యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి టీమిండియా తరఫున ఆడే అవకాశం కల్పించడంలో మరింత ఆలస్యం చేస్తే అతడిపై ఒత్తిడి పెరుగుతుందని భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్‌తో తొలి టీ20లోనూ వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై ఆయన స్పందించారు. అవకాశం ఎంత ఆలస్యమైతే అతడిపై అంతగా అంచనాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

‘‘వైభవ్‌కు అవకాశం వచ్చినప్పుడు వెంటనే తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ఆలస్యం అతడిపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. అయితే 15 ఏళ్ల వయసులో ఆటగాళ్లు ఒత్తిడి గురించి ఎక్కువగా ఆలోచించరు’’ అని గవాస్కర్‌ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ భారత జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లతో కలిసి ఉండడం, వారి నుంచి నేర్చుకోవడం వైభవ్‌కు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

ఐర్లాండ్‌ సిరీస్‌లోనూ బెంచ్‌కే పరిమితమైన వైభవ్‌కు, ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో కూడా అవకాశం లభించలేదు. సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌లతో కూడిన ఓపెనింగ్‌ కాంబినేషన్‌పైనే జట్టు యాజమాన్యం మరోసారి నమ్మకం ఉంచింది. కాగా వర్షం కారణంగా ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌ ఫలితం తేలకుండా రద్దయింది.