవల నమోదైన భారీ ర్యాలీ తర్వాత వచ్చిన సహజమైన కరెక్షన్‌గా మాత్రమే చూడాలని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.