వర్షాకాలంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తరచుగా గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అంటూ రంగుల కోడ్‌లతో హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి ఉపయోగించే ఈ హెచ్చరికలకు నిర్దిష్ట అర్థాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవడం ద్వారా రాబోయే ప్రమాదాన్ని అంచనా వేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

గ్రీన్ అలర్ట్: వాతావరణం సాధారణంగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని దీని అర్థం. మీ పనులను యథావిధిగా కొనసాగించవచ్చు.

ఎల్లో అలర్ట్: అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. 24 గంటల్లో 64.5 మి.మీ నుంచి 115.5 మి.మీ వరకు ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రయాణాల్లో చిన్నపాటి అంతరాయాలు కలగవచ్చు.

ఆరెంజ్ అలర్ట్: భారీ వర్షాలకు సిద్ధంగా ఉండాలని ఇది హెచ్చరిస్తుంది. 24 గంటల్లో 115.6 మి.మీ నుంచి 204.4 మి.మీ వరకు వర్షం కురవొచ్చు. రోడ్లపై నీరు నిలవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది. అనవసర ప్రయాణాలు మానుకోవడం మంచిది.

రెడ్ అలర్ట్: ఇది అత్యంత తీవ్రమైన హెచ్చరిక. 24 గంటల్లో 204.5 మి.మీ కంటే ఎక్కువ అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వరదలు, ఆస్తి నష్టం, రవాణా వ్యవస్థ స్తంభించడం వంటి తీవ్ర పరిణామాలు ఉండొచ్చు. అధికారులు సూచిస్తే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి ఉంటుంది.

హెచ్చరికలు ఎందుకు మారుతుంటాయి?
గాలి వేగం, తేమ, ఉష్ణోగ్రత వంటి అంశాల వల్ల వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతుంటాయి. ఐఎండీ తన రాడార్లు, శాటిలైట్ల నుంచి వచ్చే తాజా సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు హెచ్చరికలను సవరిస్తుంది. అందుకే పాత సమాచారంపై ఆధారపడకుండా, ఎప్పటికప్పుడు ఐఎండీ విడుదల చేసే తాజా బులెటిన్‌లను గమనిస్తూ ఉండటం చాలా ముఖ్యం.